AP RTA Smart Cards: ఆర్టీఏ స్మార్ట్ కార్డులు వచ్చేశాయ్.. నాలుగేళ్లకు పైగా జనం నిరీక్షణ
08 February 2024, 10:13 IST
- AP RTA Smart Cards: డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు జారీ కాక ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ప్రజలకు ఆర్టీఏ తీపి కబురు చెప్పింది. వెయిటింగ్‌లో ఉన్న స్మార్ట్ కార్డులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
రవాణా కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల విడుదల
AP RTA Smart Cards: ఆంధ్రప్రదేశ్‌లో రవాణా కార్యాలయాల్లో కొన్నేళ్లుగా నిలిచిపోయిన స్మార్ట్ కార్డ్‌ల జారీ మళ్లీ మొదలైంది. దాదాపు నాలుగున్నరేళ్లుగా ఏపీలో డ్రైవింగ్‌లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డుల జారీకి స్మార్ట్ కార్డుల కొరత ఏర్పడింది.
చిప్‌తో కూడిన స్మార్డ్ కార్డుల కొనుగోలులో వివాదాలు తలెత్తడంతో వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులకు తప్ప లేదు. కేవలం డిజిటల్ కాపీలు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని రవాణా శాఖ చేతులు దులుపుకుంది. దీంతో గత కొన్నేళ్లుగా ప్రజలకు రకరకాల సమస్యలు తలెత్తాయి.
ప్రధానంగా వాహనాల తనిఖీ సమయంలో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డులను చూపలేక ఇబ్బందులకు గురయ్యేవారు. డిజిటల్ కాపీలు చెల్లుబాటు అవుతాయని ప్రకటించినా ఆచరణలో మాత్రం ఇబ్బందులు తప్పేవి కాదు. గత కొన్నేళ్లుగా స్మార్ట్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరగడంతో తిరిగి వాటిని జారీ చేయడం ప్రారంభించారు.
ప్రజలకు పోస్టు ద్వారా పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. రిజిస్టర్ పోస్టుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు పంపుతున్నారు. చిరునామాలు లేక తిరిగివచ్చిన ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సుల స్మార్ట్ కార్డులను కార్యాలయంలో అంద చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు ప్రకటించారు.
వాహన రిజిస్ట్రేషన్లు, వాహనాల బదిలీల సమయాలలో పేర్కొన్న చిరునామా ప్రకారం పోస్టు ద్వారా స్మార్ట్ కార్డులను పంపుతున్నట్లు తెలిపారు. వాహన యజమానులు వాటిని అందుకోలేకపోతే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సుల స్మార్ట్ కార్డులు తిరిగి కార్యాలయానికి తిరిగి వస్తున్నాయని చెప్పారు.
ఆర్టీఏ కార్యాలయానికి తిరిగొచ్చిన స్మార్ట్ కార్డులను కార్యాలయంలొనే నేరుగా తీసుకొనే వెసులుబాటును కల్పిస్తున్నామని డిటిసి యం పురేంద్ర తెలిపారు. వాహన చోదకులు, వాహన యజమానులు తమ గుర్తింపు కార్డుతో వచ్చి ఆర్సీ డ్రైవింగ్ లైసెన్సుల కార్డులను పొందొచ్చన్నారు.
ఆర్సీ డ్రైవింగ్ లైసెన్సుల కార్డులను అందజేయడానికి ప్రతి శుక్ర, శనివారాల పని దినాలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేస్తూన్నమని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. పరివాహన్ వెబ్సైట్ లో నమోదైన కొత్త రిజిస్ట్రేషన్లు, వాహన బదిలీలకు సంబంధించి ఆర్సీలను, డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ కు సంబంధించిన డీఎల్ కాపీలను డౌన్లోడ్ చేసుకోవాలని డీటీసీ సూచించారు.