తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Political Bureaucrats: ఎన్నికల సీజన్ స్టార్ట్… పార్టీల్లోకి రిటైర్డ్‌ బ్యూరోక్రాట్స్‌

Political Bureaucrats: ఎన్నికల సీజన్ స్టార్ట్… పార్టీల్లోకి రిటైర్డ్‌ బ్యూరోక్రాట్స్‌

Sarath chandra.B HT Telugu

01 February 2024, 12:31 IST

    • Political Bureaucrats: ఎన్నికల సీజన్ ప్రారంభం కావడంతో రాజకీయ పార్టీల్లో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రిటైర్డ్‌ బ్యూరోక్రాట్స్‌ పోటీ పడుతున్నారు. 
బిఆర్‌ఎస్‌ను వీడి వైసీపీలో చేరిన రావెల కిషోర్ బాబు
బిఆర్‌ఎస్‌ను వీడి వైసీపీలో చేరిన రావెల కిషోర్ బాబు

బిఆర్‌ఎస్‌ను వీడి వైసీపీలో చేరిన రావెల కిషోర్ బాబు

Political Bureaucrats: ఏపీలో ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో రాజకీయ ఆశావహులు పార్టీల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. ఉద్యోగంలో ఉండగా రాజకీయ పార్టీల వద్ద సాధించిన ప్రాపకంతో వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పలువురు రిటైర్డ్‌ బ్యూరో క్రాట్స్‌ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వారు కూడా అటు నుంచి ఇటు జంప్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన రావెల కిశోర్‌ బాబు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కిశోర్‌ బాబును మంత్రి పదవి నుంచి అవమానకరంగా తొలగించడంతో మనస్తాపం చెంది టీడీపీని విడిచిపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లు బీజేపీలో ఉన్నారు. అక్కడ కూడా ఇమడలేక గత ఏడాది కేసీఆర్‌ దేశ వ్యాప్తంగా రాజకీయాలు విస్తరించే క్రమంలో నెలకొల్పిన బిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పరాజయం పాలయ్యాక ఆయన తన దారి తాను చూసుకున్నారు.

ఈ క్రమంలో బుధవారం మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరారు. గత కొంత కాలంగా రావెల పార్టీ మారబోతున్నారంటూ వస్తోన్న వార్తలను నిజం చేస్తూ ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో రావెల కిశోర్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.రావెల కిషోర్‌ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి సీఎం జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రావెల కిశోర్‌కు పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. పదవులు ఆశించి వైసీపీలోకి రాలేదని రావెల కిశోర్ అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చూసి వైసీపీలో చేరానని స్పష్టం చేశారు. అందరిని కలుపుకుని ముందుకు వెళ్తానని అన్నారు. పార్టీలో చేరిక సందర్భంగా టికెట్ల విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని క్లారిటీ ఇచ్చారు

రావెలతో పాటు గుంటూరుకు చెందిన మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి చుక్కా విల్సన్‌ బాబు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.

అదే బాటలో మరికొందరు బ్యూరోక్రాట్లు…

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంల మరికొందరు బ్యూరోక్రాట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌ ఇప్పటికే పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వివేకం పేరుతో తడ నుంచి పాదయాత్ర నిర్వహించారు.

రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సొంతంగా పోటీ చేస్తారా, ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా అనే విషయంలో స్పష్టత కొరవడింది. గోదావరి జిల్లాల్లో ఏదో ఒక నియోజక వర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని, లోక్‌సభకు కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఇక ఏపీ ఏపీ పోలీస్‌ శాఖలో డీజీ హోదాలో పనిచేస్తున్న ఐపిఎస్‌ అధికారి పివి.సునీల్ కుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎయిమ్ పేరుతో దళిత వాడల్ని ప్రత్యేక పంచాయితీలుగా గుర్తించాలనే డిమాండ్‌తో సునీల్‌ కొన్నేళ్లుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరికొంత కాలం సర్వీస్‌ ఉండగానే క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ప్రచారం జరుగుతోంది. అమలాపురం పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఆ‍యన ఎన్నికల బరిలోకి దిగుతారని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో పివి.సునీల్ పెదవి విప్పడం లేదు.

వీరితో పాటు మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారులు ఉప్పులేటి దేవి ప్రసాద్, మాజీ హోంమంత్రి భర్త విద్యా సాగర్, పశ్చిమ గోదావరిలో ఎలిజా, మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్, వర్ల రామయ్య, రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు వంటి వారు వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో ఎంతమందిని అదృష్టం వరిస్తుందో, రాజకీయ పార్టీలు పోటీకి అవకాశం ఇస్తాయో చూడాలి.

తదుపరి వ్యాసం