Rtd ASP Arrest: మాజీ ఎంపీ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో రిటైర్ట్ ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్
27 November 2024, 8:22 IST
- Rtd ASP Arrest: వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కేసులో రిటైర్డ్ ఏఎస్సీ విజయ్‌పాల్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించడంతో ప్రకాశం ఎస్సీ ఎదుట విచారణకు హాజరైన రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను అరెస్ట్ చేసినట్టు విచారణ అధికారి ప్రకటించారు.
రఘురామ కృష్ణరాజు కేసులో ఏఎస్పీ విజయ్‌పాల్ అరెస్ట్
Rtd ASP Arrest: మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత అడిషనల్ ఎస్పీ, ఓఎస్డీ ఆర్. విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌పాల్ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు, రాత్రి 9 గంటల సమయంలో విజయ్‌పాల్‌ని అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతకు ముందు ఏపీ హైకోర్టు విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విజయపాల్ ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు సైతం ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించడంతో మంగళవారం ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
విచారణలో తనకు ఏమి గుర్తు లేదని విచారణకు సహకరించలేదని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు సుదీర్ఘంగా విజయ్‌పాల్‌ను విచారించారు. అనంతరం విజయ్‌పాల్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ఈ మేరకు విజయ్‍పాల్ రిమాండ్ రిపోర్టును పోలీసులు సిద్ధం చేశారు. విజయపాల్‌ను రాత్రికి ఒంగోలు పోలీస్ స్టేషన్లోనే ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం గుంటూరు తరలించనున్నారు.
ఏమి జరిగిందంటే…
2021లో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ రీజనల్ ఆఫీస్‌కి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామకృష్ణరాజు 2024 జులై 11వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, నిఘా విభాగం అధిపతి పీఎస్‌ర్ ఆంజనేయులు, సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విజయపాల్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అక్టోబరు 1వ తేదీన విజయపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు మొదట విజయ్‌పాల్‌కి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. సోమవారం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నతర్వాత రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ పిటిషన్ కొట్టివేసింది.