తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kuwait Victim: కువైట్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రుడికి విముక్తి, నేడోరేపో స్వదేశానికి రానున్న శివ..

Kuwait Victim: కువైట్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రుడికి విముక్తి, నేడోరేపో స్వదేశానికి రానున్న శివ..

Sarath chandra.B HT Telugu

16 July 2024, 7:24 IST

google News
    • Kuwait Victim: దేశం కాని దేశంలో ఒంటరిగా ఎడారిలో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రుడిని ఏపీ ప్రభుత్వ చొరవతో సురక్షితంగా స్వస్థలానికి తరలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాధితుడిని ఇప్పటికే కువైట్‌ భారత రాయబార కార్యాలయానికి తరలించారు. 
కువైట్‌లో చిక్కుకుపోయిన అన్నమయ్య జిల్లాకు చెందిన శివ
కువైట్‌లో చిక్కుకుపోయిన అన్నమయ్య జిల్లాకు చెందిన శివ

కువైట్‌లో చిక్కుకుపోయిన అన్నమయ్య జిల్లాకు చెందిన శివ

Kuwait Victim: ఒంటరిగా ఎడారిలో చిక్కుకుపోయి, తాగేందుకు నీళ్లు కూడా లేని దుర్బర పరిస్థితుల్లో ఓ అభాగ్యుడి దీన పరిస్థితి నుంచి విముక్తి లభించింది. కువైట్‌ ఎడారిలో పశువులు మేపేందుకు వెళ్లి దుర్భర పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన శివ గత నెలలో ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. ఏజెంట్‌కు లక్ష రుపాయలు చెల్లించి అక్కడ పశువుల్ని మేపే పనిలో కుదిరాడు. అయితే ఎడారిలో ఒంటరిగా పశువుల మధ్య వదిలేయడంతో అల్లాడిపోయాడు.

మండుటెండలో పనిచేయలేక, మాట్లాడేందుకు కూడా ఎవరు లేని పరిస్థితిలో రోదిస్తూ బంధువులు, మిత్రులకు పంపిన వీడియో చివరకు ఏపీ మంత్రి నారా లోకేష్‌ను చేరింది. బాధితుడి దీన స్థితిపై లోకేశ్‌ విదేశాంగ శాఖకు లేఖను రాశారు. కువైట్‌లో ఉన్న టీడీపీ సానుభూతి పరుల సహకారంతో బాధితుడిని భారత రాయబార కార్యాలయానికి చేర్చారు.

బాధితుడిని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి గ్రామానికి చెందిన అయివేత శివ(36)కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బతుకుదెరువు కోసం గత నెలలో రాయచోటికి చెందిన ఏజెంట్‌కు లక్ష చెల్లించి కువైట్ వెళ్లాడు. అక్కడ పరిస్థితులు తిరిగి వచ్చేయాలని భావించినా మరో లక్ష చెల్లిస్తే ఏర్పాటు చేస్తానని చెప్పడంతో శివ విలవిల్లాడిపోయాడు.

కువైట్- ఇరాక్‌ సరిహద్దులో ఉన్న ఎడారిలో ఒంటెలు, బాతులు మేపుతూ వాటికి కాపాల కాసే కుక్కలకు నీళ్లు పోసే పనిలో ఏజెంట్ కుదిర్చాడు. ఎడారిలో మొక్కలకు నీళ్లు పోయాల్సిన పరిస్థితి, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితుల్ని వీడియోలో మిత్రులు, బంధువులకు పంపాడు. అతని దీన పరిస్థితి తెలియడంతో నారా లోకేష్‌ విదేశాంగ శాఖను సంప్రదించారు.

కువైట్ టీడీపీ విభాగానికి సమాచారం ఇవ్వడంతో పార్టీ అభిమానులు భాషా, జాబీర్‌లు శివ అచూకీ కోసం ప్రయత్నించారు. స్థానిక ఏజెంట్ల సాయంతో ఇరాక్‌ సరిహద్దుల్లో ఉన్నట్టు గుర్తించారు. సోమవారం శివ అచూకీ గుర్తించి భారత రాయబార కార్యాలయానికి తీసుకొచ్చి అప్పగించారు. అప్పటికే భారత విదేశాంగ శాఖ నుంచి సమాచారం అందడంతో రాయబార కార్యాలయ ఆదేశాలతో శివను పనిలో పెట్టుకున్న యజమాని అతని పాస్‌పోర్ట్‌ ఎంబసీలో అప్పగించాడు. మంగళ, బుధవారాల్లో భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కువైట్‌లో శివ పడుతున్న కష్టాలపై ట్విట్టర్‌లో పెట్టిన వీడియోకు నారా లోకేశ్‌ గత ఆదివారం స్పందించారు. సాయం అందకపోతే చావే దిక్కంటూ వీడియోలో శివ వేడుకున్నాడు. శివను రక్షించేందుకు ప్రయత్నించాలని టీడీపీ ఎన్నారై విభాగానికి లోకేశ్‌ సూచించడంతో అతని కథ సుఖాంతమైంది.

అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ శంకరమ్మ దంపతులు గ్రామంలో అద్దె ఇంటిలో ఉండేవారు. కూలీ పనులు, పశువులు మేపి ఉపాధి పొందేవాడు. డబ్బు సంపాదించేందుకు కువైట్‌కు వెళ్లేందుకు రాయచోటికి చెందిన ఏజెంట్‌ హైదర్‌ ద్వారా గత నెలలో కువైట్‌కు వెళ్లారు. ఎడారిలో ఎలాంటి సదుపాయాలు లేకపోవడం, ఆహారం, నీరు లేకపోవడంతో తట్టుకోలేకపోయాడు. ఏజెంట్‌ కూడా డబ్బులిస్తేనే వెనక్కి తెస్తానని తేల్చేయడంతో బాధితుడు పంపిన వీడియో వైరల్‌గా మారింది.

తదుపరి వ్యాసం