CM Jagan Raitu Bharosa: రాష్ట్ర నిధులతోనే రైతు భరోసా.. పిఎం కిసాన్ నిధులు పెండింగ్‌లోనే!
07 November 2023, 12:18 IST
- CM Jagan Raitu Bharosa: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రైతులకు రైతు భరోసా విడుదల చేస్తున్నట్లు సిఎం జగన్ పుట్టపర్తిలో ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన పిఎం కిసాన్ నిధులు వచ్చిన తర్వాత మిగిలిన నగదు జమ చేస్తామని ప్రకటించారు.
రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం జగన్
CM Jagan Raitu Bharosa: ఆంధ్రప్రదేశ్‌లో 53.53లక్షల మంది రైతులకు మంచి జరిగేలా రైతుల ఖాతాలకు రైతు భరోసా ద్వారా రూ.2200కోట్ల రుపాయలు జమ చేస్తున్నట్లు సిఎం జగన్ చెప్పారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. రైతు భరోసా పథకంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.1200కోట్లు రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లో నేరుగా జమ అవుతాయన్నారు.
కేంద్రం నుంచి పిఎం కిసాన్ ద్వారా రావాల్సిన మరో వెయ్యి కోట్ల సాయాన్ని కేంద్రం విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు. రైతు భరోసా కార్యక్రమానికి ముందే నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరానని, ఇదేనెలలో కేంద్రం డబ్బులు విడుదల చేస్తామని చెప్పారని, రైతులకు సాయం ఆలస్యం అవుతుందని నేడు రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
ఏపీలో 53నెలల ఖాలంలో 53లక్షల పైచిలుకు రైతులకు మంచి జరిగేలా ప్రతి ఒక్కరికి వారి ఖాతాల్లోకి రూ.61,500 చెల్లించినట్లు చెప్పారు. నేడు విడుదల చేసే రూ.4వేలు కలిపితే రూ.65,500 ఒక్కో కుటుంబానికి చెల్లించినట్లు అవుతుందన్నారు. రైతు భరోసా పథకంతోనే 53లక్షల మందికి మంచి చేసేలా రూ.33,209కోట్లను ఒక్క పథకంతో నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపించినట్లు చెప్పారు.
రైతులు, అవ్వతాతలు, చదువుకునే పిల్లలు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి చేస్తే వారి గుండెల్లో స్థానం ఇస్తారనే ఉద్దేశంతో సంక్షేమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్‌ను చూసినా, జగన్‌ను చూసినా ఇది అర్థం అవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నాయకత్వ స్థానంలోకి తీసుకొచ్చి సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తుంటే పేదల గుండెల్లో పేదలకు ఎలాంటి స్థానం ఉందో అర్థం అవుతుందన్నారు.
53నెలల్లో రైతుకు మంచి జరగాలి, పేదలకు మంచి జరగాలని పని చేసినట్లు చెప్పారు. నిరుపేద వర్గాల ప్రజలు బాగుండాలి, గొప్పగా చదవాలి, ఎదగాలనే తపనతో 53నెలల్లో అడుగులు వేసినట్లు చెప్పారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి అడుగులు వేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వానికి ఇప్పటికి ఎంత తేడా ఉందో గమనించాలన్నారు.
చంద్రబాబు 14ఏళ్ల సిఎంగా ఉన్నా కూడా జగన్ చేసిన పనులు ఎందుకు చేయలేకపోయాడో ఆలోచన చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని
50శాతం మంది అరహెక్టారులోపు రైతులు, ఒక హెక్టారులోపు రైతులు 70శాతం మంది ఉన్నారని... రూ.13,500 సాయం ఇవ్వకపోతే ఇభ్బంది పడతారని భావించి వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో జరగని విధంగా రైతు భరోసా ద్వారా 53లక్షల మంది రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ గిరిజన రైతులు, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులకు సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
14ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నా, మూడు సార్లు సిఎంగా ఉన్నా రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదన్నారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు గతంలో ఎప్పుడు రాష‌్ట్రంలో జరగలేదన్నారు. రైతులకు మంచి చేసే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఏ సీజన్‌లో పంట నష్టాలను అదే సీజన్‌లో అందిస్తున్నట్లు చెప్పారు.