తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gannavaram : ప్రేమ పేరుతో రాత్రి వేళ‌ బాలిక ఇంటికెళ్లిన యువ‌కుడు.. తాళి కట్టించిన బంధువులు!

Gannavaram : ప్రేమ పేరుతో రాత్రి వేళ‌ బాలిక ఇంటికెళ్లిన యువ‌కుడు.. తాళి కట్టించిన బంధువులు!

HT Telugu Desk HT Telugu

07 October 2024, 13:47 IST

google News
    • Gannavaram : ప్రేమ పేరుతో అర్ధ‌రాత్రి బాలిక ఇంటికి వెళ్లిని యువ‌కుడికి.. అక్క‌డ ఊహించని ఘ‌ట‌న ఎదురైంది. ఆ బాలిక మెడ‌లో యువ‌కుడితో బంధువులు తాళి క‌ట్టించారు. పోలీసుల‌కు స‌మాచారం అంద‌టంతో.. ఇరువైపుల కుటుంబస‌భ్యుల‌ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలిక‌ను ప్రజ్వల హోమ్‌కు త‌ర‌లించారు.
బాలికకు తాళి కట్టించిన బంధువులు
బాలికకు తాళి కట్టించిన బంధువులు

బాలికకు తాళి కట్టించిన బంధువులు

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం మండ‌లంలోని ఓ గ్రామంలో శ‌నివారం రాత్రి ఊహించని ఘటన జరిగింది. గ‌న్న‌వ‌రం మండ‌లం ప‌రిధిలోని ఓ గ్రామంలో ఒక బాలిక తన పిన్ని వ‌ద్ద ఉంటుంది. అదే మండ‌లంలోని సూరంప‌ల్లి గ్రామానికి చెందిన గుర్రం శ్రీ‌కాంత్ అనే యువ‌కుడు ఆమెను ప్రేమించాడు. కొన్ని రోజుల త‌రువాత బాలిక‌ కూడా శ్రీ‌కాంత్‌ను ప్రేమించ‌డం మొద‌లుపెట్టింది. ఏడాదిగా వారిద్ద‌రూ ప్రేమించుకుంటున్నారు. అయితే.. కొంత కాలంగా బాలిక ఉంటున్న ఇంటికి గుర్రం శ్రీ‌కాంత్ త‌ర‌చూ వెళ్తున్నాడు.

శ్రీకాంత్ ఆ ఇంటికి వెళ్ల‌డం చుట్టుప‌క్క‌ల వారు గ‌మ‌నించారు. శ‌నివారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువ‌కుడిని బంధువులు ప‌ట్టుకుని తాళ్ల‌తో క‌ట్టేశారు. ఆ యువ‌కుడి గురించి అన్ని వివ‌రాలు ఆరా తీశారు. వివ‌రాలు తెలుసుకున్న అనంత‌రం.. బాలిక‌ను పెళ్లి చేసుకోవాల‌ని ప‌ట్టుప‌ట్టారు. మ‌రోవైపు యువ‌కుడి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు కూడా అక్క‌డికి చేరుకున్నారు. బాలిక‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఆమె త‌ర‌పు బంధువులు కోర‌డంతో యువ‌కుడి త‌ల్లిదండ్రులు స‌సేమీరా అన్నారు.

ఇద్ద‌రు కులాలు వేర్వేరు కావ‌డంతో పెళ్లికి యువ‌కుడి త‌రపు కుటుంబ స‌భ్యులు నిరాక‌రించారు. బాలిక త‌రపున బంధువులు గ్రామ పెద్ద‌ల సమ‌క్షంలో ఆ బాలిక మెడ‌లో శ్రీ‌కాంత్‌తో తాళి కట్టించారు. ఇద్ద‌రికి పెళ్లి అయిన‌ట్లు గ్రామ పెద్ద‌లు ప్ర‌క‌టించారు. అనంత‌రం పోలీస్‌స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. పోలీసులు.. బాలిక‌, యువ‌కుడి కుటుంబ స‌భ్యుల‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

పెళ్లి చేసిన బాలిక మైన‌ర్ అని తెలియ‌డంతో ఐసీడీఎస్‌కు పోలీసులు స‌మాచారం ఇచ్చారు. విజ‌య‌వాడ కృష్ణ‌లంక లోని ఐసీడీఎస్ ప్ర‌జ్వ‌ల హోం ప్ర‌తినిధులు పోలీస్‌స్టేష‌న్‌కు వచ్చి సీఐ శివ‌ప్రసాద్ నుంచి పూర్తి వివ‌రాలు సేక‌రించారు. అనంత‌రం బాలిక‌ను ఉజ్వ‌ల హోంకు త‌ర‌లించారు. సోమవారం అక్టోబర్ 7న చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ ముందు బాలిక‌, యువ‌కుడితో పాటు వారి త‌ల్లిదండ్రుల‌ను కూడా హాజ‌రుప‌ర‌చ‌నున్న‌ట్లు సీడీపీవో పి.వెంక‌ట‌ల‌క్ష్మి తెలిపారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం