Rat in curry : ఎస్పీ దగ్గరకు ఎలుక పంచాయితీ..!
06 December 2022, 17:20 IST
- Anantapur News : ఓ ఎలుక పంచాయితీ జిల్లా ఎస్పీ వరకు వెళ్లింది. హోటల్ వాళ్లు.. తమపై దాడికి దిగారని బాధితులు ఫిర్యాదు చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
అనంతపురం(Anantapur) కమలానగర్లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే దుర్గాంజలి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 2వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో కూరలు వండుకోలేదు. దీంతో దగ్గరలో ఉన్న ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్ దగ్గరకు వెళ్లారు. రూ.50 రూపాయలు ఇచ్చి.. పప్పు, చెట్నీ తెచ్చుకున్నారు. ఇక ఆకలి మీద ఉండటంతో తెరిచి.. అన్నంలోకి పప్పు వేసుకున్నారు. అందులో చనిపోయిన ఎలుక వచ్చింది. అది చూసి షాక్ అయ్యారు.
వెంటనే.. అదే ప్లేటును తీసుకెళ్లి.. కర్రీపాయింట్(Curry Point) దగ్గరకు వెళ్లారు. యజమానికి చూపించి.. కర్రీలో ఎలుక ఏంటి అని ప్రశ్నించారు. అది చూసిన వారు... ఇలా హోటల్స్ లోని ఆహార పదార్థాల్లో ఎలుకలు, బల్లులు రావడం సహజమేనని సమాధానం ఇచ్చారు. దీంతో దుర్గాంజలి దంపతులకు కోపం వచ్చింది. జరిగిందే తప్పు.. ఆపై అలాంటి మాటలు ఏంటనుకున్నారు. ఈ విషయాన్ని ఫుడ్ ఇన్ స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
తమ హోటల్(Hotel) మీద ఫిర్యాదు చేయడంపై ముత్యాలరెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి.. గుర్తు తెలియని వ్యక్తులతో తమ ఇంటిపైకి దౌర్జన్యం చేయిస్తున్నారని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. భయాందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను కలిసి బాధితులు ఫిర్యాదు చేశారు.
చాలామంది హోటల్(Hotel) నిర్వాహకులకు లాభాలు తప్ప ప్రజల ఆరోగ్యంపై పట్టింపు లేదనే విమర్శ ఉంది. మార్కెట్లో లభించే ఆహారం, తినుబండారాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఫుడ్ సెఫ్టీ(Food Safety)పై ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. మరోవైపు అధికారులు సైతం దాడులు చేస్తూ ఉన్నారు. కలుషిత ఆహారం తిని ఇటీవల కాలంలో అస్వస్థతకు గురైన ఘటనలూ చూశాం. అయినా కొంతమందిలో మార్పు రావడం లేదని విమర్శలు ఉన్నాయి.
ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా.. మార్పు రావడం లేదని పలువురు అంటున్నారు. ఇష్టానుసారంగా తయారు చేసి.. ఆ తర్వాత అటువైపు చూడకుండా విక్రయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థలు కూడా ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నాయి. తనిఖీలు చేస్తున్నా.. కల్తీ యథేచ్ఛగా సాగుతోంది. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తూ.. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని కొంతమంది చెబుతున్నారు.