Chandrababu : రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల, టీడీపీ శ్రేణుల ఘనస్వాగతం
31 October 2023, 16:57 IST
- Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికాయి.
చంద్రబాబు
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. అనంతరం ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. 53 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై పలు కోర్టుల్లో విచారణ జరుగుతోంది. అయితే చంద్రబాబు కంటి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని వైద్యుల సూచన మేరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యారు. చంద్రబాబు విడుదలతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజమండ్రి జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ వద్ద సందడి నెలకొంది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు నారా లోకేశ్, బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, టీడీపీ ముఖ్య నేతలు జైలు వద్దకు వచ్చారు.
కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచారు- చంద్రబాబు
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు... టీడీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు తనపై చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ మద్దతుగా నిలిచారన్నారు. తన కోసం రోడ్లపైకి వచ్చి సంఘీభావం ప్రకటించారని, పూజలు చేశారన్నారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబుపై మరిన్ని ఆంక్షలు
ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుంది. రాజమండ్రి నుంచి చంద్రబాబు ఉండవల్లికి రోడ్డు మార్గంలో రానున్నారు. అయితే హైకోర్టు చంద్రబాబుకు మరిన్ని ఆంక్షలు విధించింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు...రేపటి వరకూ చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేయొద్దని ఆదేశించారు. అంతేకాకుండా ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని తెలిపింది. దీంతో పాటు మీడియాతో మాట్లాడొద్దని తెలిపింది. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
మద్యంలో కేసులో చంద్రబాబుకు ఊరట
మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. ఈ కేసులో దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబును ఇరికించారని చంద్రబాబు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ ఇచ్చినందున ఆ గడువు ముగిసే వరకు అరెస్టు చేయబోమని కోర్టుకు తెలిపారు. ఈ మేరకు హైకోర్టుకు ఏజీ శ్రీరామ్ లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. ఈ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణను నవంబరు 21కి వాయిదా వేసినట్లు తెలిపింది.