YSR Rythu Bharosa : రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, ఈ నెల 7న అకౌంట్లలో డబ్బులు జమ
06 February 2024, 19:12 IST
- YSR Rythu Bharosa : సీఎం జగన్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 7న పుట్టపర్తి సభలో రైతులకు నిధులను విడుదల చేయనున్నారు.
సీఎం జగన్
YSR Rythu Bharosa : సీఎం జగన్ ఈ నెల 7వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా ఏటా రూ.7,500 పెట్టుబడి సాయం అందిస్తుంది. దీనిని మూడు విడతల్లో అందజేస్తుంది. అధికారంలోకి వచ్చిన 50 నెలల్లో 52.50 లక్షల మందికి 31 వేల కోట్ల రుపాయలను పీఎం కిసాన్ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించామని వైసీపీ ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయంలో నష్టపోకుండా రైతులను ఆదుకునేందుకు... రైతు భరోసా ద్వారా నాలుగేళ్లుగా నగదు ఖాతాల్లో జమచేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
70 శాతం రైతులకు మేలు
రైతు భరోసా-పీఎం కిసాన్ కింద 70 శాతం రైతులకు ఎంతో మేలు జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఏపీలో 1.25 ఎకరాల్లోపు ఉన్న రైతులు 60 శాతం మంది, రెండున్నర ఎకరాల్లోపు ఉన్న వారు 70 శాతం వరకు ఉన్నారని తెలిపింది. రైతులకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం కింద అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొదటి విడతలో రూ. 7,500, రెండో విడతలో రూ. 4,000, మూడో విడతలో రూ. 2,000 నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలోకి నగదు విడుదల చేస్తున్నారు.
పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన
ఈ నెల 7న పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటించనున్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. పుట్టపర్తి బహిరంగ సభలో రైతు భరోసా నిధులను విడుదల చేస్తారని తెలిపారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రైతు భరోసా పంపిణీ జరుగుతుందన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మొదటిసారి జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 99 శాతం ఎన్నికలు హామీలు చేశామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. మరే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఎన్నికల హామీలు అమలు చేసిన చరిత్ర లేదంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
రైతు ప్రభుత్వం
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. రైతుల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. రైతులకు ఏ ప్రభుత్వం ఇంతలా మేలు చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు.