BJP Purandeswari: ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన పురందేశ్వరి…
12 February 2024, 14:34 IST
- BJP Purandeswari: విద్వేషం... నియంతృత్వం మినహా వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి వాతావరణం లేకుండా పోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి
BJP Purandeswari: ఏపీలో ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావిస్తే కేసులు, అరెస్టులు, అణచివేతలతో భయాందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్థాయి సమావేశానికి పురందేశ్వరి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సైతం తమవిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్నా... వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా అధికారులు అవి కేంద్ర పథకాలుగా వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి వచ్చిందని అన్నారు.
వికసిత్ భారత్ యాత్రలో అర్హత ఉండి పథకాలు అందుకోలేకపోయిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి లబ్ధి చేకూర్చామన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు కేవలం తిరుపతి ఉప ఎన్నికలకే పరిమితం అయ్యానుకుంటే పొరపాటేనని అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా తమ పార్టీ నేతలు అందించిన ఫిర్యాదులపైనే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారులతోపాటు పోలీసు అధికారులపైనా సస్పెన్షన్ వేటు పడిందని అన్నారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే లేఖ రాశామన్నారు.
తమ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను పరిశీలింపజేస్తే రెండు లక్షల 70 వేల ఓట్లకు 61 వేల మంది ఓటర్లు భౌతికంగా స్థానికంగా లేని వారు పేర్లు జాబితాలో కల్పించినట్లు బయట పడిందన్నారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఫేక్ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డులు తయారు చేశారని... కార్డుల్లోని ఫోటోలు బ్లర్ చేసి 35 వేల దొంగఓట్లు డౌన్ లోడ్ చేసినట్లు తెలిపారు. రుజువులతో సహా తాము గుర్తించి చేసిన ఫిర్యాదుల వల్లే అధికారులపై చర్యలు చేపడుతున్నారన్నారు.
ముఖ్యమంత్రి వైనాట్ 175నినాదం వెనుక భారీ కుట్ర ఉందని పురందేశ్వరి అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి దొంగ ఓట్లు... దొంగ ఎపిక్ కార్డులు... బోగస్ ఓటర్ల జాబితాతో లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల వైసీపీ తమ అభ్యర్ధులను ఒక చోట నుంచి మరొక చోటకు మార్పులు చేస్తోందని... అదే సమయంలో ఓటర్లను కూడా గంపగుత్తుగా ఒకచోట నుంచి మరొక చోటకు బదిలీ చేస్తున్నారని అన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన విడుదల రజనిని ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్పారని... ఆమెతో పాటు 10 వేల మంది ఆమె అనుయాయుల పేర్లను కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నమోదు చేయించే ప్రక్రియ జరుగుతోందన్నారు.
ఈ విషయాలను పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండి వీటిని నిలువరించాలని కోరారు. రాష్ట్రాభివద్ధిలో సింహభాగం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధులతోనే అనే విషయాన్ని ప్రజలు సైతం అర్ధం చేసుకుంటున్నారని అన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసిన సేవ, సహకారం, అభివ్రుద్ధి గురించి ఈనెల 20 నుంచి 29 వరకు అసెంబ్లీ స్థాయిల్లో ప్రజలకు వివరించేందుకు ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పాలన... నాయకత్వం పట్ల ఆకర్షితులై ఆరు జిల్లాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరుతున్నారని పురందేశ్వరి తెలిపారు.
ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి పారిశ్రామిక వేత్తలు ఏలూరు రామచంద్రారెడ్డి, కావూరి వాసు, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పారిశ్రామిక వేత్త డాక్టర్ బాల నాగిరెడ్డి, ఐనాబత్తిన సుబ్బారావు, ఖాదర్ వలీసబ్బీ, రామచంద్రారెడ్డి , తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎఎంసి మాజీ డైరెక్టర్, సర్పంచ్ కేతా అమర్ నాథ్ రెడ్డి,తదితరులకు పురందేశ్వరి భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.