తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Political Tours In Ap : రాష్ట్ర వ్యాప్త యాత్రలకు రాజకీయ పార్టీల ఏర్పాట్లు

Political Tours in AP : రాష్ట్ర వ్యాప్త యాత్రలకు రాజకీయ పార్టీల ఏర్పాట్లు

HT Telugu Desk HT Telugu

13 June 2022, 8:28 IST

google News
    • ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలు యాత్రలకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు ముంచుకొస్తాయో తెలీకపోవడంతో పార్టీలన్నీ ఎవరి జాగ్రత్తలో  అవి ఉంటున్నాయి.  ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో విపక్షాలు ప్రజల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్‌ యాత్ర కోసం సిద్ధమైన వాహనాలు
పవన్ కళ్యాణ్‌ యాత్ర కోసం సిద్ధమైన వాహనాలు

పవన్ కళ్యాణ్‌ యాత్ర కోసం సిద్ధమైన వాహనాలు

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు రెండేళ్ల ముందే పొలిటికల్ హీట్‌ పెరుగుతోంది. వచ్చే ఏడాది ముందస్తు ఎన్నికలు రావొచ్చనే అంచనాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు యాత్రలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే తన రాజకీయ యాత్రను ప్రారంభించగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా అన్ని జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు.

అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పుడు ప్రజల్లోనే పోరాటాన్ని తేల్చుకోవాలని భావిస్తున్నాయి. మహానాడుకు ముందు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా రాష్ట్ర వ్యాప్త యాత్రకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అధికార వైసీపీ ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లేలా దాదాపు ఏడెనిమిది నెలలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా రూపొందించారు. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు మొక్కుబడిగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు రచ్చబండ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలతో మమేకమై వారి స్పందన తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు. జులైలో జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీ తర్వాత రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌లలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయని విపక్షాలు అంచనా వేస్తున్నాయి.

 తెలుగుదేశం పార్టీ ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల్ని కూడా ముందే ప్రకటించనుంది. ఈమేరకు చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలకు ఇప్పటికే స్పష్టత  నిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ అభ్యర్ధులు ఎదుర్కొనేలా  ముందుగానే అభ్యర్ధుల్ని ఖరారు చేయనున్నట్లు మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి 26 జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహించి జిల్లా వారీగా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జూన్ 15న విశాఖపట్నంలో మినీమహానాడు కార్యక్రమం ద్వారా జిల్లా యాత్రలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు.

మరోవైపు చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. విజయదశమి నుంచి పవన్ జిల్లా యాత్రలను ప్రారంభించనున్నారు. అక్టోబర్‌ 5 నుంచి పవన్ కళ్యాణ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. తిరుపతి నుంచి ప్రారంభించి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని ఆ పార్టీ ప్రకటించింది. పవన్‌ కళ్యాణ్‌ పర్యటన కోసం జనసేన పార్టీ ఎనిమది కొత్త స్కార్పియో వాహనాలను కూడా సిద్ధం చేసింది. వచ్చే ఆరునెలల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని పవన్ కళ్యాణ్‌ భావిస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్యపట్టణాల్లో బహిరంగ సభలు ఉండేలా పవన్ యాత్రకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత కీలక రాజకీయ పరిణామాలు ఉంటాయని విపక్షాలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికల ఊ‍హాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఎవరి అదృష్టాన్ని వారు పరీక్షించుకునేందుకు యాత్రల ద్వారా సిద్ధమవుతున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం