తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్రాణాలు తీస్తున్న ప్రోటోకాల్......

ప్రాణాలు తీస్తున్న ప్రోటోకాల్......

HT Telugu Desk HT Telugu

17 April 2022, 7:45 IST

google News
    • ప్రాణాలు నిలబెట్టుకునేందుకు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారికి రాజకీయ నాయకులు ప్రాణాల మీదకు తెస్తున్నారు. మంత్రుల నుంచి వివిఐపిల వరకు తాము ప్రయాణించే సమయంలో వేరే ఎవరు రోడ్ల మీద వెళ్లకూడదు అన్నట్టు వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణం. అనంతపురంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ర్యాలీ కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
మంత్రి ఉషశ్రీ ర్యాలీ వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందనే ఆరోపణలున్నాయి
మంత్రి ఉషశ్రీ ర్యాలీ వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందనే ఆరోపణలున్నాయి

మంత్రి ఉషశ్రీ ర్యాలీ వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందనే ఆరోపణలున్నాయి

నిన్న మొన్నటి సాధారణంగా తిరిగిన వారు పదవి రాగానే ఒక్కసారిగా మారిపోతున్నారు. అవసరం లేకపోయినా మందీమార్భలాన్ని వెంటేసుకుని జనానికి చుక్కలు చూపడం సాధారణైపోయింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి గారి నిర్వాకంతో ఎనిమిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడనే ఆరోపణలు కలకలం రేపాయి. ఇటీవలి మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో అనంతపురం జిల్లా నుంచి ఉషశ్రీ చరణ్ కు పదవి దక్కింది. ఇటీవల నియోజక వర్గానికి వెళ్లిన మంత్రికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడంతో అనారోగ్యంతో ఆస్పత్రికి వెళుతున్న ఓ జంట కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషశ్రీ చరణ్ ర్యాలీ సాగుతుండటంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఈ క్రమంలో చిన్నారిని ఆస్పత్రికి తరలించడంలో జరగడం వల్ల చనిపోయాడని బాధితులు ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాలు బాధితులకు అండగా నిలిచాయి.

ప్రాణాలు కోల్పోయిన పసిపాప

శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఈరక్క, గణేష్ దంపతుల ఎనిమిది నెలల చిన్నారి పండు అస్వస్థతకు గురవడంతో కళ్యాణ దుర్గంలోని ఆర్డీటీ ఆస్పత్రికి బయలు దేరారు. మంత్రి ఇంటి సమీపంలోని బ్రహ్మయ్య గుడి సమీపానికి వచ్చేసరికి అక్కడ ఉషశ్రీ విజయోత్సవ ర్యాలీ జరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు అరగంట పాటు నిలిపివేయడంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేకపోయామని బాధితులు ఆందోళనకు దిగారు. కళ్యాణ దుర్గం సర్కిల్ లో బాధితులు ఆందోళన నిర్వహించారు.

జాప్యం జరగలేదంటున్న పోలీసులు

పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడం వల్ల చిన్నారి చనిపోయిందనే ఆరోపణల్లో నిజం లేదని జిల్లా ఎస్పీ ఫకీరప్ప చెప్పారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆస్పత్రికి చేరుకునే వరకు మార్గంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. సాయంత్రం 6.10కు గణేష్, ఈరక్క దంపతుల చిన్నారికి ఫిట్స్ రావడంతో ఇంటి నుంచి బైక్ మీద కళ్యాణదుర్గం బయలుదేరారని,బ్రహ్మయ్య గుడి చెక్ పోస్ట్ వద్ద 6.36కు కనిపించారని ఎస్పీ చెప్పారు. అక్కడ నుంచి వెంటనే బయలుదేరి 6.40కు కళ్యాణ దుర్గంలోకి వచ్చారని, సాయంత్రం 6.48కు ఆర్డీటీ ఆస్పత్రికి వచ్చారని, 6.50 ఓపీ తీసుకున్నట్లు రికార్డైందన్నారు. 7.18కు చిన్నారి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారని చెప్పారు. చెర్లోపల్లి నుంచి ఆర్డీటీ ఆస్పత్రి 20కిలోమీటర్ల దూరంలో ఉందని వారి ప్రయాణానికి 38నిమిషాల సమయం పట్టిందన్నారు. ఈ ఘటనలో పోలీసుల తప్పేమి లేదని చెప్పారు.

విఐపిలకో న్యాయం, సామాన్యులకో న్యాయం....

గత వారం విజయవాడలో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్ కుమారుడు జ్వరంతో బాధపడుతూ ఏలూరులో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించింది. వెంటనే విజయవాడ తరలించాలని వైద్యులు సూచించడంతో కలెక్టర్ కుమారుడితో సహా విజయవాడ బయలుదేరారు. రాత్రి 9గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయం సమీపంలో ట్రాఫిక్ నిలిపివేశారు. ఆ సమయంలో విజయవాడ చేరుకున్న గవర్నర్ హరిచందన్ కాన్వాయ్ వెళ్లేందుకు గ్రీన్ ఛానల్ సిద్ధం చేశారు. అప్పటికే చాలా సమయం గడిచిపోవడంతో ఆందోళన చెందిన కలెక్టర్ వెంకటేష్, గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సిసోడియా, విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. అంబులెన్స్ ప్రయాణించే వరకు గవర్నర్ కాన్వాయ్ ను రోడ్డుపై నిలిపివేశారు. నిజానికి ఈ ఘటనలో గవర్నర్, ఆయన కార్యాలయం స్పందించిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. కానీ అలాంటి అత్యవసర సమయాల్లో గవర్నర్ ముఖ్య కార్యదర్శిని నేరుగా ఫోన్లో సంప్రదించే అవకాశం ఎంతమందికి లభిస్తుందనేది అసలు ప్రశ్న. చిన్నారిని కాపాడేందుకు గవర్నర్ అరగంటకు పైగా రోడ్డుపై వేచి ఉండటం అద్భుతమైన విషయమే అయినా, రోజూ గవర్నర్, ముఖ్యమంత్రి, డిజిపి, మంత్రులు, న్యాయమూర్తుల రాకపోకల పేరిట నగరాలు, పట్టణాల్లో ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారనేది ఆలోచించాల్సిన విషయం.

బుగ్గ కారు వద్దన్నందుకు కాన్వాయ్

సుప్రీం కోర్టు ఎవరు పడితే వారు కార్లపై ఎర్ర బుగ్గలు పెట్టుకోవద్దని ఆదేశిస్తే దానికి విరుగుడుగా ముందో పైలట్, వనకో పైలట్ కారుతో హంగామా చేయడం నాయకులకు అలవాటైపోయింది. మండుటెండలైనా, జోరు వర్షమైనా, జనం సమస్యలతో సంబంధం లేకుండా ప్రోటోకాల్ అమలు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అనంతపురం ఘటనలో తమ తప్పు లేదని పోలీసులు ఎంత సమర్ధించుకున్నా రోజూ ఈ తరహా ఘటనలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారనేది నిర్వివాదం.

టాపిక్

తదుపరి వ్యాసం