IAS Vs IPS: వరద సహాయక చర్యల్లో పోలీస్ వర్సెస్ ఐఏఎస్, కావాలనే చేశారని ఐఏఎస్ ఫిర్యాదు, కుట్ర లేదంటున్న పోలీసులు
12 September 2024, 7:36 IST
- IAS Vs IPS: విజయవాడ బుడమేరు వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించేందుకు వెళ్లిన సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్‌ను ఎస్సై అడ్డుకోవడంపై విచారణ కొనసాగుతోంది.పోలీసులు ఉద్దేశపూర్వకంగా తనను అడ్డుకున్నారని ఐఏఎస్ అధికారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తారు.
సెప్టెంబర్ 4న ఐఏఎస్ అధికారి వాహనాన్ని అనుమతించని పోలీసులు (ఫైల్ ఫోటో)
IAS Vs IPS: బుడమేరు వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెళ్లిన ఐఏఎస్ అధికారి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్న విషయంలో విచారణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం ఏడు గంటల సమయంలో గవర్నమెంట్ ప్రెస్ వంతెన మీదుగా ఐఏఎస్ అధికారి వాహనం బుడమేరు జంక్షన్ చేరుకుంది.
ఆ సమయంలో సీకే రెడ్డి రోడ్డులో వచ్చే వాహనాలతో పాటు సత్యనారాయణపురం మీదుగా వచ్చే వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. సింగ్‌నగర్ వైపు నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కాలి నడకన ఫ్లైఓవర్ మీదుగా వస్తుండటంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాహనాలు తప్ప అన్ని రకాల వాహనాలను నిలిపివేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు.
బుడమేరు వంతెన ప్రారంభంలో విధుల్లో ఉన్న ఎస్సై ఐఏఎస్ అధికారి వాహనాన్ని అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. ఏ స్థాయి అధికారులైనా వాహనాలను ఫ్లైఓవర్ మీదకు అనుమతించవద్దనే పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్సై సీనియర్ ఐఏఎస్ అధికారి వాహనాన్ని అనుమతించలేదు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడే ఉన్న డిఎస్పీ స్థాయి అధికారి ఉన్నతాధికారులు చెబితే తప్ప తాము అనుమతించలేమని చెప్పడంతో ఐజీ స్థాయి అధికారికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు అందితే తప్ప అనుమతించమని విధుల్లో ఉన్న ఎస్సై స్పష్టం చేశారు.
తాను వెనుదిరిగి వెళ్లిపోతానన్న పోలీసులు అనుమతించక పోవడంతో ఐఏఎస్ అధికారి కొంత దూరం కాలినడకన వెళ్లి ఆ తర్వాత పోలీస్ వాహనంలో సింగ్‌నగర్ వైపుకు చేరారు. ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ ఉద్దేశపూర్వకంగానే తన వాహనాన్ని అడ్డుకున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.
మీడియాకు ఫోటోలు, వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీసినట్టు తెలుస్తోంది. పోలీసులతో ఐఏఎస్ అధికారి వాగ్వాదం జరుగుతున్న సమయంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన స్థానికుడు వీడియోలు చిత్రీకరించడంతో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా అతడిని గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఎస్పీ స్థాయి అధికారితో అతను మాట్లాడుతూ కనిపించడంతో పోలీసులు కావాలనే వివాదం సృష్టించారని భావించారు.
పోలీసుల విచారణలో ఐఏఎస్ అధికారిని ఎస్సై అడ్డుకోవడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే వారు అమలు చేశారని స్పష్టం చేశారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ఎవరికి ఎవరు ఏమిటనే తెలిసే అవకాశాలు లేవని, వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది వరద సహాయక చర్యల్లో ఉండటంతో కమ్యూనికేషన్ ద్వారా వచ్చిన ఆదేశాలను మాత్రమే క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బంది పాటించినట్టు స్పష్టం చేశారు.
ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని, సాంకేతిక ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీలను విశ్లేషించిన తర్వాత ఘటన జరిగిన సమయంలో ఏమి జరిగిందో గుర్తించారు. పూర్తి స్థాయి ఆధారాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారితో గొడవ పెట్టుకునే అవసరం ఎస్సైకు లేదని పోలీసులు చెబుతున్నారు. ఇందులో శాఖపరమైన ఆధిపత్యానికి తావు లేదని స్పష్టం చేస్తున్నారు.
ఏమి జరిగిందంటే…
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్ని పర్యవేక్షించడానికి సాంఘిక సంక్షేమ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రసన్న వెంకటేష్ సెప్టెంబర్ 4వ తేదీన తన వాహనంలో వచ్చారు.
విజయవాడ బుడమేరు కాలువ వంతెన సమీపంలో పోలీసులు అన్ని రకాల వాహనాలను ఆపి అత్యవసర సేవలు అందించే వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి వేలాదిమంది నిరాశ్రయులు కట్టుబట్టలతో కాలి నడకన ఫ్లైఓవర్‌పై నగరంలోకి వస్తుండటంతో వాహనాల రాకపోకల్ని నిలిపివేయాలని నిర్ణయించారు.
సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుండటం, విఐపిలు, వరద ఉధృతిని చూడటానికి వచ్చే వారితో గత రెండు రోజులుగా సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం కలగడంతో అన్ని రకాల వాహనాలను ఆపేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ముఖ్యమంత్రి సైతం వరద సహాయ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించడంతో విపత్తు సహాయక సేవల్ని అందిస్తున్న వాహనాలను తప్ప అన్ని రకాల వాహనాలను నిలిపివేశారు.
4వ తేదీ బుధవారం విధులకు వచ్చిన సిబ్బంది, అన్ని స్థాయిల అధికారలుు, డిఐజిలు, ఐజీలు స్థాయి అధికారులు కూడా బుధవారం ఉదయం నుంచి బుడమేరు సెంటర్ నుంచి సింగ్‌నగర్ ఫ్లైఓవర్ మీదుగా కాలి నడకనే వెళ్లారు.
వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించే వాహనాలు, అంబులెన్స్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ వాహనాలను మాత్రమే ఫ్లైఓవర్ మీదకు అనుమతిస్తున్నారు.వరద ముంపు నుంచి బయటకు వస్తున్న ప్రజలు కాలినడకన నగరంలోకి వస్తుండటంతో వారికి ప్రమాదం జరగకుండా వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధించారు. బుధవారం ఉదయం 7గంటల సమయంలో ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ తన వాహనంలో రావడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.
కారులో ఐఏఎస్ అధికారి ఉన్నారని డ్రైవర్ చెప్పినా, ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయాల్సిందేనని ఎస్సై సమాధానం ఇచ్చాడు. దీంతో కారు దిగిన ప్రసన్న వెంకటేష్ ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో తాను డ్యూటీ చేయను వెనక్కి వెళ్లిపోతానంటూ బెదిరించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
చివరకు చేసేది లేక ప్రసన్న వెంకటేష్ కాలి నడకనే ఫ్లైఓవర్ పైకి వెళ్లారు. సగం దూరం వెళ్లిన తర్వాత నడవలేక అటుగా వస్తున్న పోలీస్ బలగాలను తరలిస్తున్న వాహనాన్ని ఆపి తాను ఐఏఎస్ అధికారినని చెప్పి, సిబ్బందితో కలిసి అందులో ఎక్కారు. ఆ తర్వాత పోలీసులు అడ్డుకోవడంపై ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో విజయవాడ పోలీస్ ఉన్నతాధికారులు వాస్తవాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు.