తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bike Theft : పోలీస్‌ స్టేషన్ ఎదుట కానిస్టేబుల్ బండి కొట్టేసి…..

Bike Theft : పోలీస్‌ స్టేషన్ ఎదుట కానిస్టేబుల్ బండి కొట్టేసి…..

HT Telugu Desk HT Telugu

23 August 2022, 9:27 IST

google News
    • పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పార్క్‌ చేసిన కానిస్టేబుల్ బైక్ చోరీకి గురైంది.  స్టేషన్ ముందు నడుచుకుంటూ వెళుతూ రోడ్డుపై కనిపించిన బైక్‌ను మారుతాళంతో తెరిచి మాయమైపోవడం సిసి టీవీల్లో రికార్డైంది. పోలీస్ స్టేషన్ ఎదుట చోరీ అంటే పరువు పోతుందని భావించి ఆగమేఘాల మీద నిందితుడ్ని గాలించి పట్టుకున్నారు.  కాస్త ఆలశ్యమైతే బండి  విడిభాగాలుగా మారిపోయేది.
పోలీస్ స్టేషన్ ముందు వాహనం చోరీ
పోలీస్ స్టేషన్ ముందు వాహనం చోరీ

పోలీస్ స్టేషన్ ముందు వాహనం చోరీ

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పిఎస్‌ ఎదుట బండి నిలిపిన కానిస్టేబుల్ వాహనాన్ని ఓ వ్యక్తి చోరీ చేశాడు. దివ్యాంగుడిలా కుంటుతూ నడుస్తూ వచ్చి ఎవరు లేకపోవడం గమనించి బండిని మారుతాళంతో తెరిచి జంపయ్యాడు. స్టేషన్ బయటకు వచ్చి చూసిన కానిస్టేబుల్ సిసి టివిల్లో తనిఖీ చేస్తే యువకుడు బండిని కొట్టేయడం కెమెరాల్లో రికార్డైంది.

మాసిన దుస్తులతో కుంటుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు మీద పార్క్ చేసిన వాహనాన్ని సెకండ్ల వ్యవధిలో స్టార్ట్‌ చేసి మాయమైపోయాడు. రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే చోరీ చే విజయవాడ మీదుగా గుంటూరు పారిపోయాడు. బేరం కుదిరితే ఆ బండి అక్కడే విడిభాగాలుగా మారిపోయేది. ఈ లోపు సిసిటివిల్లో నిందితుడి చోరీని గమనించిన పోలీసులు అతడిని పాత నేరస్తుడిగా గుర్తించేశారు. వెంటనే అతడి కదలికలు గుర్తించి విజయవాడ మీదుగా గుంటూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. దాదాపు 30కిలోమీటర్ల ప్రయాణించి మంగళగిరి సమీపంలో ఉన్న నిందితుడ్ని వెంటాడి పట్టుకున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేషన్ సోమవారం మధ్యాహ్నం స్టేషన్ బయట బండి పెట్టి లోపలకు వెళ్లాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన నిందితుడు బండిని చూడగానే మాయం చేయాలని నిర్ణయించుకునే దానిపై చెక్కేశాడు. స్థానిక సీసీ టీవీల్లో చోరీ దృశ్యాలు నమోదవడంతో వెంటనే నిందితుడి అచూకీ కోసం ప్రయత్నించారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వైపు బైక్ వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దారి పొడవున పోలీసులు అమర్చిన సిసిటివి కెమెరాల్లో నిందితుడి కదలికలు నమోదవ్వడంతో దొంగను పట్టుకోవడం సులువైంది.

వాహనం గుర్తుల ఆధారంగా ఏ మార్గంలో ప్రయాణించాడో పోలీసులు పసిగట్టేశారు. విజయవాడ మీదుగా మంగళగిరి జాతీయ రహదారి దాటుకుని పెదకాకాని సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ పోలీసులు గుంటూరు అర్బన్ పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో నిందితుడిని వాహనం సహా పట్టుకున్నారు. నిందితుడు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అరుంధతీ నగర్‌కు చెందిన నండ్రు మాణిక్యాాల రావుగా గుర్తించారు. చోరీ చేసిన వాహనాన్ని గుంటూరు ఆటోనగర్‌లో పాత వాహనాల విడిభాగాలు విక్రయించే వారికి అమ్మేందుకు తీసుకెళ్తుండగా దొరికిపోయాడు. పోలీసులు ఏ మాత్రం ఆలశ్యం చేసినా ముక్కలై మాయమైపోయేది. మరోవైపు నిందితుడు చోరీ చేసినా ఫలితం దక్కకపోగా ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది.

టాపిక్

తదుపరి వ్యాసం