Electricty Bills: యూపీఐలతో నేరుగా విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇక కుదరదు, డిస్కమ్ యాప్‌లు వాడాల్సిందే..
02 July 2024, 7:34 IST
- Electricty Bills: విద్యుత్ బిల్లుల చెల్లింపుకు యూపీఐలను వినియోగిస్తున్నారా? జూలై 1 నుంచి వాటితో నేరుగా చెల్లింపులు సాధ్యం కాదు. ఆర్‌బిఐ కొత్త నిబంధనల నేపథ్యంలో ఇకపై డిస్కమ్ యాప్‌ల ద్వారా మాత్రమే విద్యుత్ బిలుల్ని చెల్లించాల్సి ఉంటుంది.
థర్డ్ పార్టీ యాప్‌లతో నేరుగా విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇక సాధ్యం కాదు
Electricty Bills: ఆర్‌బిఐ తాజా మార్గదర్శకాల ప్రకారం బిల్లుల చెల్లింపు ప్రక్రియలో ఇతరుల పాత్రపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు జారీ చేసే వారు కాకుండా ఇతరులు బిల్లుల్ని వసూలు చేయడంపై ఆంక్షలు విధించింది.ఆర్‌బిఐ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై నేరుగా ఇలా బిల్లుల వసూలు సాధ్యం కాదు. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బిల్లుల్ని చెల్లించాలంటే బిల్లు జారీ చేసిన వారి ధృవీకరణ అవసరం.ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత్ బిల్ డెస్క్ నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లకు సమాచారం అందింది.
ఇకపై భారత్ బిల్ డెస్క్‌తో అనుసంధానమై ఉన్న యూపీఐ చెల్లింపు యాప్‌లను నేరుగా బిల్లుల చెల్లింపుకు అనుమతించరు. జూలై1 నుంచి ఇలా యాప్‌లతో నేరుగా బిల్లుల చెల్లింపు సాధ్యపడదు. ఈ మేరకు ప్రజలకు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు చర్యలు చేపట్టాలని ఎస్పీడిసిఎల్ అధికారులు ఆదేశించారు.
ఆర్‌బిఐ తాజా ఉత్తర్వులతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలలో నేరుగా విద్యుత్ బిల్లులను చెల్లింపును అనుమతించరు. ఇక నుంచి ఆ చెల్లింపులను సంబంధిత యాప్‌లు కూడా నేరుగా స్వీకరించవు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎస్పీడిసిఎల్, సీపీడీసీఎల్ ద్వారా చేసిన చెల్లింపులను మాత్రమే అయా యాప్‌లు స్వీకరిస్తాయి. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రకటనలు విడుదల చేవాయి.
విద్యుత్ వి నియోగదారుల్లో కొంతమంది బిల్లులను రెవెన్యూ కౌంటర్ల వద్ద చెల్లిస్తున్నారు. మరికొందరు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన మొబైల్ యాప్‌ల ద్వారా చెల్లిస్తున్నారు. చాలామంది గూపుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా చెల్లిస్తున్నారు. ఈ యాప్ ల ద్వారా చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఒక బిల్లు చెల్లించిన మరో బిల్ జనరేట్ అవుతోంది. సాధారణంగా విద్యుత్ బిల్లుల చెల్లింపుకు నిర్దేశిత గడువు తర్వాత కూడా యాప్‌లో చెల్లించే అవకాశం ఉంటోంది. ఇకపై ఇలా చేయడం కుదరని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఆర్బీఐ భారత్ బిల్ పేమెంట్స్ మార్గదర్శకాల ప్రకారం నేరుగా యాప్ నుంచి చెల్లింపులను అనుమతించరు.
విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన యాప్‌లో సర్వీస్ నంబర్‌తో నమోదు చేసుకుని అక్కడి నుంచి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇందుకోసం రకరకాల పేమెంట్ గేట్‌వేలను అందుబాటులో ఉంచారు. క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. పేమెంట్ గేట్‌వేల ద్వారా జరిపిన చెల్లింపులను మాత్రమే ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థలు స్వీకరిస్తారు.