తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena Pawan Kalyan: జగన్‌ను నిందించడం లేదు, తప్పుజరిగితే అంగీకరించాలి… నటుడు ప్రకాష్‌ రాజ్‌పై పవన్ ఆగ్రహం

Janasena Pawan Kalyan: జగన్‌ను నిందించడం లేదు, తప్పుజరిగితే అంగీకరించాలి… నటుడు ప్రకాష్‌ రాజ్‌పై పవన్ ఆగ్రహం

24 September 2024, 11:10 IST

google News
    • Janasena Pawan Kalyan: తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి నాణ్యత వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను తాను నిందించడం లేదని, కానీ తప్పు జరిగితే దానిని అంగీకరించాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవన్ ప్రాయశ్చిత్తం చేపట్టారు. 
విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను శుభ్రం చేస్తున్న పవన్ కళ్యాణ్
విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను శుభ్రం చేస్తున్న పవన్ కళ్యాణ్

విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను శుభ్రం చేస్తున్న పవన్ కళ్యాణ్

Janasena Pawan Kalyan: టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రాయశ్చిత్తం చేపట్టారు. ఆలయ మెట్లను శుభ్రం చేసి పూజలు నిర్వహించారు. తాను ప్రాయశ్చిత్తం చేయడానికి కారణం ఐదేళ్ల వైసీపీ పాలనలో కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి రథం సింహాలు మాయమైతే ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. తప్పు జరిగితే పదవులు అనుభవిస్తున్న వారు, పొద్దున లేస్తే గుళ్లకు వెళ్లే వారు అపహాస్యం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు.

వైవీసుబ్బారెడ్డి, భూమన వారి కుటుంబ సభ్యులు మతం పుచ్చుకున్నారో లేదో తనకు తెలియదని, దాని గురించి మాట్లాడనని, హైందవ ధర్మాన్ని కాపాడతానని బాధ్యత తీసుకున్నపుడు బాధ్యతగా ఉండాలన్నారు. దుర్గ గుడిలో వెండి సింహాలు మాయమైన సందర్భంగా ఆ విషయాన్ని అప్పటి వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు. హిందూ ధర్మాన్ని పాటించే వారే దుర్గగుడి వెండి సింహాలు మాయమైనప్పుడు ఆ సింహాలతో మేడలు, మిద్దెలు కట్టుకుంటామా అంటూ మాట్లాడడం చాలా బాధ కలిగించింది.

తిరుమల నెయ్యి వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను తాను నిందించడం లేదని , నాకు తెలియకుండా జరిగాయని చెప్పాల్సిందన్నారు, మీ ఆధ్వర్యంలో మీరు ఏర్పాటు చేసిన బోర్డులో జరిగిన తప్పుల్ని తాము కనుగొన్నామని పవన్ చెప్పారు. బలమైన సనాతన ధర్మాన్ని తాను పాటిస్తానని, తాను రాముడి భక్తుడినని, రాముడి విగ్రహానికి శిరచ్చేదం జరిగితే సగటు హిందువుగా బయటకు వచ్చి గొడవ చేయగలనన్నారు.

హిందూ ధర్మం విషయంలో గొడవ పెట్టుకోవాలంటే తాను చేయగలనని, ప్రజలు బాగుండాలని, క్రిమినల్ పాలిటిక్స్‌కు తాను దూరం అన్నారు. రాజ్యాంగం బాగుండాలని తపన పడతానన్నారు. సెక్యులరిజం పేరు మీద రాజకీం తగదన్నారు. సెక్యులరిజం ఒకరికి మాత్రమే మార్గం కాదని, అది అన్ని వైపులా నుంచి ఉండాలని, కొన్ని దశాబ్దాలుగా ప్రతి హిందువు చూస్తున్నారని, హిందూ ధర్మాన్ని పాటించి, ఎవరినో సంతృప్తి పరచడానికి తోటి హిందువుల్ని తిడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో తాను ముస్లింలను తిట్టడం లేదని క్రిస్టియన్లను నిందించడం లేదని, బాధ్యత తీసుకున్న హిందువుల్ని ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ఇదే విషయంలో మసీదులో ఏదైనా అపవిత్ర ఘటన జరిగితే మాట్లాడగలరా అని ప్రశ్నించారు. హిందువుల విషయంలో ఎవరు మాట్లాడరని, తమకు కోపం రాకూడదనా అని ప్రశ్నించారు.

పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీలో ఏమి మాట్లాడారని పవన్ నిలదీశారు. ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు ఖరీదని మాట్లాడటం ఏమిటన్నారు. సెన్సిటివ్ విషయంలో మౌనంగా ఉండాలని, తనను పచ్చి బూతులు తిట్టినా, వక్రీకరించినా మౌనంగానే ఉన్నానని, వైసీపీ నాయకులు సనాతన ధర్మం జోలికి రావొద్దన్నారు. అడ్డగోలుగా మాట్లాడొద్దని, నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దని పవన్ హెచ్చరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో మౌనం దాటి పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదని, వమర్శించే వైసీపీ నాయకలకు చెబుతున్నా.. సనాతన ధర్మం జోలికి రావద్దన్నారు. తప్పు జరిగిందంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని లేకుంటే మౌనంగా ఉండాలన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రకాష్‌ రాజ్‌కు వార్నింగ్…

తిరుమల నెయ్య వివాదంపై నటుడు ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గగుడిలో ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో నటుడు ప్రకాష్‌ రాజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెయ్యి వివాదంలో ఇటీవల ప్రకాష్‌ రాజ్ మాట్లాడారని, తాను హిందువుల విషయం గురించి మాట్లాడితే నటుడు ప్రకాష్‌రాజ్‌ అభ్యంతరం ఏమిటని, ఏ మతాన్ని తాను నిందించలేదని, దీనిని కూడా తాను గోల చేస్తున్నానని అనడం ఏమిటన్నారు.

దేవతా విగ్రహాలు శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. ప్రకాష్‌ రాజ్‌ అంటే తనకు గౌరవం ఉందని, సెక్యులరిజం అంటే రెండు విధాలని ఆయన గుర్తించాలన్నారు. హిందువుల మీద దాడి జరిగితే మాత్రమే మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. ముస్లింలు, మదర్సాల మీద తనకు ఎప్పడూ గౌరవం ఉందని, వాటికి లక్షల కొద్ది విరాళాలు ఇచ్చానని గుర్తు చేశారు.

మిషనరీ స్కూల్లోనే చదువుకున్నానని, వారి మీద తనకు ఎప్పుడు గౌరవం ఉంటుందన్నారు. తనను తాను తగ్గించకున్న వాడు హెచ్చింపబడతారనే దానిని నమ్ముతానని, అయితే నేను పాటించే ధర్మానికి అన్యాయం జరిగితే తాను మాట్లాడటంలో తప్పేమిటన్నారు. ప్రకాష్‌ రాజ్‌ ఇవి తెలుసుకోవాలన్నారు.

ప్రకాష్‌ రాజ్‌ మాత్రమే కాదు సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్లంతా తెలుసుకోవాలన్నారు. హిందువులుగా తాము తీవ్రంగా ఆవేదనలో ఉన్నామని మర్చిపోవద్దన్నారు. మాట్లాడేముందు వంద సార్లు ఆలోచించుకోవాలని, అయ్యప్ప స్వామి, సరస్వతి దేవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని.. అల్లా మీద, మహ్మద్ ప్రవక్త మీద, జీసస్ మీద మాట్లాడగలరా అని ప్రశ్నించారు.

తదుపరి వ్యాసం