తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan: డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్‌, జాతీయ‌‍ ఛానల్‌ ఇంటర్వ్యూలో అభిప్రాయం వెల్లడి

Pawan Kalyan: డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్‌, జాతీయ‌‍ ఛానల్‌ ఇంటర్వ్యూలో అభిప్రాయం వెల్లడి

Sarath chandra.B HT Telugu

10 June 2024, 5:59 IST

google News
    • Pawan Kalyan: ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే విధానానికి కట్టుబడి చివరి వరకు కూటమి ఏర్పాటుకు శ్రమించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం పదవిని చేపట్టనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 
ఏపీలో డిప్యూటీ సిఎం పదవిని ఆశిస్తున్నట్టు ఢిల్లీలో వెల్లడించిన పవన్ కళ్యాణ్‌
ఏపీలో డిప్యూటీ సిఎం పదవిని ఆశిస్తున్నట్టు ఢిల్లీలో వెల్లడించిన పవన్ కళ్యాణ్‌ (ANI)

ఏపీలో డిప్యూటీ సిఎం పదవిని ఆశిస్తున్నట్టు ఢిల్లీలో వెల్లడించిన పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఏ బాధ్యతలు చేపడతారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైసీపీ వైఫల్యాలపై మొదటి నుంచి పోరాడుతున్న పవన్ కళ్యాణ్‌ ఎన్నికల నాటికి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తాజా ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్‌ రేటుతో విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన 21 స‌్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించారు.

మరోవైపు ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన టీడీపీ సొంతంగా 133 స్థానాల్లో గెలిచింది. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మూడో సారి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా నిలిచింది. టీడీపికి చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో జనసేనాని ఏ బాధ్యతలు చేపడతారనే దానిపై కొద్ది రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ మనసులో మాటను ఆదివారం వెల్లడించారు. ఆదివారం ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్‌ ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు ఆసక్తిని చూపినట్టు కథనాలు వెలువడ్డాయి.

ఏపీలో డిప్యూటీ సిఎం పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్‌‌లో ఆదివారం కథనాలు వెల్లడించింది.

ప్రధానిగా నరేంద్ర మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, ఆయన భార్య అనా కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే ఛానల్‌ ప్రతినిధితో పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడారు. అక్కడ హడావుడి వాతావరణంలో రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు కొంత అస్పష్టంగా ఉన్నా, పవన్‌కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌‌లో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే ప్రతినిధి పేర్కొన్నారు. ఇదే విషయంలో ఛానల్‌లో ఈస్క్రోలింగ్‌‌లు నడిచాయి. ఏపీలో డిప్యూటీ సిఎం పదవిని కోరుకుంటున్నట్లు అకాక్షను పవన్ వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతిపక్ష స్థానానికి అవసరమైన మెజార్టీ కూడా వైసీపీ దక్కించుకోలేదు. 21 స్థానాల్లో జనసేన మాత్రమే రెండవ ప్రధాన పార్టీగా అవతరించింది. గత ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సిఎంలను జగన్ నియమించారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సిఎం పదవిని కోరుకుంటున్న నేపథ్యంలో ఒకే ఒక్క డిప్యూటీ సిఎంను నియమించే అవకాశాలు ఉండొచ్చు. దీంతో పాటు కీలకమైన శాఖల బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. 2014-19 మధ్య కాలంలో నిమ్మకాయల చినరాజప్ప ఏపీలో డిప్యూటీ సిఎంగా పనిచేశారు. ఆయన హోంమంత్రిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు.

తాజాగా పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సిఎం పదవిని కోరుకుంటున్న నేపథ్యంలో ఆయన కేటాయించే శాఖలు ఏమిటి, ఏ శాఖల్ని పవన్ కళ్యాణ్‌ కోరుకుంటారనేది కూడా కీలకంగా మారింది. పవన్‌తో పాటు ఆ పార్టీలో ఎంతమందికి మంత్రి పదవులు దక్కుతాయనే ఆసక్తి కూడా నెలకొంది. కేంద్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉన్నా మంత్రి వర్గంలో మాత్రం చోటు దక్కలేదు.

తదుపరి వ్యాసం