Pawan on Jagan: హిందువుల అంతర్గత వ్యవహారం,జగన్ డిక్లరేషన్ అంశం టీటీడీ చూసుకుంటుందన్న పవన్ కళ్యాణ్
27 September 2024, 6:48 IST
- Pawan on Jagan: తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని, నాటి టీటీడీ బోర్డులను నియమించినవాళ్ళూ బాధ్యులేనని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.
జగన్ తిరుమల పర్యటనపై పవన్ కీలక కామెంట్స్
Pawan on Jagan: హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని, వారే సమాధానం చెప్పాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తిరుమల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదన్నారు. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు.
ఇక్కడ తిరుమల ప్రసాదం అపవిత్రం కావడం, ఆలయ ఆచారాలకు భంగం వాటిల్లేలా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకోవడం అనేది హిందువుల అంతర్గత వ్యవహారమన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకొన్నవారే అందుకు విరుద్ధంగా వెళ్లినందున వారిని ప్రశ్నించాలని, తిరుమలలో ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి, ఆ తరువాత కరుణాకర రెడ్డి అని ఆ సమయంలో అక్కడ ఉన్నతాధికారిగా ఉన్న ధర్మారెడ్డి .. ఈ ముగ్గురూ తిరుమల లడ్డూ అపవిత్రతకు గురైన అంశంపై సమాధానం చెప్పాలన్నారు. శిక్షలు ఎవరికి, ఎలా పడాలి అనేది విచారణలో తేలుతుంది. ఆపై శిక్షలు అనేవి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చూసుకుంటాడన్నారు.
వైసీపీ కోరుకొంటున్న గొడవలు ఇవ్వవద్దు
తిరుమల యాత్రకు వెళ్తున్న శ్రీ జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత అని ఈ విషయంపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. డిక్లరేషన్ ఇస్తారా లేదా... ఆలయ సంప్రదాయాలు, మర్యాదలు, నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్ళే వ్యక్తి విచక్షణకు వదిలేయాలన్నారు. అధికారులు కూడా బాధ్యత గుర్తెరగాలని ఈ విషయంలో సదరు వ్యక్తుల తరఫువాళ్ళు కోరుకొనేది గొడవలేనని పవన్ ఆరోపించారు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన, అధికారంలోకి వచ్చాక కోనసీమ ఘటన సృష్టించిందని కులాల మధ్య చిచ్చు రేపి ప్రయోజనం పొందాలని చూసిందన్నారు. ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తోందని తుని, కోనసీమ ఘటనల్లో ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారని ఈ తరుణంలోనూ వైసీపీ కుత్సిత పన్నాగాల విషయంలో అంతే అప్రమత్తంగా ఉండాలని కోరుకొంటున్నాను. వాళ్ళు కోరుకొంటున్న గొడవలు మనం ఇవ్వవద్దన్నారు. మతాల మధ్య గొడవలు సృష్టించాలనే ఆలోచనల్లో ఉన్న వైసీపీ వ్యవహార శైలిపట్ల - పోలీసు శాఖ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.