Pawan Kalyan on Womens Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై పవన్ కళ్యాణ్ హర్షం
19 September 2023, 6:35 IST
- Pawan Kalyan on Womens Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ అమోదం తెలపడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటుతో పాటు చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను స్వాగతించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
Pawan Kalyan on Womens Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళామణుల ప్రాతినిధ్యం పెంచాలనే వనితా లోకం ఆకాంక్షలు నెరవేరే రోజులు సమీపంలోనే ఉన్నాయని, ఇందుకు అవసరమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు.
చారిత్రాత్మకమైన ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చట్ట సభల్లో 33శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసే ఈ బిల్లు విషయంలో వాగ్ధానాలు, నినాదాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చేయడంలో మోదీ ఎంతో చిత్తశుద్ధి చూపారన్నారు.
ఈ బిల్లు చట్టసభల్లోనూ ఆమోదం పొందితే కచ్చితంగా రాజకీయంగా మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా రక్షణ, విద్య, వైద్యం లాంటి అంశాల్లో మహిళా ప్రతినిధులు విలువైన చర్చలు చేయగలరు. కావున ఈ బిల్లును చట్ట సభల సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్‌ను నెరవేర్చే ధైర్యం మోదీ ప్రభుత్వానికే ఉందన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కాసేపటి తర్వాత ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన ట్వీట్‌ను డిలీట్ చేశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ బిల్లులను ప్రవేశపెట్టినా సభ ఆమోదం దక్కలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోదీ సారథ్యంలోని కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.