Pawan Kalyan: బాలినేని గారు… మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి
24 June 2022, 22:53 IST
- వైసీపీ నేతల తీరుపై జనసేన అధినేత పవన్ ఫైర్ అయ్యారు. ఒంగోలు జిల్లాకు చెందిన పార్టీ అధికాకర ప్రతినిధిపై వైసీపీ నేతల మాటల దాడిని ఖండించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఒంగోలు జిల్లాకు చెందిన జనసేన అధికార ప్రతినిధిపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులు వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రకటనలో ఏం ఉందంటే....
‘‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే. కానీ, స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగితే బలంగా సమాధానం చెబుతాం. మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఫోన్ చేసి అమర్యాదకరంగా మాట్లాడటం ఏం పద్ధతి? ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సదరు ఎమ్మెల్యేకి రాయపాటి అరుణ తెలిపారు. ఆ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాను బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం. రెండు టీవీ ఛానెళ్ల(మహా న్యూస్, 99 టీవీ)పై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎమ్మెల్యే బాలినేని గారికి చెప్పేది ఒక్కటే... మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి. రాజకీయాల్లో విధి విధానాలపై మాట్లాడుకుంటాం... వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదు. టీవీఛానెళ్లపై పెట్టిన కేసులు ఉపసంహరించుకుని సమస్యకు ముగింపు పలకాలి’’ అని పవన్ పేర్కొన్నారు.
మరోవైపు ఇవాళ ఏపీ, తెలంగాణ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
టాపిక్