Pawan Flood Relief Fund: తెలంగాణకు వరద సాయంగా కోటి రుపాయల విరాళం అందించిన పవన్ కళ్యాణ్
11 September 2024, 10:48 IST
- Pawan Flood Relief Fund: భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడుతున్న తెలంగాణకు జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి రుపాయల విరాళాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద సాయం చెక్కును అందచేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Pawan Flood Relief Fund: ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ భారీ వర్షాలు, వరదలతో సతమతం అవుతున్న తెలంగాణకు వరద సాయాన్ని అందించారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పవన్ కళ్యాణ్ చెక్కును అంద చేశారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అందచేశారు. వరదల సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్కును అందచేసినట్టు జనసేన వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు వారాలు ఎడతెరిపి లేని వర్షాలతో తెలంగాణలో పలు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో గత వారం కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. అటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను సైతం భారీ వర్షాలు తీవ్రంగా నష్టం కలిగించాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోడానికి ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.