Pawan In Delhi: పిఠాపురంకు ఆర్వోబీ, ఏపీలో ఏఐఐబీ ప్రాజెక్టులు పొడిగించాలని పవన్ విజ్ఞప్తి, ఢిల్లీలో జనసేనాని బిజీబిజీ
26 November 2024, 19:15 IST
- Pawan In Delhi: జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగాగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పిఠాపురంలో ఆర్వోబీ, రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని విజ్ఞప్తి చేవారు. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు రుణం గడువును 2026వరకు పొడిగించాలని కోరారు.
రైల్వే శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్
Pawan In Delhi: ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. జనసేన ఎంపీలతో కలిసి రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుతో పాటు నాలుగు ముఖ్యమైన రైళ్లకు పిఠాపురంలో హాల్ట్ మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు.
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం ఉందని, సత్వరమే ఈ ఆర్వోబీని మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. పలు రైల్వే ప్రాజెక్టులు, ప్రజల అవసరాల గురించి చర్చించారు. ‘పిఠాపురం పట్టణ పరిధిలోని V-V సెక్షన్‌లో, సామర్లకోట-ఉప్పాడ రోడ్డులో రైల్వే కి.మీ 640/30-32 వద్ద లెవెల్ క్రాసింగ్ నంబర్ 431కి బదులుగా ఆర్‌ఓబీ అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నిరంతరంగా ఉండే ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, ఆ ప్రాంతంలో రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ మౌలిక సదుపాయాల కల్పన చాలా అవసరం. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి 'గతి శక్తి' కార్యక్రమం ద్వారా మంజూరు చేయాల’ని కోరారు.
అదే విధంగా పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నాలుగు ముఖ్యమైన రైళ్ళకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నాందేడ్ - సంబల్పూర్ నాగావళి ఎక్స్ ప్రెస్, నాందేడ్ - విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం- సాయి నగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్, ఏపీ ఎక్స్ ప్రెస్ (విశాఖపట్నం - న్యూఢిల్లీ)కి పిఠాపురంలో హాల్ట్ అవసరమని తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంగా – లాతూరు ప్రజలు చేసిన విన్నపాన్ని రైల్వే శాఖ మంత్రి ముందు ఉంచారు. లాతూరు నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని తెలుపుతూ ఈ ప్రతిపాదనపై పరిశీలన చేయాలని కోరారు.
రుణం గడువు పొడిగించాలని విజ్ఞప్తి…
ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పవన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఐబీ రుణంలో వెసులుబాట్లు కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (ఏపీఆర్‌ఆర్‌పీ) కోసం ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి తీసుకొన్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 31 డిసెంబర్ 2026 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్ట్‌లో మార్పుల కోసం విన్నవించారు.
ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 31 డిసెంబర్, 2024 వరకు ఇచ్చిన ప్రస్తుత గడువు సరిపోదని రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రీయింబర్స్‌మెంట్ పద్దతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని కోరారు. డిసెంబర్ 2026 వరకు ప్రాజెక్ట్ పొడిగింపు ఇవ్వాలని కోరారు. నిధుల చెల్లింపుల విధానంలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఉన్న 70% (AIIB) :30 %+ పన్నులు (AP ప్రభుత్వం) విధానం నుంచి 90% (AIIB) :10% (AP ప్రభుత్వం) మార్పు చేసి.. 455 మిలియన్ US డాలర్ల (అంటే రూ. 3834.52 కోట్లు) బ్యాంక్ ఒప్పుకొన్న మేరకు వాటాను కొనసాగిస్తూ నిధుల విడుదలను మార్పును పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
జల్ జీవన్ మిషన్ స్ఫూర్తిని కొనసాగిస్తాం..
జల జీవన్ మిషన్ (జె.జె.ఎం.) యొక్క నిజమైన స్ఫూర్తిని సాధించాలంటే... బోరు బావులపై ఎక్కువగా ఆధారపడకుండా.. దీర్ఘకాలిక, నిలకడతో ఉన్న వనరుల నుంచి నీటిని సేకరించడం చాలా కీలకం. ఆ దిశగా ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రికి వివరించారు.
ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జె.జె.ఎం. అమలుపై చర్చించారు. ‘2019-2024 మధ్య అందించిన కనెక్షన్లలో కుళాయిల సామర్ధ్యం, నీటి నాణ్యత అంశంలో ఇటీవల చేసిన సర్వే ద్వారా పలు సమస్యలను గుర్తించామ’ని కేంద్ర మంత్రికి తెలిపారు. సర్వే ఫలితాల ప్రకారం 29.79 లక్షల కుటుంబాలకు ట్యాప్ కనెక్షన్లు అందలేదనీ, అలాగే 2.27 లక్షల పంపులు పని చేయడం లేదని. మరో 0.24 లక్షల ట్యాపులు అవసరమైన స్థాయిలో నీటిని సరపరాచేయడం లేదని వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నీటి సరఫరా, తగినంత మేర సరఫరా (ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్లు), నాణ్యమైన నీటిని అందించాలన్న లక్ష్యాలను ఇంకా సాధించలేదని సర్వే ద్వారా తేలిందని చెప్పారు.
పర్యాటక ప్రాజెక్టులకు సాయం చేయాలని వినతి..
రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచే పర్యటక ప్రాజెక్టులకు కేంద్రం తగిన విధంగా సహకరించి, వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు.