VZRM Sirimanotsavam: వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
01 November 2023, 8:18 IST
- VZRM Sirimanotsavam: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఉత్సవాన్ని మంగళవారం జిల్లా యంత్రాంగం ప్రశాంతంగా నిర్వహించింది.
విజయనగరంలో వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం
VZRM Sirimanotsavam: విజనగరం సిరిమానోత్సవంలో ఎప్పటిలాగే పాలధార, అంజలి రథం, తెల్ల ఏనుగు, బెస్తవారి వల ముందు నడవగా, శ్రీ పైడితల్లి అమ్మవారు మూడుసార్లు విజయనగరం పురవీధుల్లో సిరిమాను రూపంలో ఊరేగి, భక్తులకు దర్శనమిచ్చారు. పుట్టినిల్లు విజయనగరం కోటవద్దకు వెళ్లి, రాజ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పరవశించిపోయారు.
మాన్సాస్ ఛైర్‌పర్సన్, పైడితల్లి ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, వారి కుటుంబ సభ్యులు కోట బురుజు పైనుంచి సిరిమాను ఉత్సవాన్ని తిలకించి పరవశించారు.sa
పైడితల్లి అమ్మవారి సిరిమానొత్సవాన్ని ఈ ఏడాది సకాలంలో పూర్తి చేశారు. మంత్రి బొత్స ఆధ్వర్యంలో మొదట్లోనే రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పురప్రముఖులతో సమవేశాన్ని నిర్వహించి, ఉత్సవాలపై వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, దానికి అనుగుణంగా అమ్మవారి సిరిమాను పండుగను నిర్వహించారు.
ఉత్సవానికి అమ్మవారి సిరిమానును, ఇతర రథాలను ముందుగానే ఆలయం వద్దకు తీసుకురావడంతో, సాయంత్రం 4.37 నిమిషాలకు సిరిమాను రథోత్సవం ప్రారంభమయ్యింది. తోపులాటలు జరగకుండా, ఉత్సవానికి అంతరాయం కలుగకుండా పటిష్టమైన బారికేడ్లను ఆర్అండ్‌బి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా, పలు చోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. త్రాగునీటి సదుపాయం కల్పించారు.
వివిధ స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా త్రాగునీరు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి రథాన్ని సిద్ధం చేసి సిరిమానోత్సవం త్వరగా ప్రారంభించేందుకు కృషి చేయడమే కాకుండా ముందుండి సిరిమాను నడిపించారు. ఉత్సవం పూర్తి అయ్యేవరకు పర్యవేక్షించారు.
సిరిమానోత్సవాన్ని తిలకించిన ప్రముఖులు
కన్నులకింపైన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్నిపలువురు ప్రముఖులు ప్రత్యక్షంగా తిలకించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆవరణలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఆశీనులై ఉత్సవాన్ని తిలకించింది. ఆయనతోపాటుగా రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సి డాక్టర్ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, కంబాల జోగులు ఇతర ప్రముఖులు, అధికారులు సైతం ఇక్కడినుంచే ఉత్సవాన్ని తిలకించారు.