తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Viveka Murder Twist: వివేకా కేసులో కుమార్తె పాత్రపై పిఏ కృష్ణారెడ్డి ఆరోపణలు..

Viveka Murder Twist: వివేకా కేసులో కుమార్తె పాత్రపై పిఏ కృష్ణారెడ్డి ఆరోపణలు..

HT Telugu Desk HT Telugu

04 May 2023, 13:14 IST

google News
    • Viveka Murder Twist: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె,అల్లుడిపై పిఏ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సిబిఐ ఏఎస్పీ రాంసింగ్ చెప్పినట్లు అవినాష్‌ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని తనపై సునీత దంపతులు ఒత్తిడి చేశారని కృష్ణారెడ్డి ఆరోపించారు. 
వైఎస్ వివేకా
వైఎస్ వివేకా

వైఎస్ వివేకా

Viveka Murder Twist: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చినట్టే వచ్చి మళ్లీ మొదటికొస్తోంది. తాజాగా వివేకా పిఏ కృష్ణారెడ్డి, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా కేసు దర్యాప్తును సుప్రీం కోర్టు కొత్త వారికి అప్పగించిన నేపథ్యంలో కేసుతో సంబంధం ఉన్న వారిని మళ్లీ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డిని రెండ్రోజులుగా సిబిఐ విచారించింది. సిబిఐ విచారణ నేపథ్యంలో కృష్ణారెడ్డి ఎన్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు.

ఆ రోజేం జరిగిందంటే….

వివేకా హత్య జరిగివన రోజు తెల్లవారు జాము ఐదు, ఐదున్నర గంటల ప్రాంతంలో వివేకా ఇంటికి వెళ్లానని, రోజు ఆ సమయానికి వివేకా లేచి హాల్లో లైట్లు వేస్తారని అది చూసి తాము లోపలకు వెళ్తామని కృష్ణారెడ్డి చెప్పారు. ఆ రోజు చీకటిగా ఉండటంతో తాను పేపర్ చదువుతూ బయట ఎదురు చూసి కాసేపటి తర్వాత వివేకా భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేశానని చెప్పారు. వివేకా రాత్రి ఇంటికి లేట్‌గా వచ్చుంటారని కాసేపు ఎదురు చూడాలని ఆమె తనకు సూచించారన్నారు.

అదే సమయంలో ఎప్పుడైన ఎక్కువ సేపు నిద్రపోతుంటే లేపకపోతే వివేకా కేకలు వేస్తారని, ఆ సమయంలో ఇంట్లో పనికి వచ్చిన లక్ష్మమ్మను వెనుక వైపు వెళ్లి వివేకాను పిలవాలని సూచించినట్లు చెప్పారు. ఆ సమయంలో వాచ్ మాన్ రంగన్న గార్డెన్ వైపు వెళ్లాడని, పనిమనిషి పిలిచి వచ్చిన కాసేపటికి రంగన్న సర్ పడిపోయారని అరుచుకుంటూ బయటకు వచ్చాడన్నారు.

రంగన్న అరుపులతో వెనుక గుమ్మం నుంచి లోపలకు వెళ్లి చూస్తే హాల్ మొత్తం రక్తంతో ఉందని, బాత్‌రూమ్‌లో వివేకా తల మీద గాయం కనిపిస్తోందని, తాను సర్ మనకు లేడని ప్రకాష్‌తో చెప్పానన్నారు. ఆ తర్వాత వివేకా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డికి ఫోన్ చేసి వివేకా ఇక లేడని చెప్పానని, తలపై గాయాలున్నాయని వివరించానన్నారు. రాజశేఖర్‌ రెడ్డి తరవాత తాను వివేకా బామ్మర్ది శివప్రకాష్‌ రెడ్డికి కూడా ఫోన్ చేసినట్లు చెప్పారు.

ఆ సమయంలో సోఫాలో రింగ్ అవుతున్న ఫోన్ గమనించి దానిని తన జేబులో పెట్టుకున్నానని, వీల్ ఛైర్ దగ్గర పేపర్‌లో ఏదో రాసి ఉండటం గమనించానని చెప్పారు. ఆ లేఖ గజిబిజిగా ఉందని, అందులో డ్రైవర్ ప్రసాద్‌ను డ్యూటీకి త్వరగా రమ్మనందుకు తనను కొట్టి చంపారని లేఖ ఉందని, లేేఖ గురించి వెంటనే వివేకా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానన్నారు. అతను ఆ లేఖను జాగ్రత్తగా దాచి పెట్టాలని చెప్పారని, ఫోన్, లెటర్‌లను తాను వచ్చే వరకు జాగ్రత్త చేయాలని రాజశేఖర్ రెడ్డి తనకు చెప్పారని కృష్ణారెడ్డి చెప్పారు. పోలీసులకు అప్పగిస్తానని చెబితే వద్దని వారించారని తెలిపారు.

అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి….

ఆ తర్వాత రాజశేఖర్‌ రెడ్డి అన్న శివప్రకాష్‌ రెడ్డికి ఫోన్ చేస్తే మన వాళ్లు వస్తారని తనకు చెప్పారని, ఆరున్నర సమయంలో అక్కడకు అవినాష్ రెడ్డి వచ్చాడని శివశంకర్ రెడ్డి అతని వెంట ఉన్నాడని చెప్పాడు. వివేకా శవాన్ని చూసిన తర్వాత బయటకు వచ్చి అవినాష్ రెడ్డి ఫోన్లు మాట్లాడారని చెప్పారు. అవినాష్ ఎవరితో మాట్లాడారో తనకు తెలియదన్నాడు.

ఆ సమయంలో వాచ్‌ మాన్‌ రంగన్నను తాను కాపలా కాయకుండా ఏం చేస్తున్నావని తిడితే, రాత్రి త్వరగా తిని పడుకున్నానని తనకు చెప్పాడన్నారు. వివేకా చావును గుండెపోటుగా ఎవరు ప్రచారం చేశారనేది తనకు తెలియదని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాత సిఐ శంకరయ్య, ఎర్ర గంగిరెడ్డి కలిసి అక్కడకు వచ్చారని వచ్చారని, వివేకా రక్తపు వాంతులు చేసుకుని ఉంటాడని తనతో అన్నారని, దానికి తాను అభ్యంతరం తెలిపానని చెప్పారు. వివేకా ఒంటిపై గాయాలు ఉన్నాయని, ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు.

ఆ సమయంలో సిఐతో మాట్లాడమని రాజశేఖర్‌ రెడ్డికి ఫోన్ చేసి ఇచ్చానని రాజశేఖర్‌ రెడ్డి ఏమి మాట్లాడాడో తనకు తెలియదన్నారు. ఈ లోపు చాలామంది అక్కడకు వచ్చారని ఇనయతుల్లా వెళ్లి లక్ష్మమ్మను పిలుచుకు వచ్చి హాల్ మొత్తం శుభ్రం చేయించాడని, రక్తం చూసి ఆమె మధ్యలో భయపడి బయటకు వెళ్లిపోయిందని, తమ వద్ద పనిచేసే ఇద్దరు యువకులు మరకలు శుభ్రం చేశారని చెప్పాడు.ఎర్రగంగిరెడ్డి, ఇనయతుల్లా, రాజశేఖర్‌, ట్యాంకర్ భాషా అనే వారు శవాన్నీ లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారని చెప్పారు.

ఆ తర్వాత వివేకా శవాన్ని అంబులెన్స్‌‌లో తీసుకు వెళ్లాడని కృష్ణారెడ్డి వివరించాడు. అవినాష్‌ రెడ్డి ఒక్కసారి మాత్రమే శవాన్ని చూడ్డానికి లోపలకు వచ్చాడని కృష్ణారెడ్డి తెలిపాడు. శవాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లిన తర్వాత మాత్రమే అవినాష్ రెడ్డిని చూశానని చెప్పారు. ఆ తర్వాత తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సిఐ చెప్పినట్లు ఫిర్యాదు రాసిచ్చానని చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి తాను ప్రకాష్ కలిసి వెళ్లామని కృష్ణారెడ్డి తెలిపాడు. కంప్లైంట్ ఇచ్చి వచ్చేపుడు ఆస్పత్రికి వెళ్లి, అక్కడ్నుంచి వివేకా ఇంటికి వెళ్లానని చెప్పారు. ఇనయతుల్లాతో మాట్లాడుకుని తాను ఇంటి దగ్గర, అతను ఆస్పత్రి వద్ద సునీత కుటుంబం కోసం వేచి ఉన్నామని చెప్పారు.

రక్తపు మరకలతో వివేకా లేఖ…

వివేకానందరెడ్డి రాసినట్లు చెబుతున్న లేఖ రక్తపు మరకలతో ఉందని, ఆయనతో బలవంతంగా రాయించినట్లు అనిపించిందని, రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒంటిమంగట సమయంలో దానిని అతనికి అప్పగించినట్లు చెప్పారు.

ఆ రోజు సాయంత్రం తమను పోలీసులు పిలిచారని, ఆ తర్వాత వేర్వేరు చోట్లకు తిప్పి రాత్రికి కడప డిటిసికి తీసుకెళ్లి 13రోజుల పాటు ఉంచారని, తమతో పాటు ఎర్రగంగిరెడ్డి, ఇనయతుల్లా, జగదీష్‌, ప్రకాష్, సునీల్ యాదవ్, రాజశేఖర్‌ రెడ్డి, దస్తగిరి తదితరులు ఉన్నారని కృష్ణా రెడ్డి చెప్పారు. 13రోజులు పోలీసుల అదుపులో ఉన్న తర్వాత ముద్దాయిలుగా రిమాండ్ ఇచ్చారని, మూడ్నెల్లు జైల్లో ఉన్నామని చెప్పారు. జైల్లో ఉన్నపుడు సునీత, రాజశేఖర్‌ రెడ్డి వచ్చి చూసే వారని, ఎలా ఉన్నారని వాకబు చేసేవారన్నారు.

ఆ తర్వాత సిబిఐకు కేసు దర్యాప్తు అప్పగించారని, సిబిఐకు అప్పగించిన తర్వాత తమను ఢిల్లీ రమ్మంటున్నారని సిబిఐ వాళ్లు పిలిచారని, ఆ విషయం రాజశేఖర్ రెడ్డికి చెబితే ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసి బస ఏర్పాటు చేస్తాను వెళ్లి రమ్మన్నాడన్నారు. నాలుగు రోజుల్లో పంపేస్తారని చెప్పి పంపారని, ఢిల్లీ వెళ్లిన తర్వాత నెల రోజులు ఉంచుకున్నారని కృష్ణారెడ్డి తెలిపాడు.

అవినాష్‌ వ్యతిరేకంగా వాంగ్మూలం కోసం ఒత్తిడి….

సిబిఐ దర్యాప్తులో భాగంగా ఏఎస్పీ రాంసింగ్ వచ్చి తాను చెప్పినట్లు చెప్పాలని తనను కొట్టే వాడని, అవినాష్ రెడ్డి, శంకర్‌ రెడ్డి మేనేజ్ చేయమని ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. మధ్యలో సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులు కూడా తను బెదిరించారని కృష్ణా రెడ్డి ఆరోపించారు.

తన బెయిల్ రద్దు చేస్తామని బెదిరించే వారని, తాను వారి బెదిరింపులకు ఏనాడు లొంగలేదని చెప్పారు. ఢిల్లీలో నెల ఉన్న తర్వాత తనను పంపేశారని చెప్పాడు. ఆ తర్వాత సునీత, రాజశే‌ఖర్ రెడ్డి తనను హైదరాబాద్‌ రమ్మన్నారని తన కొడుకు ద్వారా ఫోన్ చేయించినట్లు కృష్ణారెడ్డి చెప్పారు. వారెందుకు ఫోన్ చేయలేదంటే భయపడుతున్నారని తన కొడుకు చెప్పాడని కృష్ణారెడ్డి వివరించాడు.

హైదరాబాద్‌లోని కొత్త ఆఫీసుకు తాను వెళితే రాంసింగ్‌కు సహకరించకపోతే ఇబ్బందుల్లో పడతావని, సహకరిస్తే తనను సేవ్ చేస్తామని వైఎస్ సునీత దంపతులు ఆఫర్ ఇచ్చారని కృష్ణారెడ్డి చెప్పారు. అవినాష్ రెడ్డి తనను మేనేజ్ చేసినట్లు సిబిఐకు చెప్పాలని రాజశేఖర్ రెడ్డి తనపై ఒత్తిడి చేశానని, తాను ఎదురు తిరగడంతో సునీత కూడా తనపై ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఆమె తనను ఎవరు కాపాడలేరని బెదిరించిందని, వివేకా వద్ద పనిచేసినందుకు వారు ఏమి చెప్పినా చేయలేనని తాను ఎదురు తిరిగినట్టు కృష్ణారెడ్డి వివరించాడు.

సునీత తనను బెదిరించే క్రమంలో రాజశేఖర్‌ రెడ్డి తనను బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటే, సిబిఐకు కృష్ణారెడ్డి సహకరించకపోతే రాజశేఖర్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సునీత చెప్పిందని, ఆమె ఎందుకు అలా అందో అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత రాంసింగ్ తనకు ఫోన్ చేశాడని, వాట్సాప్‌ కాల్ మాట్లాడాలని తన కుమారుడికి సూచించాడన్నారు.

రాంసింగ్‌తో వాట్సాప్ కాల్ మాట్లాడటంతో దస్తగిరి, రంగన్న తాము చెప్పినట్లు విన్నారని, వారు సురక్షితంగా ఉన్నారని రాంసింగ్ చెప్పారని, తన ఇద్దరు కుమారులును వెంట బెట్టుకుని మర్నాడు ఆర్‌ అండ్ బి గెస్ట్ హౌస్‌కు రమ్మన్నాడని, ఆ విషయం వెంటనే రాజశేఖర్ రెడ్డికి చెప్పడంతో వెళ్లి కలవాలని సూచించినట్లు చెప్పారు.

మర్నాడు కొడుకులతో కలిసి గెస్ట్‌హౌస్‌కు వెళ్లిన సమయంలో తాను చెప్పినట్లు చెప్పాలని రాంసింగ్ ఒత్తిడి చేశారని, తన కొడుకుల ముందు కొట్టడంతో వారు అతనికి ఎదురు తిరగడంతో సాయంత్రం తనను విడిచి పెట్టేసారని, తన కొడుకు పెళ్లైన సంగతి తేలుస్తానని బెదిరించాడన్నారు

కొడుకు పెళ్లి చెడగొట్టారు…

వివేకా హత్య జరిగే నాటికే తన చిన్న కొడుకుకు పెళ్లి ఖరారైందని, సిబిఐ చెప్పినట్లు వినడం లేదని పెళ్లి వారింటికి ఫోన్లు చేసి తమ సంబంధం చేసుకోవద్దని, తనను సిబిఐ అరెస్ట్ చేస్తుందని సునీత, రాజశేఖర్ రెడ్డిలు వియ్యంకుల్ని బెదిరించారని కృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎస్పీ పెద్దగా పట్టించుకోలేదన్నారు. పులివెందుల కోర్టులో కూడా ఫిర్యాదు చేశానని కృష్ణా రెడ్డి చెప్పారు.

సిబిఐ కార్యాలయంలో ఎస్పీ రాంసింగ్ వచ్చిన తర్వాతే కేసు దర్యాప్తు మారిపోయిందని, అన్యాయంగా తన ఉద్యోగం పోయిందని, పాస్‌ పోర్ట్ రెన్యువల్ కాలేదని, కొడుకు పెళ్లి చెడిపోయిందని కృష్ణారెడ్డి వాపోయారు.హత్యకు ముందు రోజు వివేకాతో పాటు తోటకు వెళ్లి వచ్చిన తర్వాత తాను కాలేజీకి వెళ్లిపోయారన్నారు.

రాజశేఖర్ రెడ్డి తప్పుకు నాకు శిక్షా….?

మాజీ మంత్రి వివేకాకు 200ఎకరాల భూములు ఉన్నాయని, హైదరాబాద్‌, కడపలో అవి ఉన్నాయని కృష్ణారెడ్డి చెప్పారు. అన్ని భూములు కంపెనీల పేర్లతో ఉన్నాయని చెప్పారు. వివేకా చనిపోయే వరకు ఆస్తులన్ని కంపెనీ పేరు మీదే ఉండేవన్నారు.

సిబిఐ తనను విచారించిన సమయంలో సునీత తనను ఎందుకు బెదిరించింది, వారు చెప్పినట్టు చెప్పాలని తనపై ఎందుకు ఒత్తిడి చేసిందో సిబిఐ కొత్త దర్యాప్తు బృందానికి చెప్పాలని అనుకున్నానన్నారు. సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తారని సునీత ఎందుకు బెదిరించిందన్నారు. సిబిఐ వాళ్లు ఢిల్లీ, కడపలో తనను ఎందుకు కొట్టి వాళ్లు కోరినట్టు చెప్పించాలనుకున్నారో తెలియ లేదన్నారు.

వైఎస్ వివేకా కుమార్తె సునీత ఏ ఉద్దేశంతో తన కొడుకు పెళ్లి ఎందుకు చెడ గొట్టిందని కృష్ణారెడ్డి ప్రశ్నించారు. సునీత తండ్రి తనకు ఐదెకరాల భూమి ఇస్తారని చెప్పారని, తాను అన్నీ కోల్పోయానని కృష్ణారెడ్డి వాపోయారు. ఎన్నికల సమయంలో జగన్ గెలవబోతున్నాడని, తాను పిహెచ్‌డి పూర్తి చేస్తే మంచి పోస్టింగ్ ఇప్పిస్తానని వివేకా హామీ ఇచ్చారన్నారు.

వివేకాను ఎవరు ఎందుకు హత్య చేశారనేది తనకు తెలియదని, సిబిఐ పారదర్శకంగా, నిజాయితీగా విచారణ చేస్తే దోషులెవరో తెలుస్తుందన్నారు. సిబిఐ కొత్త టీమ్ నిజానిజాలు బయటకొస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.

39ఏళ్లుగా వివేకానందరెడ్డితో తనకు సంబంధం ఉందని, డ్రైవర్‌గా పనిచేసిన దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇచ్చి బహిరంగంగా మాట్లాడుతుండటం చూసే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. . సిబిఐ అధికారులు గతంలో మాదిరే విచారణ చేశారన్నారు.

వివేకా రాసిన లెటర్ దాచిపెట్టమని చెప్పిన వారికి శిక్ష పడకుండా, తనను శిక్షించారని, తన పాస్ పోర్ట్ రెన్యువల్ కాకుండా, పరువు పోగొట్టుకుని జైలు పాలయ్యానని వివేకాను ఎవరు చంపారో బయటపడాలని కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

వాచ్‌మాన్‌ రంగన్నపై అనుమానం….

వాచ్‌మాన్‌ రంగన్న పాత్ర మీద మొదటి నుంచి తనకు అనుమానం ఉందని, ఆ విషయం సిబిఐకు చెప్పానని, సైడ్ డోర్ తెరిచి ఉందనే సంగతి అతనికి ఎలా తెలుసనే విషయాన్ని మొదట ప్రశ్నించానని దానిని ఎవరు పట్టించుకోలేదన్నారు. వివేకా తరచూ బెంగుళూరు వెళ్లడం నిజమే అయినా, ఆర్ధిక లావాదేవీల గురించి తనకు తెలియవన్నారు. వివేకా రెండో పెళ్లి గురించి పుకార్లు వినడమే తప్ప, వ్యక్తిగత విషయాల గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం