Ongole Police Suspended: ఒంగోలు పోలీసులపై సస్పెన్షన్ వేటు…
31 July 2023, 12:34 IST
- Ongole Police Suspended: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలో ఒంగోలులో సీఐ, ఎస్ఐలపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఒంగోలులో గిరిజన యువకుడిపై దాడి చేసి, మూత్రం పోసిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
ఒంగోలులో దారుణం
Ongole Police Suspended: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలో ఒంగోలులో సీఐ, ఎస్ఐలపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఒంగోలులో గిరిజన యువకుడిపై దాడి చేసి, మూత్రం పోసిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఒంగోలులో గిరిజన యువకుడిపై కొందరు యువకులు మూత్రం పోసిన ఘటన కొద్ది రోజుల క్రితం వెలుగు చూసింది.
ఓ యువకుడిని చితకబాదిన కొందరు.. నోట్లో మూత్రం పోశారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యువకుడిపై దాడి ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వచ్చాయి.
మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటన తరహాలోనే ఏపీలో కూడా మద్యం మత్తులో ఓ యువకుడిపై కొందరు మూత్ర విసర్జన చేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యామాల్లో వైరల్ గా మారాయి. నెల రోజుల కిందట జరిగిన ఈ ఘటన కొద్ది రోజుల క్రితం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒంగోలుకు చెందిన కొంతమంది యువకులు ఈజీ మనీ కోసం చిన్నాచితక నేరాలకు పాల్పడుతున్నారు. గొలుసు చోరీలతో పాటు ఇతరత్రా నేరాలకు పాల్పడేవారు. వచ్చిన సొమ్ముతో జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న నవీన్, అంజిల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే నెలరోజుల క్రితం ఒంగోలు శివారులో వీరిద్దరితో పాటు మరి కొంతమంది యువకులు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న అంజి అనే యువకుడు... నవీన్ తో గొడవకు దిగాడు. పాత విషయాలను ప్రస్తావిస్తూ ఇద్దరు తిట్టుకున్నారు. ఈ క్రమంలో నవీన్‌పై మిగిలిన యువకులు దాడికి పాల్పడ్డారు.
నవీన్‌పై అత్యంత పాశవికంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తం కారుతూ నవీన్ విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. దాడి కోపం చల్లారక నవీన్ నోట్లో మూత్రం పోశారు. ఈ దారుణాన్ని తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లో రికార్డు చేశారు. ఈ ఘటన జరిగిన తరువాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే బాధితుడు పాత నేరస్తుడు కావడంతో ఈ విషయాన్ని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఘటన జరిగిన నెల తర్వాత వీడియోలు బయటకు రావడంతో దుమారం రేగింది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ వ్యవహరంలో ఫిర్యాదుపై సకాలంలో స్పందించని ఎస్సై, సిఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు డిఐజి పాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.