తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Issue: పోలవరం ముంపుపై చంద్రబాబుతో చర్చిస్తామన్న ఒడిశా సీఎం మాఝీ

Polavaram Issue: పోలవరం ముంపుపై చంద్రబాబుతో చర్చిస్తామన్న ఒడిశా సీఎం మాఝీ

Sarath chandra.B HT Telugu

30 July 2024, 8:07 IST

google News
  • పోలవరం సమస్య పరిష్కారానికి ఏపీ సీఎంతో సమావేశం: మాఝీపోలవరం సమస్య పరిష్కారానికి ఏపీ సీఎంతో సమావేశం: మాఝీ

పోలవరం ముంపుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని ప్రకటించిన ఒడిశా సిఎం
పోలవరం ముంపుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని ప్రకటించిన ఒడిశా సిఎం (Prahlad Mahato)

పోలవరం ముంపుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని ప్రకటించిన ఒడిశా సిఎం

Polavaram Issue: ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అభ్యంతరాల పరిష్కారానికి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు ఒడిశా సీఎం మాఝీ ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్య పోలవరం సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో త్వరలోనే సమావేశం కానున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు.

జూలై 27న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొని ఢిల్లీ నుంచి వచ్చిన మాఝీ పోలవరం అంశంపై చంద్రబాబుతో, ఒడిశాలో బంగాళాదుంప సంక్షోభంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించినట్లు చెప్పారు.

పోలవరం అంశంపై తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చర్చించినట్టు మాఝీ చెప్పారు. ఈ సమావేశంలో ఒడిశా అభ్యంతరాలు, డిమాండ్లను ప్రస్తావించినట్టు చెప్పారు. సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశాన్ని కూడా తాను ప్రతిపాదించినట్టు మాఝీ చెప్పారు. తన ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించారని అని మాఝీ భువనేశ్వర్ విమానాశ్రయంలో ప్రకటించారు.

పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత రూపంలో అమలు చేస్తే మల్కన్ గిరి జిల్లాలోని పెద్ద ఎత్తున భూములు, కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయనే భయంతో ఒడిశా వ్యతిరేకిస్తోంది. పోలవరం ముంపు తగ్గించడానికి ప్రాజెక్టు నీటి నిల్వ ఎత్తును తగ్గించాలని ఒడిశా డిమాండ్ చేస్తోంది.

మరోవైపు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తికి అన్ని విధాలా సహకరిస్తామని కేంద్రం తన వార్షిక బడ్జెట్ లో హామీ ఇచ్చింది. ఇటీవల ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, బిజెడి సభ్యులు ఇటీవల అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు.

ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జూలై 23న విడుదల చేసిన ప్రకటనలో పోలవరం విషయంలో న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఒడిశా సమస్యలను పరిష్కరించకుండా పోలవరానికి ఎక్కువ నిధులు కేటాయించడం ఒడిశా పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శించడమేనని ఆరోపించారు.

నవీన్ పట్నాయక్ సారథ్యంలో బీజేడీ ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ఒడిశా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినట్టు గుర్తు చేశారు.

ఈ వ్యవహారంపై స్పందించిన ఒడిశా సీఎం లేఖలు రాయడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని తాను నమ్మడం లేదని పేర్కొన్నారు. త్వరలోనే ఏపీ సిఎంతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

తదుపరి వ్యాసం