ANGRAU Notification : ప్రైవేట్ వర్శిటీల్లో బీఎస్సీ ఆనర్స్, బీటెక్ కోర్సుల ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల
26 July 2024, 16:52 IST
- ANGRAU Admissions 2024: రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్శిటీల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల కోసం ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.దరఖాస్తు దాఖలు చేసేందుకు ఆగస్టు 2 తేదీ వరకు గడువు ఉంది.
ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ నోటిఫికేషన్ 2024
బీఎస్సీ, బీటెక్ కోర్సుకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్శిటీల్లో అడ్మిషన్ కోసందరఖాస్తు చేసుకోవడానికి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ) నోటిఫికేషన్ ఇచ్చింది. ఆగస్టు 2వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది.
అదనపు రుసుముతో దరఖాస్తుకు చేసుకోవడానికి ఆగస్టు 12 వరకు గడువు ఇచ్చింది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://ugadmissionsangrau.aptonline.in/ANGRAUGRADU/register పై క్లిక్ చేసి దరఖాస్తు చేయొచ్చు.
యూనివర్శిటీలు...సీట్లు
రాష్ట్రంలో మొత్తం రెండు ప్రైవేట్ యూనివర్శిటీల్లో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సు ఉంది. భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్శిటీ (బీఈఎస్‌టీఐయూ-సత్యసాయి జిల్లా)లో 175 సీట్లు ఉన్నాయి. మోహన్ బాబు యూనివర్శిటీ (ఎంబీయూ-తిరుపతి)లో 63 సీట్లు ఉన్నాయి. ఈ రెండు యూనివర్శిటీలు స్వయంప్రతిపత్తి కలిగినవి. ఎన్‌జీ రంగా యూనివర్శిటీతో ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈ రెండు యూనివర్శిటీల్లో గవర్నమెంట్ కోటా (కన్వీనర్ కోటా) సీట్ల భర్తీకి అడ్మిషన్ నోటిఫికేషన్ మాత్రం ఎన్‌జీ రంగా యూనివర్శిటీ ఇస్తుంది.
అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయిపోతే, ఎన్‌జీ రంగా యూనివర్శిటీ జోక్యం మరి ఉండదు. గవర్నమెంట్ కోటా సీట్లపై ఎటువంటి ఫిర్యాదులపై ఈ రెండు ప్రైవేట్ యూనివర్శిటీలకు బాధ్యత ఉండదు. రెండు దశల కౌన్సిలింగ్ పూర్తి అయిన తరువాత మిగిలిన సీట్లను ఈ రెండు యూనివర్శిటీలు స్వాధీనం చేసుకుంటాయి.
అర్హతలు….
రెండేళ్ల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. లేకపోతే దానికి సమానమైన గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి పిజికల్ సైన్స్, బయోలజీ, నేచురల్ సైన్స్ గ్రూపులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024 డిసెంబర్ 31 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 17-22 ఏళ్ల వయస్సు ఉండాలి. అంటే 2003 జనవరి 1-2007 డిసెంబర్ 31 మధ్య పుట్టినవారై ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17-25 ఏళ్ల వయస్సు ఉండాలి. అంటే 2000 జనవరి 1 నుంచి 2007 డిసెంబర్ 31 మధ్య పుట్టినవారై ఉండాలి. దివ్యాంగులకు అభ్యర్థులకు 17-27 ఏళ్ల వయస్సు ఉండాలి. అంటే 1998 జనవరి 1 నుంచి 2007 డిసెంబర్ 31 మధ్య పుట్టినవారై ఉండాలి.
వ్యవసాయ, గ్రామీణ ప్రాంత కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులకు రైతు కోటా ఉంటుంది. 40 శాతం సీట్లు వ్యవసాయ కుటుంబాలకే కేటాయించారు. అభ్యర్థి కనీసం నాలుగేళ్లు నాన్ మున్సిపల్ ప్రాంతం (గ్రామీణ)లో చదవి ఉండాలి. ఒక ఎకరా కంటే తక్కువ భూమి ఉన్న అభ్యర్థులు అర్హులు కాదు. అభ్యర్థి, తల్లిదండ్రుల పేరు మీద భూమి ఉండాలి. తాత, నాన్నమ్మ, గార్డియన్, ఇతర కుటుంబ సభ్యులు ఎవరి పేరు మీద భూమి ఉన్న అర్హులు కాదు.
ఓపెన్ కేటగిరిలో 41 శాతం సీట్లు ఉన్నాయి. ఎస్‌సీ కేటగిరిలో 15 శాతం సీట్లు, ఎస్‌టీ కేటగిరిలో 6 శాతం సీట్లు ఉన్నాయి. బీసీ కేటగిరిలో 29 శాతం సీట్లు ఉన్నాయి. అందులో బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం సీట్లు ఉన్నాయి. అలాగే వికలాంగు (పీహెచ్) కేటగిరిలో 5 శాతం సీట్లు ఉన్నాయి. సైనిక సిబ్బంది పిల్లల కేటగిరిలో 2 శాతం, ఎస్‌సీసీ కేటగిరిలో 1 శాతం, స్పోర్ట్స్ కేటగిరీకి 0.5 శాతం, స్కౌట్స్, గైడ్స్ కేటగిరీలో 0.5 శాతం సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 10 శాతం సీట్లు కేటాయించారు.
ఎంపిక విధానం
బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు ఏపీ ఈఏపిసెట్-2024 రాష్ట్రస్థాయి ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు. యూనివర్శిటీ కాలేజీ, అనుబంధ కాలేజీల్లో సీట్లను 85 శాతం లోకల్ సీట్లు కాగా, అందులో ఆంధ్రాయూనివర్శిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ప్రాంత అభ్యర్థులకు 42ః22 నిష్పత్తిలో కేటాయిస్తారు. 15 శాతం సీట్లు అన్ రిజర్వడ్, ఏయూ, ఎస్‌వీయుతోపాటు ఏపీఈఏపీసెట్-2024 ర్యాంకు సాధించిన ఉస్మానియా యూనివర్శిటీ అభ్యర్థులు కూడా సీట్లకు పోటీ పడొచ్చు.
అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500 కాగా, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000 నిర్ణయించారు. అప్లికేషన్ దాఖలకు గడువు ఆగస్టు 2న ముగిసిన తరువాత మరో మూడు రోజులు అదనపు ఫీజుతో దరఖాస్తు చేయాలనుకునే జనరల్ కేటగిరీ, బీసీ అభ్యర్థులు రూ.2,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
కోర్సు ఫీజులు ఎలా ఉంటాయి?
భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్శిటీ (బీఈఎస్‌టీఐయూ-సత్యసాయి జిల్లా)లో ఏడాది ఫీజు రూ.99,000 ఉంటుంది. మోహన్ బాబు యూనివర్శిటీ (ఎంబీయూ-తిరుపతి)లో ఏడాది ఫీజు రూ.1,03,000 ఉంటుంది. ఈ రెండు యూనివర్శిటీలకు సంబంధించి అదనపు సమాచారం కోసం బీఈఎస్‌టీఐయూ అధికారిక వెబ్‌సైట్ https://bestiu.edu.in/ , ఎంబీయూ అధికారిక వెబ్‌సైట్ mbu.asia ను సంప్రదించాలి.
అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుపోవాలి. ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, ఏపీ ఈఏపీసెట్-2024 హాల్ టికెట్టు, ర్యాంక్ కార్డు. పదో తరగతి లేదా పదో ఎస్ఎస్‌సీకి సమాన పరీక్ష సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, టీసీ, ఫార్మర్ కోటా కింద చేరే విద్యార్థులైతే రూరల్ ఏరియా విద్యార్థులు నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్, భూమికి సంబంధించిన అడంగల్, 1 బీ అదనపు సర్టిఫికేట్లు తీసుకురావాలి. వికలాంగు విద్యార్థులైతే పిహెచ్ సర్టిఫికేట్, డిఫెన్స్ పిల్లలైతే ఐడీ కార్డు, ఎన్‌సీసీ అభ్యర్థులైతే ఎన్‌సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్ అభ్యర్థులైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ తప్పని సరిగా ఉండాలి. ఈ ధ్రువీకరణ పత్రాలన్నీ అడ్మిషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.
ఇతర వివరాల కోసం ఈ క్రింద ఫోన్ నెంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5ః30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. బీఈఎస్‌టీఐయూకి సంబంధించి 7989171905, 8977808389, 9885262362, 6310194071, 9492725055 ఫోన్ నెంబర్లు, ఎంబీయూకి సంబంధించి 9469465946, 7997970324 ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.