NIA Arrests: పాకిస్తాన్ గూఢచర్యం కేసులో మరొకరి అరెస్ట్
21 November 2023, 6:50 IST
- NIA Arrests: విశాఖపట్నం నావల్ డాక్ యార్డు కేంద్రంగా వెలుగు చూసిన పాకిస్తాన్ గూఢచర్యం కేసులో మరొకరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
గూఢచర్యం కేసులో ఎన్‌ఐఏ అరెస్ట్
NIA Arrests: విశాఖ నేవల్ డాక్ యార్డ్‌లో వెలుగు చూసిన నేవీ ఉద్యోగుల గూఢచర్యం కేసులో ఎన్‌ఐఏ మరొకరిని అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టులు మూడుకు చేరాయి. జాతీయ పరిశోధన సంస్థమరో నిందితుడిని సోమవారం ముంబైలో అరెస్టు చేసింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబైలోని రెండు ప్రదేశాల్లో, అస్సాంలోని నాగావ్ జిల్లా హోజాయ్‌లో సోమవారం ఎన్ఎస్ఐఏ నిర్వహించిన దాడుల తర్వాత అమాన్ సలీం షేక్‌ను పట్టుకున్నారు.
అమాన్‌ను అరెస్టు చేసిన ప్రదేశం నుంచి ఎన్ఎస్ఐఏ బృందాలు సోమవారం రెండు మొబైల్ ఫోన్లు, ఇతర ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో మరో రెండు ఫోన్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ నేవల్ డాక్ యార్డ్ ఎలక్ట్రికల్ ఆర్టిఫైసర్ రేడియో అప్రెంటీస్ గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆకాష్ సోలంకి (21) భారతీయ నేవీకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధిం చిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ గూఢచర్య నెట్‌వర్క్‌కు అంద చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
2021లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారంపై మొదట విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కేసు నమోదు చేసినా, కేసు తీవ్రత దృష్ట్యా దానిని ఎన్ఐఏకు బదిలీ చేశారు. ఈ వ్యవ హారంపై ఎన్ఎస్ఐఏ దర్యాప్తు చేపట్టగా.. ఆకాష్ సోలంకి నుంచి సమాచారాన్ని అందించినందుకు పాకిస్తాన్ జాతీయుడు మీర్ బాలాజ్ ఖాన్ నుంచి క్రిప్టో చానెల్ ద్వారా నగదు పొందినట్లు గుర్తించారు.
గూఢచర్యం వెలుగు చూసిన తర్వాత ఆకాష్ సోలంకిని అరెస్టు చేసినప్పటికీ మీర్ బాలాజ్ ఖాన్ మాత్రం పాకిస్థాన్లో తలదాచుకున్నాడు. ఈ ఏడాది జూలై 19న వీరిద్దరిపై ఎన్ఐఏ చార్జీషీట్ నమోదు చేసింది. ఈ ఏడాది నవంబర్ 6న ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోసించిన మన్మోహన్ సురేంద్ర పాండా, ఆల్వెన్‌ల భాగస్వామ్యం కూడా ఉన్నట్టు గుర్తించి వారిపై ఎస్ఐఏ అనుబంధ చార్జీషీట్ దాఖలు చేసింది. సురేంద్ర పాండా ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఆల్వెన్ మాత్రం పాకిస్తాన్‌లో తల దాచుకున్నట్లు ఎన్‌ఐఏ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అమాన్‌ను విచారిస్తే ఈ కేసులో మరిన్ని చిక్కుముడులు బయటకు వస్తాయని పేర్కొంది.