తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Politics : తిట్లు, బూతులు, శాపనార్ధాలే ఏపీలో లేటెస్ట్ పొలిటికల్‌ స్టైల్…..

AP Politics : తిట్లు, బూతులు, శాపనార్ధాలే ఏపీలో లేటెస్ట్ పొలిటికల్‌ స్టైల్…..

HT Telugu Desk HT Telugu

20 June 2022, 18:57 IST

google News
    • ఏపీ రాజకీయాల్లో నాయకులు ఎంత బాగా నోటి దురుసు ప్రదర్శిస్తే అంత బాగా మైలేజీ వస్తుందనే భావనలో ఉంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, పెద్దగా చదువుకోని నాయకులే కాదు ఉన్నత చదువులు చదువుకుని మంచి పదవుల్లో ఉన్న వారు సైతం ఇందుకు అతీతంగా ఏమి వ్యవహరించడం లేదు. సోషల్ మీడియాలో నాయకుల నోటీ దూలను అక్షరాల రూపంలో ప్రదర్శిస్తున్నారు. స్థాయితో సంబంధం లేకుండా సాగుతున్న నేతల వ్యవహార శైలి ఇప్పుడు జనంలో చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ ప్రత్యర్ధులపై ఎంపీ సాయిరెడ్డి ట్వీట్లలో వాడుతున్న భాష చర్చనీయాంశంగా మారింది
రాజకీయ ప్రత్యర్ధులపై ఎంపీ సాయిరెడ్డి ట్వీట్లలో వాడుతున్న భాష చర్చనీయాంశంగా మారింది

రాజకీయ ప్రత్యర్ధులపై ఎంపీ సాయిరెడ్డి ట్వీట్లలో వాడుతున్న భాష చర్చనీయాంశంగా మారింది

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలంటేనే రొచ్చు రాజకీయాలని ఎప్పుడో ముద్రపడింది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా నాయకులు తమ స్థాయి మరచి వీలైనంత దిగజారడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పించే క్రమంలో అదుపు తప్పుతున్నా అదో ఘన కార్యంలా భావిస్తున్నారు. ఈ తరహా దుందుడుకు వైఖరి ఒకరిద్దరు నాయకులకు సెట్‌ అయ్యిందేమో కానీ ఒకరిని చూసి మరొకరు అదే బాట పడుతుండటం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్ధుల మీద నోటిదురుసుతో విరుచుకుపడటంతో కొడాలి నాని పేరు ఒకప్పుడు బాగా వినిపించేది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వీరాభిమాని అయిన కొడాలి నాని ఈ మధ్య కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ తర్వాత ఆయనలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. దానికి ఆ‍యన కారాణాలు ఆ‍యనకు ఉండి ఉండొచ్చు. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్ధుల మీద ఒంటికాలిపై లేచిన కొడాలి, పేర్ని వంటి నేతల్లో మునుపటి ఉత్సాహం లేదు. అదే సమయంలో వారికి మించిన దూషణల పర్వాన్ని కొనసాగిస్తున్న నేతలు కూడా లేకపోలేదు.

వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవలి కాలంలో ట్విట్టర్‌లో చెలరేగిపోతున్నారు. రెండోసారి రాజ్యసభ సభ్యత్వం వచ్చిన తర్వాత ఆయన దూకుడు పెంచారు. ప్రత్యర్ధుల మీద మాటలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో వినియోగిస్తున్న భాష, పదజాలం ఆయన స్థాయికి ఏమాత్రం తగని విధంగా ఉంటోంది. నిజానికి విజయసాయిరెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా డిగ్నిఫైడ్‌ పొలిటిషియన్‌గానే వ్యవహరించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. తొలిసారి రాజ్యసభ సభ్యత్వం దక్కిన తర్వాత వైసీపీ తరపున కేంద్రంలో పనులు చక్కబెట్టడంలో సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి కూల్‌గానే ఉండేది. ప్రత్యర్ధులు ఆయనపై విమర్శలు గుప్పించినా, రాజకీయంగా టార్గెట్‌ చేసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. సాయిరెడ్డి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్లను కూడా ప్రొఫెషనల్స్‌ నిర్వహించేవారు.

ఇటీవలి కాలంలో సాయిరెడ్డి ట్విట్టర్‌ హ్యాండిల్‌ గమనిస్తున్న వారికి అందులో వాడుతున్న భాష, విమర్శల శైైలి, దూకుడు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.వైసీపీలో కీలక నాయకుడైన సాయిరెడ్డికి తెలిసి, ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ఆht భాషను వాడుతున్నారా, ఆయన పూర్తిగా సోషల్ మీడియా ఖాతాలను పట్టించుకోవడం లేదా అనే సందేహాలు కూడా లేకపోలేదు. మితిమీరిన దూషణలు, వ్యంగ్యం, దూషణలు సాధారణైపోయాయి. ఇటీవలి కాలంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్‌, ఇతర నాయకుల్ని విమర్శించే క్రమంలో ఆ‍యన ఖాతా నుంచి వస్తున్న ట్వీట్లలో విపరీత ధోరణి కనిపిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో సాయిరెడ్డి ప్రకటనలు, ట్వీట్లకు ఆ పార్టీ పత్రిక సాక్షిలో మాత్రం కనిపించకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. సొంత పత్రికలో సైతం ప్రచురించలేని విధంగా సాయిరెడ్డి కామెంట్లు చేస్తున్నారని చెవులు కొరుకుంటున్నారు. టీడీపీ నాయకులు ఏ స్థాయి వారు ముఖ్యమంత్రిని విమర్శించినా వారిపై విరుచుకుపడటమే సాయిరెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది.

టీడీపీ నాయకులు కూడా ఇందుకు భిన్నంగా ఏమి వ్యవహరించడం లేదు. సోషల్ మీడియాలో అభిమానుల్ని అలరించడమే పనిగా పోస్టింగులు పెడుతున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఖాతా నుంచి కూడా ఇలాంటి స్థాయి తక్కువ ట్వీట్లకు కొదవ లేదు. ఆ పార్టీ నాయకులు బుద్దావెంకన్న, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి వంటి వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రాజకీయ విమర్శలంటే బూతులు, తిట్లు, శాపనార్ధాలు ఇవే అన్నట్లుగా ఉంటుంది. వాటిని షేర్‌ చేసి లైక్ చేసి సంబరపడే అభిమానుల్ని చూసి సంబరపడిపోవడం తప్ప జనంలో పలుచనైపోతున్నామనే స్పృహ మాత్రం నాయకులు ఉండట్లేదు.

టాపిక్

తదుపరి వ్యాసం