Nara Lokesh and Puneeth: నేడు సిట్ ముందుకు లోకేష్, నారాయణ అల్లుడు పునీత్
11 October 2023, 11:25 IST
- Nara Lokesh and Puneeth: టీడీపీ నారా లోకేష్ రెండో రోజు సిట్ విచారణకు హాజరు కానున్నారు. నారా లోకేష్‌తో పాటు మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కూడా నేటి విచారణకు హాజరు కానున్నారు.
సిఐడి విచారణకు హాజరైన నారా లోకేష్
Nara Lokesh and Puneeth: ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో రెండో రోజు విచారణకు నారా లోకేష్ హాజరు కానున్నారు. ఈ కేసులో ఏ14 గా ఉన్న లోకేష్‌ను మంగళవారం ఆరు గంటల పాటు సీఐడీ అధికారులు విచారించారు. ఈ కేసులో మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని భావించిన సిఐడి మరోసారి 41ఏ నోటీసులు జారీ చేసి బుధవారం విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసుకు నారా లోకేష్ రానున్నారు.
మరోవైపు బుధవారం జరిగే సిఐడి విచారణకు లోకేష్‌తో పాటు మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌ను కూడా సిఐడి విచారణకు పిలిచారు. సిఐడి జారీ చేసిన నోటీసుల్ని కొట్టేయాలని మంగళవారం పునీత్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.
నారాయణ అల్లుడు పునీత్‌ను న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. 11వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య విచారించాలని, భోజన విరామం ఓ గంట ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
రింగ్‌రోడ్డు కేసులో విచారణ నిమిత్తం ఈనెల 11న తమ ముందు హాజరుకావాలని సీఐడీ ఇచ్చిన నోటీసుపై మంగళవారం పునీత్ హైకోర్టును ఆశ్రయించారు. సిఐడి నోటీసులు కొట్టేయాలని కోరారు. అదే సమయంలో విచారణ తప్పనిసరి అని అధికారులు భావిస్తే న్యాయవాది సమక్షంలో ప్రశ్నించేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని సిఐడిని ఆదేశించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు భూముల వ్యహారంలో నారా లోకేష్, పునీత్‌ల మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగాయని సిఐడి అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరిని ఒకే చోట ఉంచి విచారించనున్నట్లు తెలుస్తోంది. రింగ్ రోడ్డు భూముల అలైన్‌మెంట్ మార్పులు జరిగిన సమయంలో జరిగిన నగదు లావాదేవీలపై ఇద్దరిని కలిపి ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇంటి వద్ద విచారించాలని నారాయణ పిటిషన్…
మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ కోసం రావాలని మాజీ మంత్రి నారాయణకు సీఐడీ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. నారాయణను ఇంటివద్ద విచారించాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చిన విషయాన్ని గుర్తుచేసింది.
నిబంధనల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారిని ఇంటి వద్దే విచారించాలని తెలిపింది. కార్యాలయానికి ఎందుకు రమ్మంటున్నారని సీఐడీని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన చట్ట నిబంధనలు ఏమున్నాయో చెప్పాలని ఏపీపీ దుష్యంత్‌రెడ్డిని న్యాయస్థానం ప్రశ్నించింది. నారాయణ పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి ఉత్తర్వులిచ్చారు.