Murder Case: ఆస్తి కోసం దారుణం... సొంత చెల్లిని మర్డర్ చేయించిన అన్న
08 April 2023, 11:30 IST
- Prakasam district Police: ప్రకాశం జిల్లాలో మహిళా హత్య కేసును పోలీసులు చేధించారు. సొంత అన్ననే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. కుట్రదారులతో పాటు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మలిక్ గర్గ్ వెల్లడించారు.
కేసు వివరాలను వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ మలిక్ గర్గ్
Mysterious murder of woman Resolved: ఆస్తి కోసం పేగు బంధాన్ని తెంచేశాడు. అప్పుల బారి నుంచి బయటపడాలంటే సొంత చెల్లెని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు ఓ అన్న. తీరా అనుకున్నట్లే ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఓ ముఠాను కూడా ఏర్పాటు చేశాడు. అనుకున్నట్లు ఓ రోజూ ముఠా రంగంలోకి దిగింది. ఆ మహిళను గొంతుకోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసులో సొంత అన్ననే నిందితుడిగా తేల్చారు పోలీసులు. హత్య చేసిన నిందితులతో పాటు కుట్రదారులను అరెస్ట్ చేశారు.
చెల్లిని మర్డర్ చేసిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. ఈ కేసును విచారించిన పోలీసులు... స్వల్ప వ్యవధిలో నిందితులను పట్టుకున్నారు. పోలీసులు వివరాల ప్రకారం.... కనిగిరికి చెందిన సుశీల, కొలిపర్తి శ్రీనివాసులు అన్నాచెల్లెళ్లు. మేనమామతో వివాహమైన కొద్దిరోజులకే అతనితో సుశీలకు మనస్పర్థలు రావడంతో తల్లితో కలిసి కనిగిరిలో నివాసం ఉంటోంది. అన్న శ్రీనివాసులు మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ భార్యలకు దూరంగా ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ మధ్య నష్టపోయిన అతను అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి తన తల్లి పేరుపై ఉన్న ఆస్తుల మీద కన్నేశాడు. అయితే చెల్లెలు సుశీల ఆ ఆస్తులకు తన పేరు మీద వీలునామా రాయించుకుంది. అయితే వాటిని తన పేరు మీదకు రాయాలని అన్న శ్రీనివాసులు ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలో సుశీల మీద కక్ష పెంచుకున్నాడు శ్రీనివాసులు. ఇందుకోసం మాస్టర్ స్కెచ్ వేశాడు. తెలిసిన వారి సాయంతో ఓ ముఠాను సంప్రదించాడు. విజయవాడకు చెందిన కరిముల్లా బేగ్‌తో రూ.10 లక్షలకు హత్య ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా కొంత నగదును కూడా అడ్వాన్స్ కింద ఇచ్చాడు శ్రీనివాసులు. అయితే సమయం కోసం వేచి చూస్తున్న బేగ్... సుశీల నివాసం పైఅంతస్తు ఖాళీగా ఉండటంతో అందులో అద్దెకు దిగి హత్య చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇది వర్కౌట్ కాలేదు. అయితే ప్లాన్ మార్చిన బేగ్... 4వ తేదీన నేరుగా సుశీల ఇంటికి అద్దె కోసం వెళ్లాడు. ఇల్లు చూపించడానికి పైఅంతస్తుకు వెళ్లిన సుశీలపై దాడిచేశారు. గొంతు కోసి తలపై సుత్తితో దాడి చేసి హత్య చేసి వెళ్లిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. హత్య కేసును చేధించారు. సోదరుడు శ్రీనివాసులతో పాటు బేగ్, బత్తుల లలితతో పాటు మరో బాలుడిని అరెస్ట్ చేశారు. హత్య కేసును స్వల్ప వ్యవధిలో ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.