Amaravati Future: మంత్రి నారాయణ అన్నీ చెప్పారు కానీ ఆ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.. రాజధాని నోటిఫికేషన్‌పై ఇంకా మౌనమే..
17 October 2024, 7:51 IST
- Amaravati Future: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని గడువు ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా రాజధాని నగరంగా అమరావతిని ఖరారు చేస్తూ ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం చర్చనీయాంశంగా మారింది. సిఆర్‌డిఏ సమావేశం తర్వాత కూడా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.
అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో కదలిక, డిసెంబర్ నాటికి టెండర్లు ఖరారు
Amaravati Future: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది రూ.15వేల కోట్లు ఇస్తామని ప్రకటించడంతో టెండర్లను ఖరారు చేసే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సిఆర్‌డిఏ 38వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతిలో పలు అభివృద్ది పనులకు సంబందించిన అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు మినహా మిగిలిన అన్ని పనులకు టెండర్లను డిశంబరు చివరికల్లా పిలువనున్నామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ పనులు అన్నీ ఏడాది నుండి రెండున్నర్రేళ్లలోపు పూర్తి అవుతాయన్నారు.
2014-19 మధ్య కాలంలో అమరావతి రాజదాని ప్రాంతంలో దాదాపు 3,600 అపార్టుమెంట్లను కట్టారు. వాటిలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు ఐ.ఏ.ఎస్. అధికారులు నివాసానికి సంబందించి 432 ప్లాట్లతో కూడిన 18 టవర్ల నిర్మాణాలను గతంలోనే పూర్తి చేశారు. ఈ భవనాలకు సివరేజ్ ప్లాంట్, త్రాగునీటి సరఫరా, క్లబ్ హౌస్ నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని రూ.524 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు తాజా సమావేశంలో క్లియరెన్సు ఇచ్చారు.
సిఆర్‌డిఏ భవనానికి అమోదం..
రెండు మూడు రోజుల్లో వాటికి సంబందించిన టెండర్లను పిలిచి 20 రోజుల్లో ఈ పనులను ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. సీఆర్డిఏ కార్యాలయం కోసం గతంలో తమ ప్రభుత్వం జి+7 భవన నిర్మాణాన్ని చేపట్టి స్ట్రక్చర్ పూర్తి చేయడం జరిగిందని, అయితే గత ప్రభుత్వం దాని నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం తో రూ.160 కోట్లతో దాన్ని పూర్తి చేసేందుకు నేటి సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ పనులకు సంబందించిన టెండర్లు ఖరారు అయిన నేపధ్యంలో పనులను నాలుగైదు రోజుల్లో ప్రారంభించనున్నారు.
సీఆర్‌డీఏ, ఏడీసీ, మెప్మా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, మునిసిపల్ ఆఫీసు తదితర కార్యాలయాలను ఈ భవనంలో ఏర్పాటు చేయనున్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతి డవలెప్మెంట్ కార్పొరేషన్ దాదాపు 360 కి.మి. మేర ట్రంక్ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టిందని అవి వివిద దశల్లో ఉన్నాయని నారాయణ వివరించారు. వాటి కాలపరిధి పూర్తి అయిన నేపథ్యంలో డిశంబరు కల్లా తిరిగి టెండర్లను పిలువనున్నామన్నారు.
వరద ముంపు నివారణ చర్యలు..
రాజధాని ప్రాంతం ఎటు వంటి వరదలకు, ముంపుకు గురి అయ్యే అవకాశం లేకుండా ఉండేందుకై కొండవీటి వాగు, పాలవాగు, గ్రామిటీ కెనాల్ డిజైన్లను రూపొందించే పనిని నెథర్లాండ్ వారికి అప్పగించారు. ఇటీవల బుడమేరు వల్ల విజయవాడ నగరానికి సంభవించిన ముంపును దృష్టిలో ఉంచుకుని మరింత పటిష్టవంతంగా డిజైన్లు రూపొందించాలని ఆర్.వి. కన్సల్టెన్సీకి అప్పగించినట్టు చెప్పారు. ఆ డిజైన్ పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయని, వాటికి సంబందించిన టెండర్లను నవంబరులో పిలువనున్నారు.
సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేటివ్ ఐకానిక్ టవర్లకు సంబందించిన టెండర్లను కూడా డిశంబరుకల్లా పిలవనున్నారు. 2009 లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని కరకట్ట రోడ్డు డిజైన్ చేసినా బుడమేరు వరద దృష్ట్యా రిడిజైన్ చేసేందుకు కన్సల్టెన్సీకి అప్పగించారు. ఈ పనులనకు సంబందించి 15 రోజుల్లో టెండర్లను పిలవనున్నారు.
హైవేతో అనుసంధానం..
జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించేందుకు ప్రతిపాదించిన E-7/9/11/13 రోడ్ల నిర్మాణ పనులకు సంబందించి టెండర్లను రెండు నెలల్లో ఖరారు చేయనున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.15 వేల కోట్ల మంజూరుకు సంబందించి పర్యావరణం మరియు సోషల్ మేనేజ్మంట్ తదితర అంశాలపై చర్చలు జరుగుచున్నాయని, ఈ ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చిందని, నవంబరు లేదా డిశంబరులో ఈ నిధులు కూడా మంజూరు అయ్యే అకాశం ఉందన్నారు.
ఇకపై ఎప్పటికప్పుడు సీఆర్‌డీఏ అకౌంట్స్ సబ్మిట్ చేయడం జరుగుతుందన్నారు. రాజధాని రైతులకు త్వరలోనే ప్లాట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. పరిహారం విషయంలో కూడా రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో దాదాపు జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తి కానున్నట్టు వివరించారు.
ప్రస్తావనే లేని రాజధాని నోటిఫికేషన్…
ఉమ్మడి రాజధాని గడవు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటనే దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఉమ్మడి రాజధానికి జూన్ 2వ తేదీతో కాలం చెల్లడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని నోటిఫై చేస్తూ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వెలువడలేదు. గతంలో మూడు రాజధానులంటూ జరిగిన పరిణామాలతో పెట్టుబడిదారుల్లో అమరావతిపై అపోహలు నెలకొన్నాయి. ప్రభుత్వాలు మారితే ప్రాధాన్యతలు మారిపోతాయనే అపప్రద మూటగట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు షెడ్యూల్ 9,10 ఆస్తుల విభజన అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజధాని నిర్మాణంలో భాగంగా వేల కోట్లను వెచ్చిస్తున్నా అమరావతి నగరానికి సాధికారత కల్పించే విషయంలో తాత్సారం జరుగుతూనే ఉంది.