Temples : దేవదాయ శాఖలోకి రెవెన్యూ సిబ్బంది.. ఆ భూములపై ప్రభుత్వ కీలక నిర్ణయం
16 August 2022, 18:00 IST
- అర్చకుల చేతుల్లో ఉన్న భూములకి సంబంధించిన పర్యవేక్షణ దేవదాయ శాఖదేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. భూముల నుంచి వచ్చే ఫలసాయాన్ని మాత్రం వారు అనుభవించవచ్చు అని పేర్కొంది.
మంత్రి కొట్టు సత్యనారాయణ
దేవుడి మాన్యం భూములపై హక్కులు దేవదాయ శాఖదేనని దాని మీద ఫలసాయం పొందే అవకాశం మాత్రమే ఖాస్తుదారులకు ఉంటుందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. నిబంధనల ప్రకారమే రెవెన్యూ శాఖ వారిని.. దేవదాయ శాఖలో తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగుల కొరత ఉందని అన్నారు.
'పరిపాలనా కోసం మాత్రమే రెవెన్యూ ఉద్యోగులను తీసుకుంటున్నాం. ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చినంత మాత్రాన శాస్త్ర ప్రకారం జరగదంటే ఎలా? రెవెన్యూ అధికారులు పరిపాలన చేస్తారు తప్ప.. నామం ఎలా పెట్టాలో చెప్పరు కదా? 4.20 లక్షల ఎకరాల భూమి దేవదాయ శాఖ పరిధిలో ఉంది. వీటిల్లో కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. దేవుడి మాన్యం భూముల్లో ఆక్రమణలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సీఎం జగన్ ఆదేశంతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశాం. ప్రతి మూడేళ్లకోసారి ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసుకుంటూ వెళ్లాలి.' అని మంత్రి సత్యనారాయణ అన్నారు.
ఎన్నో అక్రమాలు జరిగినా.. టీడీపీ హయాంలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేదని మంత్రి విమర్శించారు. రూ. 25 లక్షల నుంచి రూ. కోటి ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్ట్ బోర్డును ధార్మిక పరిషత్ ద్వారానే వేయాల్సి ఉంటుందన్నారు. మఠాధిపతుల విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆ సమస్యను ధార్మిక పరిషత్ పరిష్కరిస్తుందన్నారు. మఠాలకు, పీఠాలకు భూముల లీజు, పొడిగింపు అంశాలు ధార్మిక పరిషత్తే పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. దేవదాయ శాఖ చేయలేని ఎన్నో పనులను ధార్మిక పరిషత్ ద్వారా చేసే అవకాశం ఉందని చెప్పారు. సీజీఎఫ్ కమిటీలో మరో ముగ్గురును నియమించామని తెలిపారు.
ధూప దీప నైవేద్యాల నిమిత్తం నిధులు కావాలని సుమారు 3500 దేవాలయాలు దరఖాస్తు చేసుకున్నాయి. శాచ్యూరేషన్ పద్ధతిలో ధూప దీప నైవైద్య నిధులను దేవాలయాలకు అందించాలని నిర్ణయించాం. అర్హత ఉన్న ప్రతి దేవాలయానికి ధూప దీప నైవేద్యం స్కీం కింద రూ. 5 వేలు ఇస్తాం. దేవదాయ శాఖ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఎనిమిది మంది అమీనాలను దేవదాయ శాఖ ట్రిబ్యునల్ కోసం ఇవ్వాలని హైకోర్టును కోరనున్నాం. దేవదాయ శాఖ ట్రిబ్యునల్లో కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటుకు నిర్ణయించాం. గత ప్రభుత్వం పడగొట్టిన 44 ఆలయాల్లో ఏడు ఆలయాలు పునః నిర్మాణం పూర్తయ్యాయి.
- మంత్రి కొట్టు సత్యనారాయణ