AP EAP Cet Results: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స
14 June 2023, 11:47 IST
- AP EAP Cet Results: ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయన విడుదల చేశారు. మూడేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఇంటర్ మార్కుల వెయిటేజీతో కలిపి ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ ప్రవేశపరీక్ష ఫలితాలను విడుదల చేశారు.
ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి బొత్స
AP EAP Cet Results: ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీ సెట్ నిర్వహించిన జేఎన్‌టీయూ అనంతపురం అధికారులను మంత్రి బొత్స అభినందించారు. మార్చి 10న నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు.
ఈఏపీ సెట్ పరీక్షలకు ఈ ఏడాది 3,38,739మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంజనీరింగ్ పరీక్షలకు 2.38 లక్షల మంది, అగ్రికల్చర్ విభాగంలో 1,00,559 మంది దరఖాస్తు చేశారని చెప్పారు. ఇంజనీరింగ్, ఫార్మా విభాగంలో 2,38,180మంది దరఖాస్తు చేసుకుంటే 2,24,724మంది పరీక్షలకు హాజరయ్యారని వారిలో 1,71,514మంది అర్హత సాధించినట్లు చెప్పారు.మొత్తం హాజరైన వారిలో 76.32శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు.
అగ్రికల్చర్ విభాగంలో 1,00,559మంది దరఖాస్తు చేస్తే 90,573మంది పరీక్షలకు హాజరయ్యారని వారిలో 81203మంది అర్హత సాధించినట్లు చెప్పారు.అగ్రి విభాగంలో 89.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స వివరించారు.
ఇంజనీరింగ్/ఫార్మసీ విభాగంలో మొదటి ర్యాంకును ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చల్లా ఉమేష్ వరుణ్ సాధించాడు. నార్మలైజేషన్‌లో 158.0313 మార్కులు సాధించాడు. రెండో ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన బిక్కిన అభినవ్ చౌదరి 157.2624 మార్కులో దక్కించుకున్నాడు. మూడో ర్యాంకును పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన నందిపాటి సాయిదుర్గారెడ్డి 155.2980మార్కులతో సాధించారు. నాలుగో ర్యాంకును తిరుపతికి చెందిన చింతపర్తి బాబు సంజీవ్ రెడ్డి(155.6847మార్కులు), ఐదో ర్యాంకును అన్నమయ్య జిల్లాకు చెందిన దుగ్గునేని వెంకట యుగేష్ 154.6556 మార్కులతో సాధించాడు.
ఇంజనీరింగ్ ఫార్మా విభాగంలో ఆరో ర్యాంకును చిలకలూరి పేటకు అడ్డగడ వెంకట శివరామ్( 153.9792మార్కులు), ఏడో ర్యాంకును గుంటూరుకు చెందిన యక్కంటి ఫణి వెంకట మణీంధర్ రెడ్డి( 154.6274 మార్కులు), 8వ ర్యాంకును అనంతపురంకు చెందిన మేడాపురం లక్ష్మీనారాయణ మాధవ్ భరద్వాజ్(153.1448మార్కులు), తొమ్మిదో ర్యాంకును పిన్ను శశాంక్ రెడ్డి 152మార్కులు, పదో ర్యాంకును తెలంగాణకు చెందిన ఎం.శ్రీకాంత్ 152.8447మార్కులతో దక్కించుకున్నారు.
ఈఏపీసెట్‌లో బాలికలు 96,659మంది దరఖాస్తు చేశారని, అగ్రికల్చర్ లో 71,643మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో బాలికలే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. ఇంజనీరింగ్ 1,40,521మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగంలో మే 15 నుంచి 19వరకు పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి బొత్స చెప్పారు. ఫార్మసీ, అగ్రికల్చర్‌లో మే 22 నుంచి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 25జోన్లలో 136 పరీక్షా కేంద్రాల్లో సెట్ నిర్వహించినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తు చేసిన వారిలో 94శాతం మంది, 1.71లక్షల మంది అర్హత సాధించినట్లు మంత్రి బొత్స చెప్పారు. ఎంసెట్ ఫలితాల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇచ్చి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.