AP Mega DSC 2024 Update: మెగా డిఎస్సీ 2024 ముహుర్తం ఖరారు, నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు
30 October 2024, 5:49 IST
- AP Mega DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ 2024 ముహుర్తం ఖరారైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. ఇప్పటికే టెట్ పూర్తై ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనుండగా నవంబర్ 6వ తేదీన డిఎస్సీ నోటిఫికేషన్ రానుంది.
నవంబర్ 6న ఏపీ డిఎస్సీ 2024 నోటిఫికేషన్
AP Mega DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సర్కారు తీపి కబురు అందించింది. డిఎస్సీ 2024 నోటిఫికేషన్‌కు ముహుర్తం ఖరారైంది. ఇప్పటికే డిఎస్సీ 2024లో ఎక్కువ మందికి అవకాశం కల్పించేేందుకు రెండోసారి టెట్ పరీక్షల్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. టెట్ తుది కీని ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయనుంది.
మరోవైపు టెట్ ఫలితాలు వెలువరించిన మర్నాడే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం మొదట భావించింది. 3వ తేదీ ఆదివారం కావడంతో నవంబర్ 6వ తేదీన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది.
నవంబరు 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌లో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. డిఎస్సీలో భర్తీ చేసే పోస్టుల రోస్టర్ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీచేశారు. నోటిఫికేషన్ వెలువడిన మూడు నుంచి నాలుగు నెలల్లో డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ఏడాది వేసవి నాటికి కొత్త టీచర్లకు శిక్షణ పూర్తిచేసి, వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే సమయానికి వారికి పాఠశాలల్లో బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. కొత్త టీచర్లు వస్తే ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయ సూళ్ల ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. ఏపీలో దాదాపు 12వేల పాఠశాలలు ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. టీచర్ సెలవు పెడితే ఆ రోజు బడి మూసేయాల్సి వస్తోంది. కొత్త డీఎస్సీలో పాఠశాలలకు రెండో టీచర్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత కూడా తీరుతుంది.
టెట్ తుది ‘కీ’ విడుదల
ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల(టెట్) తుది ‘కీ’ని విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు మంగళవారం తెలిపారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ విడుదల చేశారు. నవంబరు 2న టెట్ ఫలితాలు విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఏపీలో ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షలకు 3,68,661 మంది హాజరయ్యారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబరు మొదటి వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 3వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వాలని భావించారు. ఆ రోజు ఆదివారం కావడంతో ముఖ్యమైన నాయకులు అందుబాటులో ఉంటారో లేదోననే సందేహంతో మరో తేదీలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు.
మరోవైపు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత న్యాయ వివాదాలు సృష్టించే అవకాశాలు ఉంటాయని భావించిన ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ వర్గాలను ఆదేశించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్‌లోగా నియామకాలను భర్తీ చేస్తామని ప్రకటించినా టెట్ నిర్వహణతో పరీక్షలు, నోటిఫికేషన్ ఆలస్యమైంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మెగా డిఎస్పీలో ఎలాంటి న్యాయవివాదాలకు తావివ్వకుండా చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఇప్పటికే ఆదేశించారు.
పోస్టుల వివరాలు…
తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.