తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Crime News : ప్రేమ పెళ్లికి పెద్ద‌లు నిరాక‌ర‌ణ‌...! రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

Guntur Crime News : ప్రేమ పెళ్లికి పెద్ద‌లు నిరాక‌ర‌ణ‌...! రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

18 October 2024, 21:15 IST

google News
    • గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్ద‌లు నిరాక‌రించటంతో..రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెద‌కాకాని పోలీసులు మృత దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ జంట ఆత్మహత్య
ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమ జంట ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో విషాద‌కమైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్ద‌లు నిరాక‌రించ‌డంతో ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పెదకాకాని గ్రామానికి చెందిన దాన‌బోయిన మహేశ్ (22), నందిగామ మండలం రుద్రవరానికి చెందిన నండ్రు శైలజ (21) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా చదివిన మహేశ్‌.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్‌ స్టోర్‌లో పని చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

ఇటీవలే ప్రేమ విషయం ఇద్ద‌రు త‌మ కుటుంబాలకు తెలియ‌జేశారు. ప‌ది రోజుల క్రితం యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దసరా సమయంలో శైలజ‌, మహేశ్‌ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పెదకాకాని గ్రామంలోని భ్ర‌మ‌రాంబ కాల‌నీ అండ‌ర్ రైల్వే బ్రిడ్జి రైల్వే ట్రాక్‌పై విగత జీవులుగా కనిపించారు.

ఇద్ద‌రు మృత‌దేహాల‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు న‌మోదు చేశారు. అనంత‌రం స్థానిక పెద‌కాకాని పోలీస్ స్టేష‌న్‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో పెద‌కాకాని పోలీసులు మృత దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దానబోయిన మహేశ్‌(22), నండ్రు శైలజ(21)ను మృతులుగా గుర్తించారు.

అనంత‌రం ఇద్ద‌రి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. దీంతో కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి చేరుకుని రోధించారు. అయ్యారు. త‌ల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోద‌న‌లు మిన్నంటాయి. బంధువులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. ఈ ఘ‌న‌ట‌తో ఇటు పెదకాకానిలోనూ అటు రుద్రవ‌రంలోనూ విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతుడు దాన‌బోయిన మ‌హేష్ పెద‌కాకాని మండ‌ల టీడీపీ సీనియ‌ర్ నేత దాన‌బోయిన‌ బాప‌య్య చిన్న మ‌న‌వుడు. ఇద్ద‌రిది వేర్వేరు కులం వ‌ల్లే వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేద‌ని తెలిసింది.

బాలిక‌పై లైంగిక వేధింపులు:

అనంత‌పురం జిల్లాలో ఘోర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. బాలిక‌పై ఒక యువ‌కుడు వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. వ‌ద్ద‌ని చెప్పిన ఇద్ద‌రిపై సదరు యువ‌కుడు కొడ‌వ‌లితో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న అనంతపురం జిల్లాలోని గార్ల‌దిన్నె మండ‌లంలోని ఒక గ్రామంలోని గురువారం చోటు చేసుకుంది.

గార్ల‌దిన్నె మండ‌ల కేంద్రంలోని ఏపీ మోడ‌ల్ స్కూల్‌లో ఇదే మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవత్స‌రం చ‌దువుతోంది. అయితే ఆ బాలిక‌తో మర్తాడుకు చెందిన గౌస్‌పీరా ప‌రిచ‌యం పెంచుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఆ బాలిక‌పై వేధింపుల‌కు దిగాడు. కొంత‌కాలంగా మ‌రింత‌గా వేధింపులకు పాల్ప‌డుతున్నాడు.

అయితే అందుకు బాలిక అంగీక‌రించ‌లేదు. తాను పెళ్లి చేసుకోలేన‌ని, చ‌దువుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది గౌస్‌పీరాకు మరో అమ్మాయితో కుటుంబ స‌భ్యులు పెళ్లి చేశారు. అనంత‌పురం శివారులోని టమోట మార్కెట్‌లో గౌస్‌పీరా ప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవ‌లి త‌న‌ను పెళ్లి చేసుకుకోవాల‌ని మైన‌ర్ బాలికను వేధిస్తుండేవాడు. ఈ విష‌యాన్ని ఆ బాలిక‌ త‌న కుటుంబ స‌భ్యుల‌కు చెప్పి బాధ‌ప‌డింది.

దీంతో బుధ‌వారం రాత్రి పెద్ద మ‌నుషుల‌ను క‌లుపుకుని బాలిక బంధువులు గౌస్‌పీరాతో మాట్లాడానికి వెళ్లారు. చ‌దువుకుంటున్న బాలిక‌పై వేధింపులు స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు. నీకు పెళ్లి అయింద‌క‌దా, ఇంకా ఆ బాలిక‌ను ఎందుకు వేధిస్తున్నావ‌ని నిల‌దీశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని, ఇలా చేయ‌డం నేర‌మ‌ని పెద్ద మ‌నుషులు మంద‌లించారు. అయితే ఆ స‌మ‌యంలో గౌస్‌పీరా రెచ్చిపోయాడు. త‌న‌కే చెప్ప‌డానికి వ‌స్తారా? అంటూ కొడ‌వ‌లితో దాడికి తెగ‌బ‌డ్డాడు.

ఈ ఘ‌ట‌న‌లో రాజు, బ్ర‌హ్మ‌య్య అనే ఇద్ద‌రు బాలిక కుటుంబ బంధువుల‌కు గాయాల‌య్యాయి. దీంతో వెంట‌నే స్థానికులు ఇద్ద‌రు క్ష‌త‌గాత్రుల‌ను అనంతపురంలోని గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్ప‌టల్ (జీజీహెచ్‌)కు త‌ర‌లించారు. బాలిక కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు గురువారం ఉద‌యం ఎస్ఐ గౌస్ మ‌హ్మ‌ద్ బాషా విచార‌ణ చేప‌ట్టారు. వేధింపులు నిర్ధార‌ణ కావ‌డంతో గౌస్‌పీరాపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం