తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Naralokesh Response: వాట్సప్‌ మెసేజ్‌కు స్పందించిన లోకేష్‌, 25మందికి జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు.. ఏం జరిగిందంటే!

Naralokesh Response: వాట్సప్‌ మెసేజ్‌కు స్పందించిన లోకేష్‌, 25మందికి జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు.. ఏం జరిగిందంటే!

Sarath chandra.B HT Telugu

08 July 2024, 6:00 IST

google News
    • Naralokesh Response: వాట్సప్‌లో ఓ విద్యార్ధి నుంచి వచ్చిన అభ్యర్థనకు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణ స్పందన, 25మంది విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించింది. 
నారాలోకేష్‌ చొరవతొో 25మంది విద్యార్ధులకు  జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు
నారాలోకేష్‌ చొరవతొో 25మంది విద్యార్ధులకు జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు

నారాలోకేష్‌ చొరవతొో 25మంది విద్యార్ధులకు జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు

Naralokesh Response: జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో దివ్యాంగులైన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య వాట్సప్‌లో అందడంతో మంత్రి నారా లోకేష్‌ స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. మంత్రి చూపిన చొరవ ఆ విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి వంటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందగలిగారు.

ఏం జరిగిందంటే…

విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంకు ప్రకారం సత్యదేవ్ కు చెన్నయ్ ఐఐటిలో సీటు రావాల్సి ఉంది. అయితే దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమో విషయంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు ఎప్పటినుంచో చేస్తున్న ఓ పొరపాటు దివ్యాంగ విద్యార్థులను ఇబ్బందుల్లో నెట్టింది.

జెఇఇ అడ్వాన్స్ డ్ పరీక్షలో ర్యాంకు సాధించిన దివ్యాంగుడైన ఓ అభ్యర్థి తనకు ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ అప్ లోడ్ చేసే విషయంలో ఎదురైన సమస్యను వాట్సప్ ద్వారా మంత్రి లోకేష్ కు తెలియజేశారు. వెంటనే స్పందించిన లోకేష్ సంబంధిత విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరించారు.

విజయవాడకు చెందిన సత్యదేవ్ కు తాను సాధించిన ర్యాంకు ప్రకారం జోసా కౌన్సిలింగ్ రౌండ్ -1లో ఐఐటి మద్రాసులో సత్యదేవ్ కు సీటు కేటాయించారు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్ మెమో సర్టిఫికెట్‌ని అప్‌లోడ్ చేయమని అడిగారు. ఏపి ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్ట్ లు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది.

దీని ప్రకారం సత్యదేవ్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షను రాయలేదు. ఇంటర్ పరీక్షలలో A గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాడు. మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్ట్ తో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్ట్ మార్కులు ఉంటాయి. మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికేట్‌లో ఇంటర్మీడియట్ బోర్డు వారు ఎప్పటినుంచో 'E' (EXEMPTION) అని మాత్రమే పేర్కొంటూ జారీచేస్తున్నారు.

ఐఐటీ మద్రాస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విభాగంవారు సత్యదేవ్ మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్ ఎ, మ్యాథ్స్ బిలను ఒకే సబ్జెక్ట్‌గా పరిగణిస్తున్నామని, అందువల్ల ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్‌ పత్రాన్ని అంగీకరించమని సమాచారమిచ్చారు. దీనిపై సత్యదేవ్ ఐఐటి మద్రాసు వారిని సంప్రదించగా, సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్‌లో 'ఇ' స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువను కలిగి ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. విద్యార్థి కెరీర్ మొత్తం ఈ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ పరిస్థితి నుండి బయటపడేయడానికి తనకు సహాయం చేయాలని ఈ ఏడాది జూన్‌ 22వ తేదీన మంత్రి లోకేష్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ చేశారు.

దానికి స్పందించిన లోకేష్ ఐఐటిలో ర్యాంకు సాధించిన దివ్వాంగ విద్యార్థి పృధ్వి సత్యదేవ్, అతని తండ్రి జయరామ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మినహాయింపు పొందిన సెకండ్ లాంగ్వేజ్ లో "E (Exemption)”కి బదులుగా కనీస మార్కులతో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇవ్వాలని బోర్డు అధికారులకు ఆదేశించారు.

మంత్రి ఆదేశాలతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించి “E” స్థానంలో కనిష్టంగా 35మార్కులుగా పేర్కొంటూ.... మార్కులతో కూడిన మెమో జారీచేశారు. ఆ మార్కులతో సర్టిఫికెట్ తీసుకెళ్లిన విద్యార్థికి తాము దీనిని అంగీకరించబోమని, ఏపీ ప్రభుత్వం నుంచి అధికారివక జిఓ కావాలని మెలిక పెట్టారు. ఈ విషయాన్ని పృధ్వీ సత్యదేవ్ మళ్లీ మంత్రి లోకేష్ పేషీకి ఫోన్ ద్వారా తెలియజేశారు.

సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి విద్యార్థుల భవిష్యత్ దెబ్బ తినకూడదని, వెంటనే జిఓ విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. అవసరమైతే చెన్నయ్ ఐఐటి అధికారులతో మాట్లాడాలని సూచించారు. దీంతో అధికారులు ఆగమేఘాలపై జిఓ విడుదల చేశారు. దీంతో పృధ్వీ సత్యదేవ్ కు ఐఐటి మద్రాసులో సీటు లభించింది. ఈ జిఓ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయస్థాయిలో పేరొందిన ఐఐటి, ఎన్ ఐటి, ట్రిపుల్ ఐటి వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో సీట్లు లభించాయి. తన భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేష్ కు పృధ్వీ సత్యదేవ్ తోపాటు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

మెసేజ్ పెట్టిన అర్థగంటలోనే స్పందించారు!

-పృధ్వీ సత్యదేవ్, విజయవాడ

ఐఐటి, మద్రాసు అధికారులు సీటు తిరస్కరించాక ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే లోకేష్ అన్న కు వాట్సాప్ మెసేజ్ పెడితే అర్థగంటలో స్పందించారు.మా సమస్య పరిష్కారం అయ్యేవరకు పేషీ అధికారులు నిరంతరం ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. ఇక సీటుపై ఆశలు వదులుకున్న సమయంలో లోకేష్ సర్ భగవంతుడిలా అండగా నిలిచారు, ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

మాలో కొండంత ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపారు!

-తేజిత చౌదరి, తిరుపతి.

లోకేష్ అన్న చేసిన సాయం మాలాంటి వారిలో కొండంత ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపింది. ఇందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ చేసిన సాయంతో నా లక్ష్యాన్ని సాధించేందుకు మార్గం దొరికింది. సమస్య చెప్పగానే వెంటనే స్పందించి... ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నారు. సార్ చేసిన సాయానికి ఎలా ధ్యాంక్స్ చెప్పాలో నాకు అర్ధం కావడంలేదు. ఐఐటీ గౌహతీలో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుతున్నా. ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ రాసి ప్రజలకు సేవచేద్దామని అనుకుంటున్నాను.

మా భవిష్యత్తుకు బాటలు వేశారు!

-రఘునాథరెడ్డి, కడప.

కౌన్సిలింగ్ అధికారులు కొర్రీ వేశాక ఇక మా భవిష్యత్తు ముగిసిపోయిందని భావించాం. లోకేష్ అన్న దృష్టికి తీసుకెళ్లినపుడు నేనున్నాను, అధైర్య పడొద్దు, సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. నిరంతరం అధికారులతో మాట్లాడి జిఓ విడుదల చేసి మా భవిష్యత్తును కాపాడారు. ప్రస్తుతం నాకు ఎన్ఐటి, కాలికట్ లో సీటు వచ్చింది. ఈ ఆనందంలో నాకు నోట మాటలు రావడం లేదు. లోకేష్ అన్న చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం.

రాజకీయ నేతలపై గౌరవం పెరిగింది!

-స్నేహిత, నెల్లూరు

మంత్రిగా లోకేష్ అన్న పనివిధానం చూశాక రాజకీయ నాయకులపై నాకు గౌరవం పెరిగింది. మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే లోకేష్ అన్న నా జీవితంలో వెలుగులు నింపారు. నాలాంటి ఎందరికో అండగా నిలిచారు. జీవో ఇచ్చారని చెప్పగానే నా ఉన్నత చదవులకు ఇక ఢోకా లేదని నమ్మకం కలిగింది. కౌన్సిలింగ్ లో 3వ రౌండ్ కే నేను సెలక్ట్ అయిపోయాను.

లోకేష్ అన్న చొరవచూపకపోతే మా జీవితం ప్రశ్నార్థకం అయ్యేది!

-జ్యోతి, అనంతపురం

సార్ సాయం చేయకపోతే మా భవిష్యత్ ప్రశ్నార్థకమయ్యేది. లోకేష్ అన్న ఇంత త్వరగా స్పందించి జీవో విడుదల చేస్తారని ఊహించలేకపోయాం. సార్ చొరవచూపకపోతే మాకు ప్రతిష్టాత్మకమైన కాలేజీకి వెళ్లే అవకాశం వచ్చేదికాదు. అన్న చేసిన సాయానికి జీవితాంతం నేను, నా కుటుంబసభ్యులు రుణపడి ఉంటాము. సాఫ్ట్ వేర్ ఇంజనీరీర్ అవ్వాలన్నది నా కల. నన్ను ఇంత దాన్ని చేసిన నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. నా చదువు ద్వారా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్నదే లక్ష్యం.

మా భవిష్యత్తును కాపాడారు!

-పి.నిస్మిత నెల్లూరు

సీటు రాదని ఆశ వదిలేసిన సమయంలో లోకేష్ అన్న జీవో విడుదల చేసి మా భవిష్యత్ ను కాపాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన మా సమస్య పరిష్కరించారు. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుకునే అవకాశం కల్పించారు. మాపై అన్న పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. నాకు ఎన్ ఐటీ నాగపూర్ లో ఇంజనీరింగ్ సీటొచ్చింది. బీటెక్ తర్వాత ఇంకా ఉన్నత చదువులకు వెళతాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే నా లక్ష్యం.

దేవుడిలా ఆదుకున్నారు!

-మోక్షశ్రీ , అనంతపురం

ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత చదువుకి అవకాశం రాదేమోనని డిసైడ్ అయిపోయాం. నారా లోకేష్ అన్న దేవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. పై చదువులకు దారి చూపించారు. ఐఐటీ నాగపూర్ లో కెమికల్ ఇంజనీరింగ్ జాయిన్ కాబోతున్నాను. ఆ తర్వాత ఎంటెక్ చేసి మంచి జాబ్ కొట్టాలన్నదే నా లక్ష్యం. సార్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. బాగా చదువుకుని నా కుటుంబానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాను.

ఏపీ ప్రభుత్వ జిఓతో జాతీయస్థాయిలో సీట్లు సాధించిన విద్యార్థులు..

1. ఎం.పృధ్వీ సత్యదేవ్, విజయవాడ – ఐఐటి, మద్రాస్.

2. ఎన్. స్నేహిత, నెల్లూరు – ఐఐటి, కాన్పూర్.

3. ఎ.తేజిత చౌదరి, తిరుపతి – ఐఐఐటి, గౌహతి.

4. పి.నిష్మిత, నెల్లూరు – ఎన్ఐటి, నాగపూర్.

5. సి.రఘునాథరెడ్డి, విజయవాడ – ఐఐటి, క్యాలికట్.

6. ఎం.మోహన్ నాగమణికంఠ, రాజమండ్రి – ఎన్ఐటి, జలంధర్.

7. బి.విజయరాజు, పామర్రు – ఐఐటి, తిరుపతి.

8. కె.ప్రశాంత్, కర్నూలు – ఎన్ఐటి, సిల్చార్.

10. జి.కృష్ణసాయి సంతోష్, విజయవాడ – ఎన్ఐటి, సూరత్కల్.

11. జి.వంశీకృష్ణ, రాజమండ్రి – ఎన్ఐటి, వరంగల్.

12. వి.వేదచరణ్ రెడ్డి, కర్నూలు – ఐఐటి, మద్రాసు.

13. నాయుడు రక్షిత్, నెల్లూరు – ఎన్ఐటి, నాగాల్యాండ్.

14. ఇ.మహీధర్ రెడ్డి, పెనమలూరు – ఐఐటి, ఇండోర్.

15. డి.మోక్షశ్రీ, అనంతపురం – ఎన్ఐటి, నాగాల్యాండ్.

16. పి.దినేష్, రాజమండ్రి – ఎన్ఐటి, కురుక్షేత్ర.

17. జె.మనోజ్ కుమార్, బి.కోట – ఐఐటి, గోవా.

18. సిహెచ్ శివరామ్, నందిగామ – ఐఐటి, అగర్తల

19. బి.అబిజిత్, విజయవాడ – ఎన్ఐటి, అరుణాచల్ ప్రదేశ్.

20. జి.రాణి, కాకినాడ – ఐఐటి, ఖరగ్ పూర్.

21. కె.గోకుల్ సాయి, గుంటూరు – ఎన్ఐటి, తాడేపల్లిగూడెం.

22. ఎం.అభిలాష్, విజయవాడ – ఐఐటి, తిరుపతి.

23. ఎం.అర్జున్ కుమార్, గుంటూరు – సెకండ్ రౌండ్ కు దరఖాస్తు.

24. ఆర్ఎస్ భరద్వాజ నాయుడు, తాళ్లవలస – ఎన్ఐటి, సిల్చార్.

25. జి.రేష్మిత, ఎనికేపాడు – ఐఐటి, తిరుపతి.

తదుపరి వ్యాసం