Leopards Death: సత్యసాయి జిల్లాలో చిరుతల మృత్యువాత
18 August 2023, 9:36 IST
- Leopards Death: శ్రీసత్యసాయి జిల్లాలో చిరుతల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒకే ప్రాంతంలో రెండు చిరుత కళేబరాలు దర్శనమివ్వడం మిస్టరీగా మారింది.
మడకశిరలో చనిపోయిన చిరుత
Leopards Death: శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతల వరుస మరణాలు కలకలంరేపాయి. బుధవారం ఆడ చిరుత కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. గురువారం సమీపంలోనే మరో మగ చిరుత ప్రాణాలు కోల్పోయి కనిపించింది. రెండు ఒకే సమయంలో చనిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. మడకశిర మండలం మెళవాయి గ్రామ సమీపంలోని కాకులకొండ వద్ద రెండు చిరుత మృతదేహాలను స్థానికులు గుర్తించారు.
చనిపోయిన చిరుతల్ని జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రరెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు. చిరుతలు చనిపోయిన ప్రాంతంలోనే మేక కళేబరం కనిపించడంతో దాని నుంచి కూడా శాంపిళ్లను సేకరించారు. రెండు చిరుత కళేబరాలకు స్థానిక అటవీశాఖ కార్యాలయంలో పంచనామా నిర్వహించారు. రెండు చిరుతలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయని, పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత వాటి మృతికి కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు.
బుధవారం ఆడ చిరుత కళేబరం కనిపించిన ప్రదేశంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గురువారం అటవీశాఖ అధికారులు కొండలోని గుంతలో పరిశీలిస్తుండగా అక్కడ మగ చిరుత కళేబరాన్ని గుర్తించారు. దీంతో విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.
చిరుతల మృతి చెందిన సమయంలో మల, మూత్ర విసర్జన చేసినట్లు గుర్తించారు. సమీపంలో ఏదో ద్రవ పదార్థం ఉందన్న అనుమానంతో నమూనాలను సేకరించారు. చిరుత కళేబరాన్ని మడకశిర అటవీశాఖ కార్యాలయానికి తీసుకువచ్చారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ బుధ, గురువారాల్లో లభించిన ఆడ, మగ చిరుతలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కళేబరాలను కాల్చి వేశారు.
చనిపోయిన చిరుతల వయసు రెండేళ్లు ఉంటుందని చిరుతల తల్లి కూడా కొండ ప్రాంతంలో ఉండవచ్చని డిఎఫ్‌ఓ అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ద్వారా సేకరించిన నమూనాలను తిరుపతి, విజయవాడ, బెంగళూరు ల్యాబ్‌లకు పంపుతున్నట్లు చెప్పారు. రెండు చిరుతలకు ఎలాంటి గాయాలు లేవని, రెండూ ఒకే కారణంతో మృతి చెంది ఉంటాయని వెటర్నరీ ఏడీ తెలిపారు. విష ప్రయోగం లేదా విషాహారం తినడం, ఏదై వ్యాధి సోకి మృతి చెందాయా అనేది పరీక్షల్లో తేలుతుందని చెప్పారు. చిరుత కూనల్ని కోల్పోయిన తల్లి ఆవేశంగా ఉంటుందని స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.