KVP On Sharmila: త్వరలో కాంగ్రెస్‌లోకి షర్మిల.. కేవీపీ కామెంట్స్
03 July 2023, 7:18 IST
- KVP On Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కేవీపీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటన సందర్భంగా విజయవాడ విమానాశ్రయంలో కేవీపీ ఈ కామెంట్స్ చేశారు.
కేవీపీ రామచంద్రరావు
KVP On Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే సమాచారం తమకు ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వెల్లడించారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను షర్మిల నిర్వర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు.
గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి వీడ్కోలు పలికేందుకు వచ్చిన కేవీపీ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ''కాంగ్రెస్ వాదిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం రాహుల్‌గాంధీకి స్థానిక పరిస్థితులను వివరిస్తామని కేవీపీ చెప్పారు. 2024 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
2018లో తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు వల్ల కాంగ్రెస్ నష్టపోయిందన్నారు. ఏపీలో పార్టీని ఇటుక ఇటుక పేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి చేయకుండా వైసీపీ, టీడీపీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయాలను ప్రజలు గుర్తిస్తున్నారని కేవీపీ పేర్కొన్నారు.
వైసీపీ, బీజేపీ సంబంధాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు సహా, వైఎస్ షర్మిల అంశంపై కూడా కాంగ్రెస్ నేతల మధ్య చర్చజరిగినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేవీపీ.. షర్మిల చేరిక సహా ఇతర రాజకీయ అంశాలపై ఈ కామెంట్స్ చేశారు.
ఏపీలో పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ సూచనలను అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేవీపీ. మరోవైపు ఏపీలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ నిర్వహించే సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని ఏపీ కాంగ్రెస్ నేతలు తెలిపారు.
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతారని ఇటీవల విస్తృత ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత షర్మిల కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డికె.శివకుమార్‌తో భేటీ అయ్యారు. దీంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం మొదలైంది. దీనిని షర్మిల మొదట్లో తోసిపుచ్చినా ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు.తాజాగా కేవీపీ వ్యాఖ్యలతో షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఊహాగానాలు మొదలయ్యాయి.