NIA Court CaseShifting: విశాఖకు మారిన కోడికత్తి కేసు దర్యాప్తు..
02 August 2023, 10:04 IST
- NIA Court Case Shifting: విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తితో దాడి కేసు దర్యాప్తును విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నంకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త కోర్టు ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోడికత్తి కేసు
NIA Court Case Shifting: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తితో దాడి కేసు దర్యాప్తు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నంకు బదిలీ అయ్యింది. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌పై దాడి జరిగింది. ఇప్పటివరకు విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారిస్తున్న కోడికత్తి కేసును విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి ఎ.సత్యానంద్ కేసు విచారణలో భాగంగా ప్రకటించారు.
సిఎం జగన్ తరపున న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన రెండు పిటిషన్లలో ఒకదానిపై ఇప్పటికే తీర్పు వచ్చింది. కోర్టు హాజరునుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్ కమిషన్‌ను నియమించడం గానీ, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారించాలని రెండో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌తో పాటు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పైనా మంగళవారం విచారణ జరగాల్సి ఉంది.
మంగళవారం జరిగిన విచారణకు జగన్ తరపున న్యాయవాదులు హాజరు కాలేదు. నిందితుడికి బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అతడి తరపున న్యాయవాది అబ్దుల్ సలీం కోరడంతో, కేసు బదిలీ విషయాన్ని న్యాయమూర్తి సత్యానంద్ ప్రకటించారు. మరోవైపు నిందితుని బెయిల్ పిటిషన్‌పై ఎన్‌ఐఏ కౌంటరు దాఖలుచేసింది.
కోడికత్తి కేసు ట్రయల్‌కు వచ్చిన ప్రస్తుత దశలో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది విశాల్ గౌతమ్ వాదించారు. బెయిల్‌పై విడుదలయితే నిందితుడు పరారయ్యే అవకాశం ఉందని వాదించారు. కోర్టు విచారణ నుంచి మినహాయింపును కోరుతూ జగన్ వేసిన పిటిషన్‌పై నిందితుని తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం కౌంటరు వేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్ పిటిషన్‌ను అనుమతించరాదని వాదించారు.
జగన్‌పై దాడికి సంబంధించిన కోడికత్తి కేసు విశాఖకు బదిలీ కానున్న నేపథ్యంలో విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్టేనని చెబుతున్నారు. ప్రస్తుతం విచారణ ఎంతవరకు సాగిందో, ఆ తర్వాత నుంచి కొత్త కోర్టులో జరుగుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. విచారణను జాప్యం చేయడానికి సిఎం జగన్ నాలుగేళ్ల తర్వాత రెండు పిటిషన్లను దాఖలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు కుటుంబం ఆరోపిస్తోంది.
మరోవైపు దాడి కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని, కుట్ర కోణాన్ని బయటకు తీయాలని దాఖలైన పిటిషన్‌నున కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని, లోతైనన దర్యాప్తు అవసరం లేదని ఎన్‌ఐఏ కోర్టు కొద్దిరోజుల క్రితం తీర్పును ఇచ్చింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో ఈనెల ఎనిమిదో తేదీన జరిగే విచారణ చివరిది కానుంది.
న్యాయవాదుల అభ్యర్థనతోనే కొత్త కోర్టు ఏర్పాటు…
రాష్ట్ర విభజన జరిగిన రాజధాని ప్రాంతంగా విజయవాడలో ఎన్‌ఐఏ కోర్టును కేంద్రం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసుల విచారణ ఇక్కడే సాగుతోంది. రాష్ట్రం మొత్తానికి ఒకటే కోర్టు ఉన్నందున ఇబ్బందులు వస్తున్నాయని, కొత్తగా మరో కోర్టును మంజూరు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కేంద్ర న్యాయశాఖను అభ్యర్థించారు.
న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం విశాఖపట్నం కేంద్రంగా రెండో ఎన్‌ఐఏ కోర్టును ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి జూలై 24న కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నంలోని మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టును ఎన్‌ఐఏ కేసుల విచారణకు డిజిగ్నేటెడ్ కోర్టుగా ఎంపిక చేశారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు ఎన్‌ఐఏ కేసులు ఈ కోర్టు పరిధిలో ఉంటాయి. కృష్ణా జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు పరిధిలో ఉంటాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో నమోదైన ఎన్‌ఐఏ కేసులను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు విశాఖపట్నం బదిలీ చేస్తోంది.