Guntur Acid Attack: దూరం పెట్టాడని ప్రియుడిపై యాసిడ్‌తో దాడి చేసిన మహిళ
04 October 2023, 13:34 IST
- Guntur Acid Attack: వివాహేతర సంబంధం నేపథ్యంలో తనను దూరం పెట్టాడనే కోపంతో ఓ మహిళ, యువకుడిపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన గుంటూరులో జరిగింది. కాలిన గాయాలతో యువకుడు ఆస్పత్రిలో చేరాడు.
ప్రియుడిపై యాసిడ్‌తో దాడి చేసిన మహిళ
Guntur Acid Attack: సహ జీవనం చేస్తున్న యువకుడితో వివాదాలు తలెత్తడంతో యువకుడిపై మహిళ యాసిడ్ దాడికి పాల్పడింది. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఓర్సు వెంకటేష్ ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. గుంటూరు నగరంలో పలు ప్రాంతాలకు ఆటోలో మంచినీటి క్యాన్లను చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో నగరంలోని రామిరెడ్డితోటలో ఉండే రాధ అనే వివాహితతో పరిచయం ఏర్పడింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరాకు చెందిన రాధతో భర్త విడిచి పెట్టడంతో గుంటూరులో ఉంటోంది. స్థానికంగా ఉన్న ఇళ్లలో ఇంటి పని చేస్తుంటుంది. మూడు నెలల క్రితం వెంకటేష్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. కొన్నాళ్లుగా ఇద్దరు కలిసి అక్కడే ఉంటున్నారు.
ఆమెతో కలిసి ఉండటం నచ్చని యువకుడి కుటుంబ సభ్యులు రాధపై దాడి చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో వెంకటేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కొట్టి గాయపర్చారంటూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వెంకటేష్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదయింది.
తనను ఇంటి నుంచి బయటకు గెంటేశారని కక్ష పెంచుకున్న రాధ మంగళవారం మరో ముగ్గురు యువకులతో కలిసి ఆటోలో వెళ్లి అతనిపై దాడికి పాల్పడింది. ఓ ప్రాంతంలో తాగునీటి క్యాన్లు దించుతున్న వెంకటేష్‌పై వెనుక నుంచి యాసిడ్ పోసింది. బాధితుడు కేకలు వేయటంతో స్థానికులు బాధితుడిని జీజీహెచ్‌కు తరలించారు.
దాడికి పాల్పడిన నిందితురాలు రాధ వచ్చిన ఆటోలోనే పరారైంది. చికిత్స పొందుతున్న బాధితుడికి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిందని బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలైన మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు.