Kadapa Crime : కడపలో మరో దారుణ హత్య- అప్పు చెల్లించడంలేదని కత్తితో దాడి, ఆపై ఆసుపత్రికి!
13 November 2023, 13:41 IST
- Kadapa Crime : కడపలో మరో దారుణ హత్య జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలేదని సాయి కిరణ్ అనే వ్యక్తిని మహేశ్ కత్తితో పొడిచాడు. అనంతరం తన వెహికల్ లోనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
కడపలో దారుణ హత్య
Kadapa Crime : కడపలో రెండ్రోజుల్లో రెండు హత్యలు జరిగాయి. వివాహేతర సంబంధంతో వాలంటీర్ ను ఓ వ్యక్తి హత్య చేయగా, తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. కడప ఓల్డ్ బైపాస్ వద్ద ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించలేదని సాయికిరణ్ అనే వ్యక్తిని కడపకు చెందిన మహేశ్ హత్య చేశాడు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన సాయికిరణ్ కడప పట్టణంలోని ఓ షోరూంలో పనిచేస్తున్నాడు. కడపకు చెందిన మహేశ్ నుంచి సాయి కిరణ్ రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే డబ్బు తిరిగి చెల్లించాలని కోరడంతో సాయి కిరణ్, మహేశ్ మధ్య ఆదివారం రాత్రి ఘర్షణ తలెత్తింది. దీంతో మహేశ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో సాయికిరణ్‌పై దాడి చేశాడు. అనంతరం మహేశ్...సాయికిరణ్ ను తన వాహనంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అయితే సాయి కిరణ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆ తర్వాత నిందితుడు మహేశ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై చిన్న చౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కడపలో వాలంటీర్ దారుణ హత్య
కడప పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వాలంటీర్ ను అతడి స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. కడపలోని ఎల్ఐసీ ఆఫీస్ లో వాలంటీర్ భవానీ శంకర్ ను అతడి స్నేహితుడు శనివారం దారుణంగా హత్య చేశారు. కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని 14వ డివిజన్‌లో భవానీ శంకర్ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. వాలంటీర్ గా పనిచేస్తు్న్న భవానీ శంకర్ ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయంలో డిజిటలైజేషన్ విభాగంలోనూ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే ఆఫీసులో పనిచేస్తున్న మల్లికార్జున్, భవానీ శంకర్ మంచి మిత్రులు. అయితే ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.
పథకం ప్రకారం హత్య
దీంతో భవానీ శంకర్‌ను అడ్డు తప్పించుకోవాలని మల్లికార్జున్ ఫ్లాన్ వేశాడు. శనివారం ఉదయం భవానీ శంకర్‌కు ఫోన్ చేసిన మల్లికార్జున్ ఎల్‌ఐసీ ఆఫీసుకు రావాలని కోరాడు. అక్కడికి భవానీ శంకర్ రాగానే మల్లికార్జున్ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. భవానీ శంకర్ కు మెడపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మల్లికార్జున్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న కడప పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందుతుడు మల్లికార్జున్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.