Janga Krishna Murthy: జగన్ ఒంటెత్తు పోకడలు… ఒక సామాజికవర్గానికే వైసీపీలో పదవులని ఆరోపించిన జంగా కృష్ణ మూర్తి
12 February 2024, 13:38 IST
- Janga Krishna Murthy: పవర్ లేని పదవులిచ్చి సామాజిక న్యాయం అంటే ఎలా అని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఐదేళ్లలో కార్పొరేషన్ ఛైర్మన్లు జగన్ ను కలిసింది లేదని ఆరోపించారు.
వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
Janga Krishna Murthy: ఏపీలో జగన్ ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళ్తున్నారని, తన గెలుపుకోసం పని చేసిన వారిని జగన్ పక్కన బెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు.
జంగా విడుదల చేసిన వీడియోలో ఏం మాట్లాడారంటే....వైసీపీ గెలుపుకోసం, పార్టీ బలోపేతం కోసం వివిధ స్థాయిల్లో పనిచేశానని, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్ గెలుపులో భాగమయ్యానని,. కానీ నేడు జగన్ ఒంటెత్తు పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు.
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని జగన్ అంటున్నారే తప్ప వారి మనోగతాలను అస్సలు అర్థం చేసుకోవడం లేదన్నారు. తాత్కాలికమైన పదవులు పంచి, సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది, ఆ వర్గాలు అభివృద్ధి చెందాయని చెప్తున్నారని ఆరోపించారు.
జగన్ మాట్లాడే సామాజిక న్యాయంలో వాస్తవం లేదని నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగానే జగన్ చెప్పే సామాజిక న్యాయం ఉందన్నారు. 130 బీసీ కులాలు జగన్ ను నమ్మి కష్టపడ్డాయని వారికి పవర్ లేని పదవులిచ్చారని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే కనీసం ఛైర్మన్లను జగన్ ఇప్పటికి కలిసింది లేదన్నారు.
కార్పోరేషన్లకు నిధులు కూడా కేటాయించ లేదని పేద విద్యార్థులకు ఉపయోగపడే విదేశీ విద్యను నిలిపేశారని, సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛా, సమానత్వం, ఆత్మగౌరవం ఉండాలి..ఇవి ఉంటేనే ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉంటాయని కానీ వైసీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కనీస గౌరవం లేదన్నారు.
ఏపీ రాజధాని లేని రాష్ట్రం అయిందని వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారని ఆశించిన స్థాయిలో బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నారు. ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అవమానాలకు గురవుతున్నారు.
యూనివర్సిటీ వీసీలు, సలహాదారులు, టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవులు ఎవరి చేతుల్లో ఉన్నాయని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీలు వైసీపీకి దూరమవుతున్నారంటే అధిష్టానం పునరాలోచించాలననారు. స్థానికంగా నామినేటెడ్ పదవులున్న వారిని గౌరవిస్తున్నారా...ప్రోటోకాల్ పాటిస్తున్నారా అని జంగా నిలదీశారు.
బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు 50 శాతం పనులు ఇస్తామన్నారని..ఒక్క పనైనా ఇచ్చారా అన్నారు. వైసీపీలో ఆత్మగౌరవ పోరాటం చేయాల్సి వస్తుందని వైసీపీలో ప్రధాన పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే ఇచ్చుకుని...వారే అనుభవిస్తున్నారు.’’ అని జంగా కృష్ణామూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలకు తాత్కలిక పదవులిచ్చారు కానీ వాటికి పవర్ లేదు. పవర్ అంతా కేవలం కొంది మంది దగ్గరే పెట్టుకున్నారని, వైసీపీలో బీసీలు అవమానాలకు గురౌతున్నారన్నారు. ఎంతోమంది బీసీ నాయకులు వైకాపాకు దూరం అవుతున్నారని, వైకాపాలో బీసీలకు సరైన గౌరవం లేదు, స్వేచ్ఛ లేదు. పవర్ లేదని ఆరోపించారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు వైసీపీలో సరైన న్యాయం జరగలేదన్నారు.
సామాజిక న్యాయం ఏ ఒక్కరికీ కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా పోయిందని, రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్న పరిస్థితి ఏర్పడిందని, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు సరైన గౌరవం ఇస్తున్నారా వైకాపాలో అని ప్రశ్నించారు.