తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena : రేపు కడపలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర…..

Janasena : రేపు కడపలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర…..

B.S.Chandra HT Telugu

19 August 2022, 18:15 IST

google News
    • ముఖ్యమంత్రి మొండి వైఖరితో తీసుకువచ్చిన కొత్త కౌలు సాగు చట్టమే కౌలు రైతుల ఉసురు తీసిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. భూ యజమానుల అనుమతి ఉంటేనే లోన్లు, భూ యజమానుల అనుమతి ఉంటేనే గుర్తింపు అంటూ చేసిన మోసపూరిత చట్టం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కని పరిస్థితుల్లో కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాలను ఆదుకుని, రాష్ట్ర రైతాంగానికి భరోసా నింపడమే లక్ష్యంగా, వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కౌలు రైతు భరోసా యాత్ర తీసుకువచ్చారన్నారు.
కడపలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాదెండ్ల మనోహర్
కడపలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాదెండ్ల మనోహర్

కడపలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాదెండ్ల మనోహర్

"ఈ నెల 20వ తేదీన ఉమ్మడి కడప జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ రానున్నాను. ఉదయం 12 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా సిద్ధవటంలోని సభా ప్రాంగణానికి చేరుకుని జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన 176 కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేస్తారు. రైతాంగానికి అండగా నిలబడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇప్పటికే అనంతపురం, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలోనూ పూర్తయ్యింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మొదటి విడత కార్యక్రమం పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలో మరో రెండు విడతలు కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సొంత నిధుల నుంచి పవన్ కళ్యాణ్ గారు రూ. 5 కోట్లు ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులతో సహా ఎంతో మంది ఈ కార్యక్రమానికి తమవంతు సాయం అందించారు.

పాలన అద్భుతంగా ఉంటే రైతులు ఎందుకు చనిపోతున్నారు…

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బటన్లు నొక్కి అద్భుతంగా సంక్షేమం అందిస్తున్నామని చెబుతున్నారు. వైసీపీ పాలన అంత అద్భుతంగా ఉంటే అంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రూ. 6,300 కోట్లు ఖర్చు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క కేంద్రంలో అయినా మార్కెటింగ్ సౌకర్యాలు ఉన్నాయా? ఒక్క రైతుకు అయినా ఎరువులు, విత్తనాలు ఇస్తున్నారా? రైతు భరోసా కేంద్రాలు ఉత్తి బూటకమని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

ఏ మాత్రం పారదర్శకత లేని పనితీరుతో రైతులకు లాభం చేకూర్చకపోగా వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టేస్తున్నాయన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 176 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏ మాత్రం భరోసా లేని పరిస్థితులలో 46 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే, వ్యవసాయంలో వచ్చిన నష్టాలు వారిని ఏ స్థాయిలో బాధించాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. అప్పుల వాళ్లు వెంట పడుతుంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడిన దుస్థితి ఉందన్నారు. రైతుల్ని కులాల వారీగా విడగొట్టి ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అందరికీ రాకుండా చేశారని, ముఖ్యమంత్రి పనితీరు ఏంటో ఎవ్వరికీ అర్ధం కావడం లేదన్నారు.

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే రైతు భరోసా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే రైతుల్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలో శనివారం 176 మంది రైతు కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయంతో పాటు వారి బిడ్డలను చదివించే బాధ్యత స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లేందుకు జిల్లా నాయకత్వంతో కలసి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతాంగానికి చక్కటి భవిష్యత్తు, భరోసా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం అవసరమన్నారు. నిజాయితీగా రాష్ట్ర ప్రజల్ని కాపాడాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు.

టాపిక్

తదుపరి వ్యాసం