Janasena Meeting : సబ్‌ప్లాన్‌కు కేటాయింపులు తప్ప ఖర్చు చేయట్లేదు… పవన్ కళ్యాణ‌్
26 January 2023, 7:20 IST
- Janasena Meeting ఏపీలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయింపులు తప్ప ఖర్చు మాత్రం చేయట్లేదని జనసేన ఆరోపించింది. వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా నిధులను దారి మళ్ళిస్తోందని నేతలు ఆరోపించారు. నిధుల వినియోగంపై ఆడిట్ లేదు, నోడల్ ఏజెన్సీల జాడే లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకం తరహాలో ఉపయోగపడాల్సి ఉన్నా అలా జరగడం లేదని ఆరోపించారు. జనసేన కేంద్ర కార్యాలయంలో సబ్ ప్లాన్ అమలుపై నిర్వహించిన సదస్సుల్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ పాల్గన్నారు. చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సబ్ ప్లాన్‌పై జరిగిన చర్చలో పవన్ కళ్యాణ్
Janasena Meetingదేశంలోనే దళితులు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం తీసుకువచ్చిన అద్భుతమైన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని జనసేన పార్టీ ఆరోపించింది. ఉప ప్రణాళిక నిధుల కేటాయింపులను కాగితాల్లోనే చూపించి, వ్యయాన్ని మాత్రం వేరే ఖర్చులకు పెడుతూ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు- వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై రాష్ట్ర స్థాయి సదస్సును పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
దళిత మేధావులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాల నేతలు నిధుల కేటాయింపులపై జరిగిన అన్యాయంపై మాట్లాడారు. దళిత వాడలు, గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు కనిపించని దుస్థితి నెలకొందని, కనీస రోడ్లు, మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేవని, ఏదైనా రోగం వస్తే గిరిజన గ్రామాల్లోని ప్రజలు ఈ నాటికి డోలి కట్టి ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
సబ్ ప్లాన్‌కు కేటాయించే నిధులు ఎటు వెళ్తున్నాయని, ఖర్చు చేస్తే ఎక్కడ ఖర్చు అవుతున్నాయో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. దళితులపై ప్రభుత్వాలకు వివక్ష అన్న విషయాలు చర్చకు రావాల్సి ఉందన్నారు. నామమాత్రంగా మాత్రమే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయడం వల్ల ఒరిగేది ఏమి ఉండదని, కుల వివక్ష, అంటరానితనం ఇప్పటికీ చాలా గ్రామాల్లో కనిపిస్తున్నాయని, ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా ఇంకా వెనుకబాటులోనే ఉన్నారని అభిప్రాయపడ్డారు.
దళితులు నివసించే ప్రాంతాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాలు కనీస సౌకర్యాలు కానరాని పరిస్థితి రాష్టంలో ఉందని, వీటన్నిటికీ కచ్చితంగా ఫుల్ స్టాప్ పడాలంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం బలంగా అమలు జరగాలని డిమాండ్ చేశారు. యువతరం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంలో ఏముందో, ఎందుకు ప్రభుత్వాలు అమలు చేయడం లేదో.. వీటి వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశంలో ఆకలితో ఉన్న పేదలకు పని చూపించి ఉపాధి బతుకును ఇచ్చిన ఉపాధి హామీ పథకం తరహాలో 2013లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కూడా దళితులు, గిరిజనుల అభ్యున్నతికి అలాగే ఉపయోగపడాలని అకాంక్ష వ్యక్తం చేశారు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు భారీ కేటాయింపులు చేసినట్లు చెబుతున్న వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా వేరే పథకాలకు మళ్ళిస్తోందని, ఏ దళితవాడ అభివృద్ధికీ వాటిని కేటాయించడం లేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలోనూ వివక్ష చూపిస్తోందని జనసేన నేతలు ఆరోపించారు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంలో కీలకమైన అంశంగా నిధుల కేటాయింపు, ఖర్చులు, అభివృద్ధిపై పూర్తిస్థాయిలో నిబంధనలు ఉన్నాయని, ఉపాధి హామీ పథకం తరహాలో ప్రత్యేకమైన ఆడిట్, నోడల్ ఏజెన్సీలు చట్టం అమలను పర్యవేక్షించాల్సి ఉందన్నారు. నిధులు కేటాయింపును అలాగే పనుల కేటాయింపులను చూడాలని, దీనికోసం ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలని చట్టంలో ఉన్నా ఎక్కడా ఏజెన్సీలు లేవన్నారు.
టాపిక్