Janasena : పర్యావరణం మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఎందుకు… పవన్ కళ్యాణ్
29 August 2022, 9:48 IST
- ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, ప్రభుత్వానికి సడెన్ గా పర్యావరణంపై ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చిందంటూ Janasena అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధించారు.
ఫ్లెక్సీల నిషేధంపై పవన్ సెటైర్లు
ఏపీలో ఫ్లెక్సీల వినియోగాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రభుత్వాన్నే నిలదీశారు. వైజాగ్ పరిశ్రమల కాలుష్యం, విషవాయువు లికేజీ, ఇలాంటి అంశాల్లో మందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ఘటనకు బాధ్యులైనవారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, రిషికొండను ధ్వంసం చేసినా పట్టించుకోలేదని సడెన్ గా పర్యావరణంపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వరుస ట్వీట్లు చేశారు. మరికొన్ని ట్వీట్లలో జగన్ ప్రభుత్వానికి సూచనలు కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా పర్యావరణంపై ప్రేమే ఉంటే, కాలుష్యాన్ని వెదజల్లుతూ, జలవనరులను, పంటపొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న పరిశ్రమల వివరాలు సేకరించాలని సూచించారు. అడవుల్లో కూడా పచ్చదనాన్ని నాశనం చేస్తూ, అక్కడి సంపదను దోచేస్తున్నా మైనింగ్ సంస్థల వివరాలతో పాటు అడ్డగోలుగా కొండలు తవ్వుతూ, చ్చదనాన్ని హరిస్తున్న ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా రికార్డు చేద్దామంటూ janasena అధ్యక్షుడు ట్వీట్ చేశారు.
ప్రభుత్వ పరిధిలోని కాలుష్య కారక ప్రాజెక్టులు, వాటి వల్ల ప్రజల ఆరోగ్యాలకు ఎంత నష్టం కలుగుతుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాంటి పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు దశలో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వ బలగాలతో ఏవిధంగా ఆందోళనలను అణచివేస్తున్నారన్న విషయం బయటపెట్టే సమయం వచ్చిందన్నారు.
ఆకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల వద్ద ఈ వివరాలు ఉన్నాయో, లేదోనని అసలు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ వివరాలు పొందుపరిచిందా అని ప్రశ్నించారు. మన వంతు బాధ్యతగా అన్ని వివరాలు బయట పెడదామని, జనసేన సిద్ధాంతల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షణపై పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్రంలోని కాలుష్య కారక పరిశ్రమలు, మైనింగ్ సంస్థలు వాటి మూలంగా ఎలాంటి హాని జరుగుతుందో ప్రజాక్షేత్రంలో వెల్లడిద్దాం అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సమీపిస్తుండటంతోనే వారిని అడ్డుకోడానికే ఫ్లెక్సీలపై నిషేధం విధించారని టీడీపీ ఆరోపిస్తోంది.
టాపిక్