తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కర్నూలులో పవన్‌ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర

కర్నూలులో పవన్‌ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర

HT Telugu Desk HT Telugu

08 May 2022, 12:32 IST

google News
    • ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, ఆర్ధిక సాయం చేసేందుకు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర కర్నూలు జిల్లా చేరుకుంది. ఇప్పటికే అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించిన పవన్ ఆదివారం ఉమ్మడి కర్నూలులో పర్యటిస్తున్నారు.
కర్నూలులో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
కర్నూలులో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

కర్నూలులో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమం కోసం ఆళ్లగడ్డ నియోజకవర్గం, శిరివెళ్ళ గ్రామానికి బయలుదేరారు. వెళ్లే దారిలో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరపున రూ. లక్ష ఆర్ధిక సాయం అందచేశారు.

రైతు భరోసా యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు మేకల నాగ సుబ్బారాయుడు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అతని భార్య శ్రీమతి భూలక్ష్మిని ఓదార్చారు. సుబ్బారాయుడు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఆత్మహత్య అనంతరం ప్రభుత్వ స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున రూ. లక్ష చెక్కును ఆమెకు ఆర్ధిక సాయంగా అందించారు. వారి బిడ్డల భవిష్యత్తుకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తన భర్త మృతి చెందిన ఈ రెండేళ్లలో ప్రభుత్వ సాయం కోసం సుమారు వందల సార్లు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం దక్కలేదని వాపోయారు.

కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్‌కు కి విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, కర్నూలు, అనంత జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు పవన్‌కు స్వాగతం పలికారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా శిరివెళ్ళ బయలుదేరారు. విమానాశ్రయం వెలుపల భారీగా అభిమానులు తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

టాపిక్

తదుపరి వ్యాసం