తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Opinion : ఆ దిశగానే ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలి…

Opinion : ఆ దిశగానే ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలి…

HT Telugu Desk HT Telugu

13 January 2024, 13:20 IST

google News
    • Janasena - TDP Manifesto : "ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడడానికి జనసేన-టీడీపీ కూటమి కృషి చేయాలి.ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి…' - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి ఎన్‌.సాంబశివరావు రాజకీయ విశ్లేషణ.
చంద్రబాబు - పవన్
చంద్రబాబు - పవన్ (Janasena Twitter)

చంద్రబాబు - పవన్

Opinion On Jana Sena TDP Manifesto: ‘ప్రతి చేతికి పని ` ప్రతి చేనుకు నీరు’, ‘‘వలసలు, పస్తులు లేని’’ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే దిశగా జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరిగినట్టు ఇటీవల జనసేన ప్రకటించింది. దేశంలో ఎక్కడ చూసినా పోటీపడి ఉచితాలు ఇస్తామంటున్న సమయంలో ఇలాంటి ప్రకటన రావడం రాజకీయాల్లో శుభపరిణామమే. చూడటానికి ఆరు పదాల మాల గుచ్చినట్టు ఉన్నా దీనికి వెనక ఒక తాత్విక సిద్ధాంతం కూడా ఉంది. ఈ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే తరాలను నిలబెట్టే పునాది కాగలదు. అయితే దీనికి షరతులు వర్తిస్తాయి. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా జనసేన-టీడీపీ నాయకత్వాలు త్రికరణశుద్ధితో వీటిని అమలు చేసి చూపించాలి. ఇందుకు ప్రజల ఆకాంక్షలను, రాష్ట్రంలోని సమస్యల్ని, రాష్ట్ర ప్రజల మనసుల్ని లోతుగా అధ్యయనం చేయాలి. అన్ని కోణాల్లో మేధావులతో, ఆర్థిక వేత్తలతో, ప్రజాసంఘాలతో, సకలజనులతో, సమాజంలోని అన్నీ సమూహాలతో సమాలోచనలు జరిపి భవిష్యత్‌ తరానికి జనసేన`టీడీపీ కూటమి దారులు వేయాలి.

గతానుభవాల దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఇచ్చే హామీలపై ప్రజలకు విశ్వసనీయత లేదు. ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని జనసేన-టీడీపీ కూటమి విడుదల చేసే ఉమ్మడి మ్యానిఫెస్టో (కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌) కు జనసేనపార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ రాష్ట్రప్రజలకు జవాబుదారీగా ఉంటూ, ఈ పథకాల అమలుకు పూర్తి బాధ్యత తీసుకుంటేనే ప్రజలు వీరు తీసుకుంటున్న ఉమ్మడి కార్యక్రమాన్ని విశ్వసించే అవకాశాలుంటాయి.

సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ప్రాతిపదికన సామాజిక వ్యవస్థను నిర్మించడానికే రాజ్యాంగాన్ని రాసుకున్నామని మన భారత రాజ్యాంగం ప్రియాంబుల్‌లో చెప్పుకున్నాం. శాంతి భద్రతలు నెలకొల్పాలి, సౌర్వభౌమత్వాన్ని కాపాడాలి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలనే వాటి కోసమే ఒక ప్రభుత్వం కావాలని మన రాజ్యాంగం చెప్పలేదు. కానీ దీనిని పట్టించుకునే రాజకీయపార్టీలు, నాయకులు లేరు. కేవలం అధికారం సొంతం చేసుకోవాలనే ఆత్రంతో ఉచితాలు ప్రకటించడం, వాటి వ్యూహాల కోసం కన్సెల్టెన్సీలకు కోట్ల రూపాయల ఫీజులు ధారపోయడం తప్ప ప్రజలు ఆకాంక్షలు ఏమిటి, వారు కోరుకుంటున్నవేమీటి? అన్నదానిపై ప్రస్తుత రాజకీయ పార్టీలకు, నాయకులకు స్పష్టత లేదు.

సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా….

ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడడానికి జనసేన-టీడీపీ కూటమి కృషి చేయాలి. యువతను ఎంటర్‌ప్రైసర్స్‌గా తీర్చిదిద్దినప్పుడే రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఉపాధి లేక రాష్ట్రంలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న వీరందరూ తిరిగి రావాలంటే, ‘‘ప్రతి చేతికి పని’’ కల్పించడం ఒక్కటే మార్గం. దీని కోసం జనసేన-టీడీపీ కూటమి కుల వృత్తులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలి. ప్రయివేట్‌ సెక్టార్‌ని ప్రోత్సహించి, మండల కేంద్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని యువతకు అక్కడే ఉద్యోగాలు కల్పించాలి. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలి. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా నియామకాలు చేపట్టి, యువతకు భవిష్యత్తుపై నమ్మకం కల్పించాలి. బ్యాక్‌ లాగ్‌ పోస్టులను ఆరు నెలల్లోనే భర్తీ చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు 70 శాతం ప్రజలు నేటికీ వ్యవసాయం, అనుబంధ పనుల్లోనే ఉపాధి పొందుతున్నారు. రైతు పచ్చగుంటేనే, చుట్టూ ఉన్న వాళ్లు కూడా బాగుంటారు. పచ్చని చేను, గిట్టుబాటు ధర మాత్రమే రైతుకు సంతోషాన్ని ఇస్తుంది. రైతు భరోసాలు, పెట్టుబడి సాయం మాత్రం కాదు. రైతే నలుగురికి ఉపాధి కల్పించాలనుకుంటాడు. అన్నదాత సంకల్పానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాలి. పొలాలకు నీరందించడానికి జనసేన-టీడీపీ కూటమి పెండిరగ్‌ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలి. రాష్ట్రంలో చెరువుల్లో పూడిక తీయక, కొత్త కాలువలు తవ్వక పదేళ్లు దాటిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మైనర్‌ ఇరిగేషన్‌కి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ప్రణాళికలు రచించాలి. దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టును నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేయడానికి ప్రణాళిక ప్రకటించాలి. నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి.

వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి….

ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందించాలి. రైతులు, మత్స్యకారుల రక్షణకు పటిష్టమైన చట్టాలను రూపొందించాలి. కౌలు రైతులను ఆదుకోవడంతో పాటు ప్రతి రైతు పండించిన పంటను స్వయంగా అమ్ముకునేలా మండలానికో రైతు సూపర్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయాలి. సామాజిక న్యాయం చేయడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలి. కుల గణన చేపట్టి, ఆయా వర్గాలకు నిధులు అందడంలో సమన్యాయం జరగాలి. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో ఎలాంటి కోత విధించకుండానే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ ప్రకారం కాపులకు రిజర్వేషన్‌ కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను ఆ వర్గాల అభివృద్ధికే ఖర్చుపెట్టేలా చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగంలోని 73,74 అధికరణలు కచ్చితంగా అమలు చేయాలి. స్థానిక సంస్థలను, బలోపేతం చేసి రాజ్యాంగ ప్రకారం న్యాయం జరిగేలా కూటమి చర్యలు తీసుకోవాలి.

ప్రజలు నిజంగా ఉచితాలు కోరుకుంటున్నారా... అనే దానిపై రాజకీయ పార్టీలు అధ్యయనం చేయడంలేదు. పీపుల్స్‌పల్స్‌ బృందం క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ఉచితాలు కావాలని ఎవరు చెప్పడం లేదు. ఉచితంగా అందే పథకాల కంటే ఆత్మ గౌరవంతో బతకడానికి చేతి నిండా పని దొరకాలని కోరుకుంటున్నారు. ఉచితంగా వచ్చే రైతు భరోసా కంటే, తాము పండించిన పంటకు మద్దతు ధర రావాలని, రైతాంగం కోరుకుంటుంది. స్వర్ణాంధ్రప్రదేశ్‌, బంగారు తెలంగాణలు కాదు తమ సొంతకాళ్లపై నిలబడే అవకాశాలు సృష్టించమని ప్రజలు వేడుకుంటున్నారు. రాజకీయ పార్టీలు ఇవేం పట్టించుకోకుండా ఉచితాల పేరుతో జూదమాడుతున్నాయి. ఓటుకు వేళం పాట పాడినట్టు మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి.

టీడీపీ ఇప్పటికే రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికపై నుంచి భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట ప్రకటించిన మినీ మేనిఫెస్టో కూడా ఇదే కోవలోకి వస్తుంది. పీపుల్స్‌పల్స్‌ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ‘‘బాబు ష్యూరిటి-భవిష్యత్‌ గ్యారంటి’’ గురించి ఏ ఒక్కరు ప్రస్తావించడం లేదు. దీనికి ప్రధానకారణం టిడిపి వాటిని అమలు చేస్తుందనే నమ్మకం ప్రజలకు లేకపోవడం. బాబు ష్యూరిటి-భవిష్యత్‌ గ్యారంటి ప్రకటించి దాదాపు 8 నెలల కావొస్తున్నా అందులో ఉన్న అంశాలపై టీడీపీ క్యాడర్‌కు, నాయకులకే అవగాహన లేదన్న విషయం మా క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక చోట్ల ఎదురైంది.

టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చారనే భావన అధికశాతం మంది ప్రజలు భావించడం, ఆయన విశ్వసనీయతపై కూడా ప్రజలకు నమ్మకం లేకపోవడంతో మహానాడులో ప్రకటించిన ‘‘బాబుష్యూరిటి-భవిష్యత్‌గ్యారంటి’’ కి ప్రజలనుండి స్పందన రావడం లేదు. 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన రైతురుణమాఫీ, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలు, అమలు చేయకపోవడంతో టిడిపి అధినేత విశ్వసనీయత కోల్పోయారు. టీడీపీ అధినేత పేదలపక్షం కాదని, సంస్కరణ వాది అని, కార్పోరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తారనే భావన అధికశాతం మంది ప్రజల్లో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ‘‘మనస్సులోని మాట’’ పుస్తకంలో ఉచితాలు ఇవ్వడంపై అనేక వ్యాఖ్యానాలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యానాలకు పూర్తివ్యతిరేకంగా అధికారం కోసం వైఎస్‌ఆర్‌సిపితో పోటీపడి హామీలిస్తున్నారు. ఇది అక్షరసత్యం.

2009 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నగదు బదిలీ పథకాలు, అనేక ఉచితాలు ప్రకటించినా టీడీపీని, మహాకూటమిని ప్రజలు తిరస్కరించారు. దీనికి కారణం చంద్రబాబు విశ్వసనీయతపై ప్రజలకు నమ్మకం లేకపోవడం. 2009 ఎన్నికల సందర్భంగా నగదు బదిలీ పథకం యువనేత నారాలోకేష్‌ ఆలోచన అని అప్పట్లో టీడీపీ నాయకులు, శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత ఆ అంశాన్ని ప్రస్తావించడం మానేసిన విషయం టీడీపీ నాయకులు మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోలేదు. వైఎస్‌ఆర్‌సిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ తూచ తప్పకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా అమలు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దేశంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా ప్రజావ్యతిరేకతను, తిట్లు తింటున్న నాయకుడు ఈయనొక్కరే కావొచ్చు. దీనికి కారణం కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో వివిధ పన్నుల రూపేనా లాక్కుంటారనే భావన అధికశాతం మంది ప్రజలు భావిస్తున్నారు. అమ్మఒడి డబ్బులు ...నాన్నబుడ్డికి సరిపోతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ప్రధానకారణం వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వమే అనే భావనలో ప్రజలున్నారు. ఈ కారణంగా ఎన్ని సంక్షేమపథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి రావాల్సిన ఫలితం దక్కగా పోగా తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

ఉచితాలే కావాలనుకుంటే ప్రజలు మళ్లీ వైఎస్సార్సీపీనే గెలుపించుకుంటారు. ఉచితాలతో దివాళ తీసి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తోందని ఊరు-వాడ ప్రచారం చేసిన టీడీపీ రాజమండ్రి మహానాడులో వైఎస్సార్సీపీతో పోటీ పడి మినీ మేనిఫెస్టోలో ఉచితాలను చేర్చడం ఎంతవరకు సమంజసం? ఇవి సరిపోనట్టు యువగళం పాదయాత్రలో ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ వాటికి మరిన్ని ఉచితాలు చేర్చారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 45 ఏళ్లు పైబడిన మహిళలకు సంవత్సరానికి 18 వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం సరికాదని లబ్ధిపొందినవాళ్లే వాళ్లే అనేక చోట్ల పీపుల్స్‌ పల్స్‌ బృందం క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ప్రస్తావించిన విషయం ఇక్కడ గమనించాలి. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల పైబడిన ప్రతి మహిళకు డబ్బులిస్తామని టీడీపీ తమ మినీ మ్యానిఫెస్టోలో పొందుపరచడాన్ని ప్రజలు ఎందుకు స్వీకరిస్తారు? ఈ అంశంపై టీడీపీ నాయకత్వం అధ్యయనం చేసిందా? లేక కేవలం 2014 ఎన్నికల సందర్భంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామనే విధంగా ఇది మరో బూటకపు వాగ్ధానమా?

ప్రజలు కేవలం సంక్షేమ పథకాలనే కోరుకోరు అని చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. సంక్షేమానికి ఆధ్యుడైన ఎన్టీ రామారావు 1983లో గెలిచిన తర్వాత ప్రకటించిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశారు. అయినా ఆయన 1989లో ఓడిపోయారు. 2004లో వైఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినా 2009 ఎన్నికల్లో ప్రజలు తమకు పాస్‌ మార్కులే వేశారని వైఎస్సార్‌ శాసనసభ సాక్షిగా ప్రకటించడం ప్రజలు కేవలం ఉచిత పథకాలు కోరుకోరని దాంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారనే విషయాన్ని ఆయన ప్రకటన స్పష్టం చేస్తోంది.

డా.వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన ప్రవేశపెట్టిన ప్రతీ ఒక్క సంక్షేమ పథకం 2014 వరకు కొనసాగిన కాంగ్రెస్‌పార్టీ ఘోరపరాజయం పాలైంది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో జయలలిత మరణానంతరం ఆ పార్టీ ఆమె ప్రవేశపెట్టిన ప్రతీ ఒక్క సంక్షేమ పథకం అమలు చేసినా అన్నాడిఎంకే పార్టీ ఓటమి పాలైంది. ఇటీవలే జరిగిన రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్రాల్లో కూడా అనేక సంక్షేమపథకాలు, ఉచితాలు అమలు చేసినా ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌పార్టీ ఓటమిపాలయ్యింది. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే కేవలం ప్రజలు ఉచితాలను మాత్రమే కోరుకోరు. అభివృద్ధిని కోరుకుంటారని స్పష్టమౌతోంది.

ఉచితాలు ఎందుకు తీసుకుంటున్నారు? అని క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు మా రీసెర్చర్లు అడిగినప్పుడు ‘ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం. వాళ్ల జేబుల్లోంచి ఇవ్వడం లేదు కదా?’ అని ప్రజలు సమాధానాలు ఇస్తున్నారు. అధికారమార్పిడి కారణంగా సోషలిజం వస్తుందని ప్రజలు భ్రమపడటం లేదు, కలలు కనడం లేదు. ఆ ఆశలు కూడా వారిలో లేవు. ప్రజలు వాస్తవాలు చెప్తే వినే పరిస్థితుల్లోనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులెన్నో, తప్పులెన్నో వివరంగా చెప్తే డాక్టర్‌ దగ్గర కూర్చున్న పేషెంట్‌లా ప్రజలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితిని తెలియజేసి, మెరుగైన పరిస్థితి తీసుకురావడానికి అవసరమైన వైద్యం, మార్గాలు చూపిస్తే అవకాశం ఇవ్వడానికి మనస్పూర్తిగా అంగీకరిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలి. టీడీపీ రాజమండ్రిలో మహానాడులో పర్యటించిన మినీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇప్పటికిప్పుడు తీసేయడం కూడా మాట ఇచ్చి తప్పినట్టవుతుంది. టీడీపీ అనాలోచితంగా ఇచ్చిన ఉచితాలను, జనసేన ప్రతిపాదించిన ‘ప్రతి చేతికి పని... ప్రతి చేనుకు నీరు’ను ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చి బ్యాలెన్స్‌ చేసినప్పుడే ప్రజల మన్ననలను పొందుతారు.

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలల్లో అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మించడమే లక్ష్యంగా జనసేన-టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలి. దానిని నూరు శాతం పారదర్శకతతో అమలు చేయాలి. అప్పుడే జనసేన-టీడీపీ చెప్తున్న ‘ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరు’, వలసలు, పస్తులు లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మించే ఆస్కారం ఉంటుంది.

- ఎన్‌.సాంబశివరావు,,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

ఎన్‌.సాంబశివరావు,, రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం, లేదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి మాత్రమే. హిందుస్తాన్ టైమ్స్ తెలుగుకు సంబంధం లేదు..)

తదుపరి వ్యాసం