AP Cheap Liquor: ఆ మందు ధర రూ.99 కాదు, కేరళలో రూ.25 మాత్రమే.. చౌకమద్యంలో కొట్టేస్తున్నారని ఆరోపించిన జగన్
20 November 2024, 17:28 IST
- AP Cheap Liquor: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న చౌక మద్యంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళలో రూ.25కు విక్రయించే మద్యాన్ని ఏపీలో రూ.99కు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామన్నారని గుర్తు చేశారు.
ఏపీ ప్రభుత్వ చౌక మద్యం ధరలు
AP Cheap Liquor: ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్న చౌక మద్యంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో సుమో క్లాసిక్ విస్కీ, బెంగుళూరు విస్కీ, రాయల్ లాన్సర్ విస్కీ, ట్రాపికోనా విఎస్‌ఓపీ బ్రాందీ, షాట్ విస్కీ, బ్రాందీ 99, కేరళా మాల్టెడ్ బ్రాందీ పేర్లతో రూ.99కు మద్యం విక్రయిస్తున్నారని, నాణ్యత లేని మద్యాన్ని రూ.99కు విక్రయిస్తున్నారని ఆరోపించారు.
కేరళా మాల్టెడ్ విస్కీ కేరళలో 25రుపాయలు అయితే ఏపీలో రూ.99కు అమ్ముతున్నారని ఆరోపించారు. పాత లిక్కర్ క్వాలిటీ తగ్గించి, 99బ్రాండ్ తెచ్చి అమ్ముతున్నారన్నారు. గతంలో రూ.120కు నాణ్యమైన మద్యం లభించేదన్నారు. కేరళా మాల్ట్ బ్రాండ్‌ను గరిష్టంగా రూ.85కు ఇతర రాష్ట్రాల్లో అమ్మతున్నారని, వైసీపీ హయం కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని గుర్తు చేశారు.
వైసీపీ హయంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మేవారని, ఇప్పుడు మద్యాన్ని బెల్టు షాపులు పెట్టి ఊరురా అమ్ముతున్నారని, ఎమ్మార్పీ ప్లస్ మాఫియా కమిషన్‌కు విక్రయిస్తున్నారని, ఒక్కో బెల్ట్ షాప్‌ను ఒక్కోక్కరికి వేలం పాటలో ఇచ్చేస్తున్నారని, రాష్ట్రంలో మాఫియా రాజ్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మార్పీ ధరకు అమ్ముకోడానికి అయితే ఎమ్మెల్యేలు వేలంలో దుకాణాలు దక్కిన వారిని కిడ్నాప్‌లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మార్పీ ప్లస్ మాఫియా కమిషన్ రావాలని, ప్రభుత్వం నడిపే దుకాణాలు తీసేసి ప్రైవేట్ మాఫియాను ప్రవేశపెట్టారని జగన్ ఆరోపించారు. మద్యం విక్రయాల్లో రెగ్యులర్‌గా స్కామ్‌లు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. వైసీపీ హయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా 16వేల మందికి ఉపాధి కల్పిస్తే కూటమి ప్రభుత్వం రాగానే వారందరిని రోడ్డు పడేశారని మండిపడ్డారు.
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే టీడీపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని జగన్ ప్రశ్నించారు. ఏపీలో ఇప్పుడు మెగా డిఎస్సీలో మెగా లేదని జగన్ ఆరోపించారు.
తమ ప్రభుత్వం 6100పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందని, 6100తోడు అదనంగా మరికొన్ని పోస్టులు కలిపి 16వేల పోస్టులు ఇస్తున్నామని చెప్పారని, అవి కూడా పోస్ట్ పోన్ అయ్యాయని, ఇప్పటికి ఆర్నెల్లు అయ్యాయని ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.
ఆర్నెల్లలో వైసీపీ అధికారంలో ఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి లక్షా 30వేల ఉద్యోగాలను గ్రామ సచివాలయలలో ఉద్యోగాలు ఇచ్చామని, 58వేల ఉద్యోగులను ఆర్టీసీని విలీనం చేసి ఉద్యోగ భద్రత ఇచ్చామని, 2.66లక్షల వాలంటీర్ల నియామకాలు చేశామని, అక్టోబర్ 2నాటికి ఇన్ని ఉద్యోగాలు కల్పించామన్నారు.
చంద్రబాబు వచ్చి ఆర్నెల్లైనా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా 2.66లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు, 16వేల ఏపీబీసీఎల్ ఉద్యోగాలు తీసేశారని ఆరోపించారు