తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Brs Close: ఏపీలో బిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌... ముఖ్యనేతలు జంప్

AP BRS Close: ఏపీలో బిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌... ముఖ్యనేతలు జంప్

Sarath chandra.B HT Telugu

02 February 2024, 7:50 IST

google News
    • AP BRS Close: ఏపీలో బిఆర్‌ఎస్‌  కార్యకలాపాలు ఏవి ప్రారంభం కాకుండానే మూతబడిపోతోంది.  దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా విస్తరించే క్రమంలో ఆవిర్భవించిన పార్టీని ఏపీలో నడిపించే వారే కరువయ్యారు. 
చిరంజీవితో భేటీ అయిన తోట చంద్రశేఖర్
చిరంజీవితో భేటీ అయిన తోట చంద్రశేఖర్

చిరంజీవితో భేటీ అయిన తోట చంద్రశేఖర్

AP BRS Close: ఏపీలో బిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అయిపోయినట్టే కనిపిస్తోంది. ఆ పార్టీ ముఖ్య నాయకులు ఇద్దరు చెరోదారి చూసుకున్నారు. రాజకీయాల్లో భవిష్యత్తు వెదుక్కుంటూ కొన్నేళ్ల క్రితం పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి, బిఆర్‌ఎస్‌ గూటికి చేరిన మాజీ బ్యూరోక్రాట్లు ఇద్దరు చెరో దారి అయ్యారు.

ఏపీ బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ మళ్లీ జనసేన గూటికి చేరుతున్నారు. గుంటూరు నుంచి నాలుగో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. 2009 నుంచి రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోడానికి మాజీ బ్యూరోక్రాట్‌ తహతహలాడుతున్నా ఫలితం మాత్రం ఉండట్లేదు.

తోట చంద్రశే‌ఖర్‌తో పాటు ఏపీలో బిఆర్‌ఎస్‌ ఏదో అద్భుతాలు చేసేస్తుందని ఆశించి భంగపడిన రావెల కిశోర్‌బాబు రెండు రోజుల క్రితం వైసీపీ గూటికి చేరిపోయారు. తోట చంద్రశేఖర్‌తో పోలిస్తే రావెల కిశోర్‌బాబు కనీసం చట్టసభలో అడుగు పెట్టే అవకాశమైనా లభించింది. ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. పలు పార్టీలు మారినా పలితం లేకపోవడంతో చివరకు వైసీపీలో తేలారు.

మహారాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌గా 23 ఏళ్లపాటు పనిచేసిన చంద్రశేఖర్‌ ఆ పదవికి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పటికే స్థిరాస్తి వ్యాపారాల్లో సత్తా చాటుకున్న తోట చంద్రశేఖర్‌ 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.

2014లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి పరాజయం పాలయ్యారు. 2019లో జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. ముచ్చటగా మూడు సార్లు మూడు పార్టీల నుంచి పోటీ చేసినా ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో నాలుగోసారి పోటీకి రెడీ అవుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఈ నెల 4న పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

బిఆర్‌ఎస్‌ బాధ్యతలు…

2019 ఎన్నికల ఫలితాల తర్వాత కొంత కాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన తోట చంద్రశేఖర్‌, రావెల కిశోర్‌లు అనూహ్యంగా ఏపీ బిఆర్‌ఎస్‌ బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యక్రమాల కోసం గుంటూరులో ఏకంగా పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఏపీ రాష్ట్ర శాఖను ఆర్బాటంగా ప్రకటించినా ఆ తర్వాత మాత్రం దాని అచూకీ లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా సమావేశాన్ని బిఆర్‌ఎస్‌ ఏపీలో నిర్వహించ లేకపోయింది. ఒకటి రెండు సార్లు ప్రెస్‌మీట్లు తప్ప బిఆర్‌ఎస్‌ తరపున ఏపీలో చెప్పుకోదగిన కార్యక్రమాలు ఏమి నిర్వహించలేదు.

తెలంగాణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు బిఆర్‌ఎస్ పేరుతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, సోలాపూర్‌ వంటి ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఈ కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణకు పొరుగూనే ఉన్న ఏపీలో మాత్రం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర శాఖ ఏర్పాటు నుంచి చెబుతూ వచ్చినా అది మాటలకే పరిమితం అయ్యింది.

ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం ఎందుకని కేసీఆర్‌ భావించారో, ఏపీలో ఉన్న నాయకులు ఆసక్తి చూపించలేదో కాని ఏపీ బిఆర్‌ఎస్ మాత్రం ఎలా వచ్చిందో అలాగే నిష్క్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ ఏపీని సీరియస్‌గా తీసుకునే అవకాశాలు లేవు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో బిఆర్‌ఎస్‌ బాధ్యతలు భుజానికి ఎత్తుకునే నాయకులు కూడా ఉండకపోవచ్చు.

చిరంజీవితో మంతనాలు…

జనసేన తరపున పోటీ చేయడానికి రెడీ అవుతున్న చంద్రశేఖర్‌ తాజాగా చిరంజీవితో భేటీ అయ్యారు. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ సీటును ఆశిస్తున్న తోట చంద్రశేఖర్…లాబీ కోసమే చిరంజీవితో చర్చలు జరిపినట్టు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం